గవర్నర్లు చేస్తున్న ఆ పనిపై పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాల ఆగ్రహం.. సుప్రీంకోర్టులో పిటిషన్లు

న్యూఢిల్లీ : తాము రాష్ట్ర అసెంబ్లీల్లో ఆమోదం పొందిన బిల్లులకు, ప్రతిపాదిత బిల్లులకు ఆమోదం విషయంలో గవర్నర్‌లు చేస్తున్న తీవ్ర జాప్యాన్ని సవాలు చేస్తూ పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం, తమిళనాడులోని డీఎంకే సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 28న పిటిషన్లు దాఖలు చేశాయి. గవర్నర్‌ల వద్దకు వచ్చే బిల్లులు సకాలంలో ఆమోదం పొందేలా కోర్టు జోక్యం చేసుకోవాలని కోరాయి.
పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ లిస్ట్ కాగా.. తమిళనాడు పిటిషన్‌పై సమాచారం తెలియాల్సి ఉన్నది. నాలుగవ బడ్జెట్ సెషన్‌లో ప్రతిపాదించేందుకు సంబంధించిన మూడు మనీ బిల్లులకు ఆమోదం విషయంలో గవర్నర్ పురోహిత్‌కు, మాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమయ్యాయి.
ఈ సమావేశాల్లో ప్రతిపాదించేందుకు ఉద్దేశించిన బిల్లులను గవర్నర్ వద్దకు పంపినా.. బిల్లులు ప్రవేశపెట్టడానికి ఆమోదించకపోగా.. జూన్ 20న బడ్జెట్ సమావేశాలు ముగిసినందున ఇటువంటి ప్రత్యేక సమావేశాలు, వాటిలో చేపట్టే వ్యవహారాలు చట్ట వ్యతిరేకమని చెప్పారు. దీంతో సభలో చెలరేగిన గొడవతో ప్రారంభమైన కొద్దిసేపటికే సభ వాయిదా పడింది. గవర్నర్ ఆమోదం లభించకపోవడంపై ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. గవర్నర్‌పై తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ప్రకటించారు.
పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనున్న విషయం తెలియడంతో ముఖ్యమంత్రి మాన్‌కు ఒక లేఖ రాసిన గవర్నర్ పురోహిత్.. పెండింగ్‌లో ఉన్న బిల్లులపై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు అందులో తెలిపారు. బడ్జెట్ సమావేశాల ఏర్పాటు చేయడానికి కూడా పురోహిత్ నిరాకరించడంపై గతంలో కూడా మాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. మంత్రి మండలి విజ్ఞప్తి మేరకు సమావేశాల ఏర్పాటుకు గవర్నర్ సమ్మతించడంతో అప్పుడు ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
తమిళనాడు గవర్నర్‌ది మరో కథ
తాము సైతం గవర్నర్ నుంచి ఇదే తరహా సమస్యలు ఎదుర్కొంటున్నామని తమిళనాడు ప్రభుత్వం చెబుతున్నది. ప్రస్తుతం గవర్నర్ ఆర్ ఎన్ రవి ముందు అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధుల విచారణ, వివిధ ఖైదీల ముందస్తు విడుదల తదితర బిల్లులను గవర్నర్ తొక్కిపట్టారని ప్రభుత్వ నేతలు విమర్శిస్తున్నారు.
ఈ విషయంలో న్యాయవాది సబరీశ్ సుబ్రమణియన్ ద్వారా పిటిషన్ దాఖలు చేసిన తమిళనాడు ప్రభుత్వం.. నిర్దిష్టకాల పరిధిలో బిల్లులను గవర్నర్ క్లియర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును అభ్యర్థించింది. సర్కారియా కమిషన్ సిఫారసుల మేరకు.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు నిర్దిష్ట కాలపరిమితిలో సమ్మతి తెలుపడంపై గవర్నర్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా కోరింది. జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగపాఠంలో కొన్ని భాగాలను గవర్నర్ చదవకపోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో జాతీయ గీత ఆలాపనకు ముందే గవర్నర్ అసెంబ్లీ నుంచి వెళ్లిపో యారు.
గత కొద్ది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్‌లకు మధ్య తలెత్తుతున్న వివాదాలపై తరచూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ విషయంలో ఏప్రిల్‌లో ఒక దఫా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సాధ్యమైనత త్వరలో బిల్లులకు సమ్మతి తెలిపే బాధ్యత రాజ్యాంగంలోని 200వ అధికరణం ప్రకారం గవర్నర్‌లకు ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో కీలకమైన పది బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.