ఢిల్లీలో మల్లారెడ్డి కోడలు..ప్రధాని మోదీతో భేటీ!

మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆమె బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి.

ఢిల్లీలో మల్లారెడ్డి కోడలు..ప్రధాని మోదీతో భేటీ!

హైదరాబాద్ : లోక్ సభలో మహిళారిజర్వేషన్ సవరణ, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ పార్టీల మహిళా నేతల సందడి నెలకొంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి, చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఢిల్లీలో ప్రత్యక్షమవ్వడం రాజకీయంగా ఆసక్తి రేపింది. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో ప్రీతిరెడ్డి, మామ మల్లారెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం విశేషం. ప్రీతిరెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మామ బీఆర్ఎస్ లో ఉన్నప్పటికి తాను మాత్రం బీజేపీ వైపు ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ప్రీతిరెడ్డి వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లుగా సమాచారం. ఇప్పుడు ప్రధాని మోదీతో భేటీ ద్వారా.. ఆమెను బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపే దిశగా మల్లారెడ్డి పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.

రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే సోషల్ మీడియా సాధనంగా ప్రీతిరెడ్డి ప్రజల్లో సెలబ్రెటీగా మారిపోయారు. త్వరలో జీహెచ్ఎంసీ మూడు కార్పోరేషన్ల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రీతిరెడ్డి బీజేపీలో చేరితే ఆయా కార్పోరేషన్లలో బీజేపీకి కొత్త ఊపు రావచ్చని కమల దళం అంచనా వేస్తుంది.మల్లారెడ్డి లాంటి మాస్ లీడర్ తోడైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది.

కోడలు ప్రీతిరెడ్డి కోసం ఎంపీ టికెట్?

మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డికి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ప్రీతిరెడ్డి గతంలోనే తనకు పార్లమెంటుకు వెళ్లాలనే కోరిక ఉందని బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవలే ఆమె బీజేపీ కీలక నేత బండి సంజయ్‌ను కూడా కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. మల్కాజిగిరి లేదా మరేదైనా కీలక స్థానం నుండి ప్రీతిరెడ్డిని బీజేపీ తరపున బరిలోకి దించేలా మల్లారెడ్డి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. తన రాజకీయ అనుభవాన్ని, ఆర్థిక బలాన్ని బీజేపీకి అండగా ఉంచి, తన కోడలిని ఎంపీగా గెలిపించుకోవాలనేది మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఒకవేళ ప్రీతిరెడ్డికి బీజేపీ టికెట్ ఖరారైతే, ఆమెతో పాటు మల్లారెడ్డి కూడా పార్టీ మారడం ఖాయమని సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

సమగ్ర కుటుంబ సర్వే ఎక్స్ పర్ట్ కమిటీకి సన్మానం
హైదరాబాద్ లో సూర్య ప్రతాపం !