Railway Accident Prevention | రైల్వే భద్రతకు పెద్దపీట.. మొత్తం బడ్జెట్‌లో సగం దీనికే!

దేశంలో రైల్వే ప్రమాదాలను తగ్గించి ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్నది. 2025లో రైల్వే ప్రమాదాల నివారణకు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించగా, 2026లో రెండు శాతం పెంచి 1.16 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేయనున్నారు. 2027లో రైల్వే బడ్జెట్‌లో సగం మొత్తం అనగా రూ.1.3 లక్షల కోట్లు కేటాయించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నదని సమాచారం.

  • By: TAAZ |    national |    Published on : Dec 25, 2025 8:30 PM IST
Railway Accident Prevention | రైల్వే భద్రతకు పెద్దపీట.. మొత్తం బడ్జెట్‌లో సగం దీనికే!

Railway Accident Prevention | దేశంలో రైల్వే ప్రమాదాలను తగ్గించి ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2025 సంవత్సరంలో రైల్వే ప్రమాదాల నివారణకు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించగా, 2026 సంవత్సరంలో రెండు శాతం పెంచి 1.16 లక్షల కోట్లు కేటాయించి ఖర్చు చేయనున్నారు. 2023 సంవత్సరంలో 1.01 లక్షల కోట్లు మాత్రమే భద్రత పనుల కోసం వెచ్చించారు. ఆ మరుసటి సంవత్సరం అనగా 2024 లో 1.14 లక్షల కోట్లు ఖర్చు చేశారు. 2027లో రైల్వే బడ్జెట్‌లో సగం మొత్తం అనగా రూ.1.3 లక్షల కోట్లు కేటాయించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నదని సమాచారం.

భారతీయ రైల్వేలకు దేశవ్యాప్తంగా ట్రాక్ పొడవు 1,35,207 కిలోమీటర్లు ఉండగా, రూట్ పొడవు 69,181 కిలోమీటర్ల దూరం ఉంది. 99.1 శాతం ట్రాక్‌ల విద్యుదీకరణ పూర్తి కాగా, 1.2 మిలియన్ల మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి నిత్యం సగటున 2.5 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 1951 సంవత్సరంలో 42 రైల్వే కంపెనీలతో ప్రారంభమై, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతీయ రైల్వేగా ఏర్పాటు అయి ప్రస్తుతం 18 జోన్లలో రైళ్లను నడుపుతోంది. రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ, రాజకీయ విమర్శలకు ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నది. 2027 సంవత్సరంలో రూ.2.76 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తుండగా ఇందులో రూ.1.3 లక్షల కోట్ల మొత్తాన్ని ప్రయాణికుల భద్రతకే ప్రత్యేకంగా కేటాయిస్తూ అధిక ప్రాధాన్యమిస్తున్నారు.

గడచిన కొద్ది నెలలుగా ప్రమాదాలు తగ్గుతున్నాయి. ఈ సంవత్సరం బిలాస్ పూర్ లో మెము ప్యాసెంజర్ రెడ్ సిగ్నల్ దాటి ముందుకు వెళ్లడంతో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోగా, 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు వరకు 10 రైల్వే ప్రమాదాలు జరిగాయి. ఎదురెదురుగా గుద్దుకోవడం, అగ్ని ప్రమాదాలు జరగడం, పట్టాలు తప్పడం వంటి దుర్ఘటనలతో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం జరిగింది. రైల్వే ఆస్తులకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. 2015 సంవత్సరం నుంచి 2024 వరకు 678 ప్రమాదాలు జరగ్గా, 748 ప్రాణాలు కోల్పోయారు. దుర్ఘటనలు సంభవించే ప్రాంతాలలో ఆధునీకరణ కోసం రాష్ట్రీయ రైలు సంరక్షణ ఖోష్ కింద రూ.1.08 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఎదురుగా వస్తున్న రైలు ఢీ కొట్టకుండా ఉండేందుకు కవచ్ రక్షణ పరికరాన్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికిందరాబాద్ కేంద్రంగా తయారు చేసి పలు రైళ్లకు అమర్చుతున్నారు. ఒక ట్రాక్ లో రైలు ప్రయాణిస్తున్న సందర్భంలో ఎదురుగా వచ్చే మరో రైలును లోకో పైలట్ గుర్తించకపోయినా, పట్టించుకోకపోయినా కవచ్ పరికరం రెండు రైళ్లు ఢీకొట్టకుండా ఆటోమెటిక్ గా ప్రమాదాన్ని పసిగట్టి అడ్డుకుంటుంది. 121 లోకోమోటివ్‌లలో 1,465 కిలోమీటర్ల దూరం మేర ‘కవచ్’ను వినియోగిస్తున్నారు. కవచ్.4 పరికరాన్ని కూడా 15,512 కిలోమీటర్ల దూరం మేర వినియోగిస్తున్నారు.

