ఇది దేశ వ్యతిరేక బిల్లు : రాహుల్ గాంధీ

మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును దేశ వ్యతిరేక బిల్లుగా రాహుల్ గాంధీ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల హక్కులు లాక్కుంటున్నారని ఆరోపించారు.

విధాత : మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు మహిళా సాధికారిత కోసం పెట్టిన బిల్లు కాదు అని, ఈ బిల్లు ద్వారా దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల హక్కులను లాక్కుంటున్నారని లోక్ సభ కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ బిల్లు దేశం మ్యాప్ ను మార్చేదిగా ఉందని, శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ ఈ బిల్లుతో కుట్ర చేస్తుందని మండిపడ్డారు. దేశం ఆత్మను చంపే ప్రయత్నాలను అడ్డుకుంటాం అని స్పష్టం చేశారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగం కంటే మనువాదానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. హిందువుల పార్టీ అంటూనే వారిని మోసం చేస్తున్నారు అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అవమాన కర చర్య అని, పాత బిల్లునే మళ్లీ తీసుకొచ్చి అమలు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ బిల్లు పాస్ కాదని బీజేపీకి తెలుసు అని, ఈ బిల్లు పాస్ కాకూడదన్నదే బీజేపీ అసలు ఉద్దేశం అన్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో ప్రధాని మోదీ ఇంద్రజాలం చేస్తున్నారని, రకరకాల ట్రిక్కులు ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ట్రిక్కులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

మహిళా రిజర్వేషన్ పేరుతో ప్రధాని మోదీ తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. నాకు మా నానమ్మ ఓ విద్యను నేర్పించారు అని, ప్రజాసమస్యలు చూసేందుకు త్రినేత్రంతో చూడాలని చెప్పారని, అయితే ఇంద్రజాలకుడు మోదీ తన ఆప్త మిత్రుడికి అన్ని విధాలుగా లబ్ధి కలిగేలా చేస్తున్నారు అని రాహుల్ ఆరోపించారు. మోదీ రహస్యాలు అన్ని ట్రంప్ దగ్గర ఉన్నాయి అని, ట్రంప్ బ్లాక్ మెయిలింగ్ కు మోదీ భయపడుతున్నారని విమర్శించారు.

నేను ఇరవై ఏళ్లలో చేయలేని పనిని నా సోదరి చేసింది…
గురువారం సాయంత్రం లోక్‌సభలో ప్రియాంక గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావించిన రాహుల్‌ గాంధీ.. ’నేను నిన్న నా సోదరి ఐదు నిమిషాల్లో చేసిన పనిని నేను నా 20 ఏళ్ల పొలిటికల్‌ కెరీర్‌లో చేయలేక పోయాను.. అది.. అమిత్‌షా ముఖంలో నవ్వు తెప్పించడం..’ అని అన్నారు.

నాకు మోదీకి భార్య ఇష్యూ లేదు
మనందరి జీవితాల్లోనూ తల్లులు, అక్కలు, భార్యలు మనపై ప్రభావం చూపారు. వారు ఎన్నో నేర్పారు. అయితే, నాకు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి భార్యల విషయంలో అనుభవం లేదు కాబట్టి.. మాకు ఆ రకమైన సలహాలు లభించవు..’అని వ్యాఖ్యానించినప్పుడు లోక్‌సభలో నవ్వులు పూశాయి.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

కేంద్రంపై విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న ప్రసంగానికి బీజేపీ సభ్యులు పలుమార్లు అడ్డుపడ్డారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజుజు, రాజ్ నాధ్ సింగ్ లు మండిపడ్డారు. దేశ ప్రధాని మోదీని ఇంద్రజాలికుడు అని రాహుల్ మాట్లాడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ప్రధానిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ మహిళా, ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని కిరణ్ రిజుజు ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబీర్ల అభ్యంతరం తెలిపారు. సభలో ఇలాంటి మాటలు సరికాదని సూచించారు. ప్రధానిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

సంపాదనలో అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే నం.1
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌

Latest News