Prajwal Revanna | ప్రజ్వల్‌ రేవణ్ణ డిప్రెషన్‌లో ఉన్నాడట.. సిట్‌ ముందు హాజరయ్యే తేదీ చెప్పిన ఎంపీ

సెక్స్‌ వీడియోల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉండి.. విదేశలకు పారిపోయిన జేడీఎస్‌ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ ఎట్టకేలకు నెల రోజుల తర్వాత నోరు విప్పారు.

Prajwal Revanna | ప్రజ్వల్‌ రేవణ్ణ డిప్రెషన్‌లో ఉన్నాడట.. సిట్‌ ముందు హాజరయ్యే తేదీ చెప్పిన ఎంపీ

బెంగళూరు: సెక్స్‌ వీడియోల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉండి.. విదేశలకు పారిపోయిన జేడీఎస్‌ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ ఎట్టకేలకు నెల రోజుల తర్వాత నోరు విప్పారు. ఈ కేసును స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. తాను డిప్రెషన్‌లో ఉన్నానని చెప్పుకొన్నాడు. తన తాత మాజీ ప్రధాని దేవెగౌడకు క్షమాపణలు చెప్పాడు.

సిట్‌ అధికారుల ముందు దర్యాప్తునకు మే 31వ తేదీ ఉదయం పది గంటలకు హాజరవుతానని తెలిపాడు. ‘నేను ఎక్కడ ఉన్ననో స్పష్టత ఇచ్చేందుకు ఈ వీడియో చేస్తున్నాను. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత వివిధ కారణాలపై నాపై కేసులు నమోదయ్యాయి. వాటిపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు. నా విదేశీ పర్యటనకు ఈ కేసులతో సంబంధం లేదు. ఇది ముందే నిర్ణయించుకున్న ట్రిప్‌. నాకు సిట్‌ నోటీసులు ఇచ్చినట్టు నా న్యాయవాది ద్వారా తెలుసుకుని దానికి స్పందించాను’ అని రేవణ్ణ వీడియోలో వెల్లడించాడు.

తనపై కాంగ్రెస్‌ నాయకులు దాడి ఎక్కుపెట్టడంతో తాను మానసికంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపాడు. ‘రాహుల్‌ గాంధీ సహా అనేక మంది కాంగ్రెస్‌ నాయకులు నాపై వదంతులు సృష్టించడంతో నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఏకాంతంగా గడుపుతున్నాను. నా కెరీర్‌ను నాశనం చేసేందుకు రాజకీయ కుట్ర జరుగుతున్నది. దానిని నేను ఎదుర్కొంటాను’ అని పేర్కొన్నాడు. సిట్‌ విచారణకు మే 31వ తేదీ ఉదయం పది గంటలకు హాజరవుతానని చెప్పాడు. ‘బెంగళూరులోని సిట్‌ కార్యాలయానికి వస్తాను. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తాను. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉన్నది. న్యాయ వ్యవస్థ ముందు నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటాను’ అని ప్రజ్వల్‌ రేవణ్ణ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన తాత, మాజీ ప్రధాని దేవెగౌడకు, తన బాబాయి కుమారస్వామికి ఆయన క్షమాపణలు చెప్పాడు.

గతవారం హెచ్‌డీ దేవెగౌడ ప్రజ్వల్‌కు ఒక వార్నింగ్‌ లెటర్‌ రాశారు. వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోరారు. న్యాయ విచారణను ఎదుర్కొనాల్సిందేనని స్పష్టం చేస్తూ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇది విజ్ఞప్తి కాదని, వార్నింగ్‌ అని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే.. ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసి, ఆయనను భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే.