Rahul Gandhi On Vote Chori | ఓట్ల చోరీపై మరోసారి రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఆరోపణలు, ఈసీ ఖండన. కాంగ్రెస్-బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశంకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఢీల్లీలో మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశంపై మరిన్ని వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఎన్నికల సంఘంపై కీలక ఆరోపణలు చేశారు. అక్రమంగా తొలగించిన ఓటర్ల జాబితాలోని వ్యక్తులను మీడియా ముందుంచారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. కర్ణాటకలోని అలంద్‌లో ఆరువేల ఓట్లను తొలగించారని..కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియ సాగిందన్నారు. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న బూత్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఓట్ల తొలగింపు జరిగిందని..తద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీన పడిందని రాహుల్ గాంధీ తెలిపారు. వీటి గురించి కర్ణాటకలో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈసీకి తెలిపినా పట్టించుకోలేదన్నారు. చివరికి ఎవరో పట్టుబడ్డారన్నారు. ఇది చాలా నేరాల మాదిరిగానే యాదృచ్చికంగా పట్టుబడినట్లు తెలిపారు. ఓట్ల తొలగింపుకు ఉపయోగించిన ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి?.. వాటిని ఎవరు ఆపరేట్ చేశారు?..సూర్యకాంత్ పేరుతో 12 నిమిషాల వ్యవధిలో 14 దరఖాస్తులు వెళ్లాయని రాహుల్ వివరించారు.
ప్రతిపక్షాల ఓటర్లను లక్ష్యంగా తొలగింపులు
ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను మరీ ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని..అదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతోందని…వ్యక్తులతో గాకుండా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఓటర్లను లిస్ట్ నుంచి తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. చాలా ప్రాంతాల్లో మైనార్టీలు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారన్నారు. దీనికి సంబంధించి మేం 100 శాతం ఆధారాలను గుర్తించాం అని తెలిపారు. రాహుల్ గాంధీ కర్ణాటక అలంద్ నియోజకవర్గంలో ఓట్ల మోసం జరిగిందని ఆరోపిస్తూ కొన్ని ఆధారాలు చూపించారు. కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న బూత్‌లలో ఈ మోసం జరిగిందని, గోదాబాయ్ పేరుతో ఫేక్ లాగిన్ ఉపయోగించి 12 ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగిందని ఆయన తెలిపారు. ఓట్ల తొలగింపు కోసం ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ఉపయోగించారని, ప్రతి బూత్‌లో మొదటి ఓటరును దరఖాస్తుదారుగా చూపేలా చేశారని వెల్లడించారు. ఎక్కువ ఓట్లు తొలగించిన టాప్ 10 బూత్‌లన్నీ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రాంతాల్లో ఉన్న చోటనే జరిగాయని రాహుల్ ఆరోపించారు. నేను ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియను విశ్వసిస్తానని..అయితే ఈ రకమైన లక్ష్య పూరిత తప్పులపై ఎలా స్పందించాలనేది మీ చేతుల్లోనే ఉంటుందన్నారు .మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని రాహుల్ గాంధీ తెలిపారు.
ఇది ఓటర్ల హక్కులపై కుట్ర
ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదని, లక్షలాది మంది ఓటర్ల హక్కులపై జరుగుతున్న కుట్రగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో తేడాలు, అక్రమాలు సరిచేయాల్సిన సమయం వచ్చిందని, ఈ చీకటి రాజకీయం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. భారీ స్థాయిలో జరిగిన ఓటర్ల తొలగింపులపై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నవారిని రక్షిస్తున్నారని భావించాల్సి ఉంటుందని తెలిపారు., ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనమవుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఆరోపణలు అవాస్తవం : కేంద్ర ఎన్నికల సంఘం
ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రతిపక్ష ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు అవాస్తమవని కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. అదంతా నిరాధార, అసత్య ప్రచారమని వెల్లడించింది. ఆన్‌లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఓట్ల తొలగింపు ప్రక్రియలో సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదని..అలాగే ఆన్‌లైన్‌లో మరెవరూ తొలగించలేరని సీఈసీ పేర్కొంది. 2023లో అలంద్ అసెంబ్లీ నియోజవర్గంలో ఓటర్ల తొలగింపు వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసిందని గుర్తు చేసింది. రికార్డుల ప్రకారం.. అలంద్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్ నేత బీఆర్ పాటిల్ గెలుపొందారు అని ఈసీ వెల్లడించింది.
రాహుల్ విమర్శలపై బీజేపీ మండిపాటు
ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన బీహార్ పర్యటన సందర్భంగా స్పందించారు. ఓట్ల తొలగింపుపై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు ఖండించారు. బీహార్‌లో అక్రమ ఓటర్లను తొలగించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. బీజేపీపై అబద్ధాలను వ్యాప్తి చేసి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
రాహుల్ ఆరోపణలపై మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్‌కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదని..2014 నుంచి ప్రధాని మోదీ సాధిస్తున్న విజయాలను తక్కువ చేసి చెప్పడం ద్వారా దేశ ప్రజలను, ఓటర్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు, రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు పేలుస్తానరి చెప్పారని.. ఆ బాంబ్ ఇలాగే ఉంటుందా..? అని ఎద్దేవా చేశారు. బీజేపీ మరో సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ సైతం రాహుల్ గాంధీ ఆరోపణలను కొట్టిపారేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దాదాపు 90శాతం ఓటమి చవిచూసిందని, దాంతో ఆయన అసహనం రోజురోజుకూ పెరుగుతోందని ఎద్దేవా చేశారు. తప్పుడు ఆరోపణలు చేసి క్షమాపణలు కోరడం, కోర్టు మందలింపులకు గురికావడం ఆయనకు పరిపాటిగా మారిపోయాయని అన్నారు. బంగ్లాదేశ్, నేపాల్ తరహా అశాంతి భారత్‌లో సృష్టించాలని రాహుల్ భావిస్తున్నారని ఆరోపించారు.