అయితే ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడం ప్రమాదాల నివారణకు పరిష్కారం కాదని రైల్వే రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వేలలో ప్రమాదాలు తగ్గించేందుకు, ప్రయాణికుల రక్షణ, ట్రాక్‌ల మరమ్మత్తు, కొత్త ట్రాక్‌లు వేయడానికి నిధుల సమస్య లేనప్పటికీ, రైల్వే అధికారులలో క్రమశిక్షణ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. నిధులు ఖర్చు పెట్టడం కన్నా ఇది పెద్ద బాధ్యత అని గుర్తు చేస్తున్నారు. మెయింటనెన్స్ పనులు ఎప్పటికప్పుడు చేయడం, సిబ్బందికి శిక్షణ నివ్వడం, బాధ్యత పెంచడం, కార్మికుల్లో ప్రేరణ పెంచడం వల్ల అనే సత్ఫలితాలు వస్తాయని, దీనికి నిధుల లభ్యత అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భద్రత సంబంధించిన పనులకు 2005 సంవత్సరం నుంచి 2014 వరకు రూ.70వేల కోట్లు వ్యయం చేయగా 2015 నుంచి 2024 సంవత్సరం వరకు రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. అనగా 2.5 రెట్లు నిధులు పెరిగాయి.

ఇదే సమయంలో రైల్వే ట్రాక్ ఆధునీకరణ, మరమ్మత్తులకు కూడా రూ.47,018 కోట్ల నుంచి రూ.1.09 లక్షల కోట్లకు పెరిగిందంటున్నారు. ట్రాకుల మరమ్మత్తులు, లోకోమోటివ్, కోచ్‌లు ఆధునీకరణ, సిగ్నళ్ల మార్పిడి, మెకానికల్ సిగ్నల్ వ్యవస్థ స్థానంలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ ఏర్పాటు, మనుషులు లేకుండా ఉన్న లెవెల్ క్రాసింగ్ లను ఇంటర్ లాకింగ్, ఫుల్ ట్రాక్ సర్క్యూటింగ్, రైళ్ల సామర్థ్యం పెంపుదల, జీపీఎస్ విధానాన్ని అమలు చేయడం, కవచ్ పరికరాల వినియోగం కోసం భద్రత నిధులను వెచ్చిస్తున్నారు. ప్రపంచంలో పేరొందిన సిమెన్స్, అల్ స్టామ్ వంటి కంపెనీలు సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణకు సహకరిస్తున్నాయి. ధీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలు, మనుషులు లేని లెవెల్ క్రాసింగ్ లను తగ్గించడం, మెరుగైన ట్రాక్ ల నిర్వహణ, ఎల్.హెచ్.బీ కోచ్ లను ప్రవేశపెట్టడం మూలంగా ప్రమాదాలు చాలా వరకు తగ్గాయంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ను ఉపయోగించి ప్రమాదాల సంఖ్యను సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా భారత రైల్వే శాఖ పనిచేస్తున్నది.

Read Also |

Elevated Corrdors | హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ఔటర్‌ వరకు కొత్తగా  ఫ్లైఓవర్లు
Panaji Hyderabad Highway | ఆ రహదారి పూర్తయితే పనాజీకి ప్రయాణం ఏడు గంటల్లోనే! 
Eesha Movie Review | ‘ఈషా’ భయపెడుతుందన్నారు.. మరి భయపెట్టిందా.?