రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ వెనుక ఇదీ కథ!
రాయ్‌బరేలీ! కాంగ్రెస్‌కు గ్యారెంటీగా గెలిచే నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ సోనియాగాంధీ పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక ఇక్కడి నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి

న్యూఢిల్లీ: రాయ్‌బరేలీ! కాంగ్రెస్‌కు గ్యారెంటీగా గెలిచే నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ సోనియాగాంధీ పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక ఇక్కడి నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అమేథీలో మరోసారి రాహుల్ బరిలో దిగుతారని అంచనాలు వేశారు. కానీ.. వాటన్నింటినీ పక్కకుపెట్టి రాహుల్‌గాంధీని రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ బరిలో దింపింది.
అమేథీ నుంచి రాహుల్ గాంధీ మళ్లీ బరిలో ఉంటే.. బీజేపీ తన యావత్ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి ఆయనను ఓడించేందుకు ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా రాహుల్‌ను రాయ్‌బరేలీ నుంచి పోటీకి పెట్టిందనే చర్చ నడుస్తున్నది. రాహుల్, బీజేపీ సిటింగ్ ఎంపీ స్మృతి ఇరానీ మధ్య పోటీ జరిగితే మీడియా ప్రచారం మొత్తం అమేథీ కేంద్రంగా సాగుతుందని, దాని వల్ల కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి ప్రచారం దృష్టిమళ్లుతుందని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు.
అమేథీ నుంచి రాహుల్ పారిపోయారనే ప్రచారాన్ని కూడా బీజేపీ గట్టిగా చేస్తుందనే కఠిన వాస్తవం తెలిసి కూడా పార్టీ వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రధాని మోదీ తన ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి రాయ్‌బరేలీకి పారిపోయారని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక విధంగా ఇది బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాహుల్ పోటీతో స్మృతి ఇరానీకి మైలేజ్ పెరిగేదని, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు.
ప్రియాంక బరిలో దిగినా బీజేపీ తన సహజసిద్ధమైన కుటుంబవారసత్వ రాజకీయాల అంశాన్ని వాడుకునేదని సదరు కాంగ్రెస్ సీనియర్ నేత అంటున్నారు. అయితే.. ఇప్పుడు సిటింగ్ స్థానమైన వాయనాడ్‌ను వదిలేస్తారనే దుష్ప్రచారం కూడా బీజేపీ నేతలు చేయవచ్చని, అయితే.. దక్షిణాదిలో పోటీ చేయడంతోపాటు.. ఉత్తరాదిలో కాంగ్రెస్‌కు బలమైన రాయ్‌బరేలీని నిలుపుకోవడం కూడా పార్టీకి కీలక అంశమని ఆయన చెప్పారు. ప్రియాంక కూడా తాను ఎన్నికల్లో పోటీ చేయడం కంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనటంపైనే ఎక్కువ కేంద్రీకరించాలని భావిస్తున్నారని, ఇదే అంశాన్ని ఆమె పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముందే చెప్పారని సమాచారం.