రాహుల్‌ గాంధీ ఎప్పుడూ తెల్లని టీ షర్ట్‌ ఎందుకు ధరిస్తున్నారు?

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ వస్త్రధారణను గమనించారా? ప్రత్యేకించి భారత్‌ జోడో యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆయన తెల్లని టీషర్ట్‌ను ధరిస్తున్నారు

రాహుల్‌ గాంధీ ఎప్పుడూ తెల్లని టీ షర్ట్‌ ఎందుకు ధరిస్తున్నారు?

2 నిమిషాల వీడియో విడుదల చేసిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ వస్త్రధారణను గమనించారా? ప్రత్యేకించి భారత్‌ జోడో యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆయన తెల్లని టీషర్ట్‌ను ధరిస్తున్నారు. దానికి చాలా మంది చాలా కారణాలు చెప్పినా.. కాంగ్రెస్‌ మాత్రం రెండు కారణాలు తెలిపింది. అందులో ఒకటి తెలుపు రంగు.. పారదర్శకతను సూచిస్తుంది. అదే సమయంలో నిరాడంబరతకు నిదర్శనంగా ఉంటుంది. వాస్తవానికి గతంలో అనేక సందర్భాల్లో ఈ ప్రశ్నకు రాహుల్‌ గాంధీ సమాధానం ఇచ్చారు. వాటితో కూడిన రెండు నిమిషాల వీడియోను కాంగ్రెస్‌ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఆదివారం విడుదల చేసింది.

కర్ణాటకలో ప్రచారం చేసిన సందర్భంగా ఈ ప్రశ్నకు రాహుల్‌ మరోసారి ఆ వీడియోలో సమాధానం ఇవ్వటం కనిపిస్తుంది. ‘నా దృష్టిలో అధికారం సాధించే క్రమంలో ఒక పెద్ద సంస్థగా సిద్ధాంతం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. పేదలకు అనుకూలమైన, మహిళలకు అనుకూలమైన, బహుళమైన, అందరినీ సమదృష్టితో చూడాలనే మా సిద్ధాంతానికి ప్రజలను మేం ఒప్పించాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు. ‘సంస్థాగత స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ పోరాటం ఎప్పుడూ సిద్ధాంతాల గురించే’ అని అన్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీ తెల్లని టీషర్ట్‌ ఒక ట్రేడ్‌మార్క్‌గా మారింది. ఎందుకు తెల్లని టీ షర్టే వస్తారని మరొకరూ ప్రశ్నించగా.. పారదర్శకత, నిరాడంబరత్వం.. నేను అసలు దుస్తుల విషయంలో పెద్దగా పట్టించుకోను. సింపుల్‌గా ఉండటానికే నేను ప్రాధాన్యం ఇస్తాను’ అని రాహుల్‌ తెలిపారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి 70 రోజులుగా తాను ప్రజల మధ్యే ఉన్నానని రాహుల్‌ చెప్పారు. ఇదొక ప్రచార క్యాంపెయిన్‌ మాత్రమే కాదని, కానీ దానికోసం ఎంతగానో కష్టపడాల్సి వచ్చిందని అన్నారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉపన్యాసాలు చేయడం తనకు ఇష్టమన్న రాహుల్‌.. దేశం ఏం కావాలని కోరుకుంటున్నదో ప్రజలు అర్థం చేసుకునేందుకు అవి దోహదం చేస్తాయని ఆ వీడియోలో రాహుల్‌ అన్నారు. ఇదే వీడియోలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను ప్రచారంలో ఆయన ఇష్టాయిష్టాల గురించి రాహుల్ ప్రశ్నించగా.. ‘ఇందులో చెడేమీ లేదు. ఇది చాలా మంచిది. ఎందుకంటే దీనిని మనం ఈ దేశం కోసం చేస్తున్నాం’ అని ఖర్గే బదులిచ్చారు. ఎవరన్నా దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. మనం దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించడం మంచిగా అనిపిస్తుంది. ఆ విధంగా దేశం కోసం ఎంతో కొంత చేసినవాళ్లం అవుతాం’ అని ఖర్గే అన్నారు.