Panaji Hyderabad Highway | ఆ రహదారి పూర్తయితే పనాజీకి ప్రయాణం ఏడు గంటల్లోనే! 

హైదరాబాద్‌–గోవాలోని పనాజీ మధ్య ప్రయాణం ఇంక ఎంతమాత్రమూ దూరాభారం కాబోదు. ప్రయాణ సమయాన్ని దాదాపు సగానికి తగ్గించే కొత్త పనాజీ–హైదరాబాద్‌ రహదారి వేగంగా నిర్మాణమవుతున్నది.

  • By: TAAZ |    telangana |    Published on : Dec 25, 2025 5:24 PM IST
Panaji Hyderabad Highway | ఆ రహదారి పూర్తయితే పనాజీకి ప్రయాణం ఏడు గంటల్లోనే! 
  • హైదరాబాద్‌–పనాజీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్లో వేగం
  • 90 శాతం భూసేకరణ ఇప్పటికే పూర్తి
  • రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యం

Panaji Hyderabad Highway | హైదరాబాద్‌, పనాజీ నగరాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు వీలుగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు జోరుగా సాగుతున్నాయి. మరో రెండేళ్లలో మొత్తం పనులు ముగించే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ప్రధానంగా ఇది హైదరాబాద్–పనాజీ ఎకనమిక్‌ కారిడార్‌. భారత్‌ మాల పరియోజన ప్రాజెక్టు కింద దీనిని నిర్మిస్తున్నారు. కీలక నగరాల మధ్య రవాణా, వాణిజ్యం, పరిశ్రమలను అనుసంధానం చేసే ఉద్దేశంతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ రహదారిలో కర్ణాకటలోని బెళగావి – రాయ్‌చూర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ఒక కీలకమైన భాగం. ఎక్స్‌ప్రెస్‌ హైవే.. కీలక పారిశ్రామిక కేంద్రాలైన పనాజీ, బెళగావి, రాయ్‌చూర్‌, హైదరాబాద్‌ నగరాలను కలుపుతుంది. దీనిని ఫోర్‌లేన్‌ రహదారిగా నిర్మిస్తున్నారు.

హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (HAM) పద్ధతిలో చేపట్టిన ఈ రహదారికి సంబంధించి.. భూసేకరణ, సివిల్‌ వర్క్స్‌లో ఈ ఏడాది చివరికి కీలక పురోగతి కనిపిస్తున్నది. పేవ్డ్‌ షోల్డర్స్‌తో నియంత్రిత రహదారిని నాలుగు లేన్లతో అతి వేగంతో దూసుకుపోయేందుకు వీలుగా నిర్మిస్తున్నారు.

ఈ రహదారి.. గోవా (పనాజీ), కర్ణాటక (బెళగావి, రాయ్‌చూర్‌), తెలంగాణ (హైదరాబాద్‌) రాష్ట్రాలను కలుపుతుంది. మత్స్య పరిశ్రమ, ఫార్మా (గోవా), ఆహార ధాన్యాలు (బెళగావి), వ్యవసాయం (రాయ్‌చూర్‌), ఐటీ/ఫార్మా (హైదరాబాద్‌) రంగాలను అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు.

ఈ ఫోర్‌లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు వేగంగా సాగుతున్నాయి. బాగల్‌కోట్‌ జిల్లాలో భూసేకరణ 90 శాతం పూర్తయింది. ఇక్కడ 102 కిలోమీటర్ల రహదారికి గాను భూసేకరణ చేశారు. నిర్మాణ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

పనాజీ – హైదరాబాద్‌ హైవే కోసం కేంద్ర ప్రభుత్వం 12వేల కోట్లను వెచ్చిస్తున్నది. నూతన రహదారి నిర్మాణం కోసం వ్యవసాయ భూములు సేకరిస్తున్నారు. కర్ణాటకలో ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా చేపడుతున్నారు. ఇందులో మూడు, నాలుగో ప్యాకేజీలు బాగల్‌కోట్‌ జిల్లాలోనివే. మూడో ప్యాకేజీ కోసం 306.8 హెక్టార్ల భూమిని, నాలుగో ప్యాకేజీకి 338.9 హెక్టార్లు సేకరించారు. ఈ జిల్లాలో మొత్తం 8 ప్రధాన ఫ్లైవోవర్లు నిర్మించనున్నారు.

రాయచూర్‌ జిల్లాలోని సిర్వార్‌, కవితల్‌, అమదిహల్‌ ప్రాంతాల మీదుగా సాగి, నందవదగి వద్ద బాగల్‌కోట్‌ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అమీన్‌నగడ్‌, తెగ్గి, కెరూర్‌ మీదుగా వెళుతూ బెళగావి జిల్లాలోని రామ్‌దుర్గ్‌, బైహొనగల్‌ పట్టణాలను తాకుతూ వెళుతుంది.

మొత్తం కొత్త ఎలైన్‌మెంట్‌ కావడంతో ఈ రహదారి పొడవునా కమర్షియల్‌ డెవలప్‌మెంట్‌ విస్తారంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రహదారి సమీప గ్రామాలు, పట్టణాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసే హోటల్‌, సర్వీసెస్‌ వ్యాపారాలకు మంచి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ప్రారంభంలో భూసేకరణ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కానీ.. రైతులకు పరిహారం చెల్లింపు వేగవంతం అయిందని బాగల్‌కోట్‌ ఎంపీ సీసీ గడ్డిగౌడర్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధి ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ సెక్షన్‌లో 80.01 కిలోమీటర్ల స్ట్రెచ్‌కు గాను 2,662 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఈ విభాగంలో గుడెబెల్లూరు నుంచి మరికల్‌ (ఎన్‌హెచ్‌ 167) వరకూ ఇటీవలే అనుమతులు లభించాయి. ఈ కారిడార్‌లో అత్యంత కీలకమైనది ఈ భాగమే.

ఇప్పటి వరకూ హైదరాబాద్‌ నుంచి పనాజీకి 15 గంటలు పడుతున్నది. ఈ రహదారి పూర్తయితే కేవలం ఏడు గంటల్లోనే పనాజీ చేరుకోవచ్చు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడిపేలా రోడ్డును డిజైన్‌ చేశారు.

ఇవి కూడా చదవండి..

Bird Flu : కేరళలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ
Champion Movie Review | ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ: ఫుట్‌బాల్ క్రీడ –తెలంగాణ చరిత్ర మేళవింపు మంచి ప్రయత్నమే..కానీ..!
KA Paul : కేఏ పాల్ క్రిస్మస్ సందేశం..వైరల్