Priyanka Gandhi | నిరుద్యోగం, ధరల పెరుగుదలే అతిపెద్ద సమస్యలు

నిరుద్యోగం, ధరల పెరుగుదల ఈ రెండే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.

Priyanka Gandhi | నిరుద్యోగం, ధరల పెరుగుదలే అతిపెద్ద సమస్యలు

ఇండియా కూటమికి మెజార్టీ ఖాయం
ఓటు వేసిన అనంతరం ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: నిరుద్యోగం, ధరల పెరుగుదల ఈ రెండే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సంపూర్ణ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్గతంగా పరిస్థితి తమకు సానుకూలంగా ఉన్నదని చెప్పారు. శనివరాం ఉదయం తన ఓటు హక్కును వినియోగిచుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ నేతలు ఆప్‌ అభ్యర్థులకు, ఆప్‌ నేతలు కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటు వేయడం గురించి ప్రస్తావించగా.. ‘మా మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం ఓటు వేశాం. నాకు గర్వంగా ఉన్నది’ అని బదులిచ్చారు. దేశంలో అంతర్గతంగా తమకు సానుకూల వాతావరణం ఉన్నదని ప్రియాంక తెలిపారు. ‘బీజేపీ నాయకుల అన్ని అంశాలూ మాట్లాడుతారు కానీ.. నిరుద్యోగం, ధరల పెరుగుదల గురించి మాత్రం చర్చించరు. జనం విసుగెత్తిపోయి ఉన్నారు’ అని ఆమె అన్నారు.

కాంగ్రెస్‌కు ఏ అంశాలు సానుకూలంగా పనిచేస్తున్నాయన్న ప్రశ్నకు.. ‘మేం తొలి నుంచీ ప్రజల అంశాల గురించి మాట్లాడుతున్నాం. అవే అంశాలపై ప్రచారం చేస్తున్నాం. మా మ్యానిఫెస్టో కూడా అవే అంశాలను ప్రస్తావిస్తున్నది’ అని ప్రియాంక తెలిపారు. ప్రియాంకతోపాటు ఆమె భర్త రాబర్ట్‌ వాధ్రా, కుమార్తె మిరయా వాధ్రా, కుమారుడు రైహాన్‌ వాధ్రా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకున్న మిరయా వాధ్రా ‘ప్రజలు కదిలొచ్చి ఓటువేయాలని కోరుతున్నాను. అదొక్కటే నా సందేశం’ అని చెప్పారు.