Champion Movie Review | ‘ఛాంపియన్’ మూవీ రివ్యూ: ఫుట్‌బాల్ క్రీడ –తెలంగాణ చరిత్ర మేళవింపు మంచి ప్రయత్నమే..కానీ..!
రోషన్ మేక నటించిన ఛాంపియన్ సినిమా సమీక్ష : ఫుట్‌బాల్, చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి సమీక్ష & రేటింగ్.
(విధాత వినోదం డెస్క్)
భారీ ప్రొడక్షన్ విలువలు, చారిత్రక నేపథ్యం, స్పోర్ట్స్ డ్రామా మేళవింపుతో రూపొందిన చిత్రం ఛాంపియన్(Champion). స్వప్న సినిమా, జీ స్టూడియోస్ వంటి ప్రతిష్ఠాత్మక బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా, హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేకకు పూర్తి స్థాయి హీరోగా పరిచయం చేస్తోంది. ఫుట్‌బాల్ నేపథ్యాన్ని, హైదరాబాద్ స్టేట్ రజాకార్ ఉద్యమ చరిత్రతో మేళవిస్తూ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఎంచుకున్న కాన్సెప్ట్ ఆశాజనకంగా కనిపించింది. అయితే ఆ బలమైన ఆలోచన తెరపై ఎంతవరకు ఫలించిందన్నదే అసలు ప్రశ్న.
కథ & కథనాలు ఎలా ఉన్నాయి?
సికింద్రాబాద్‌కు చెందిన మైఖేల్ (రోషన్ మేక) ఓ ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ క్లబ్ తరఫున ఆడాలనే కలతో జీవించే అతడికి ఆ అవకాశం దగ్గరదాకా వచ్చి చేజారుతుంది. అదే సమయంలో, హైదరాబాద్ స్టేట్‌లో రజాకార్ల దురాగతాలు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకుంటుంటాయి.
ఇంగ్లాండ్ చేరాలనే ప్రయత్నాల్లో భాగంగా మైఖేల్ ఆయుధాల రవాణాలో ఇరుక్కోవాల్సి వస్తుంది. అలా అనుకోకుండా భైరాన్‌పల్లి ఉద్యమంలో భాగమవుతాడు. ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడి కలలు, ఒక ప్రాంతీయ ఉద్యమ చరిత్రతో ఎలా ముడిపడ్డాయి? మైఖేల్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే కథ సారాంశం.
కథ బలంగా, చాలా ఉద్వేగంతో ఉన్నప్పటికీ, కథనం ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ప్రథమార్థంలో కథను సాగదీసిన తీరు, అవసరానికి మించిన శృంగారం, ఉపకథలు సినిమాలో బిగిని తగ్గించాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగున్నా, ఢాకా చేరుకునే ప్రయాణాన్ని మాత్రం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
రెండో సగంలో కథ మొత్తం భైరాన్‌పల్లి ఉద్యమం చుట్టే తిరగడంతో, మైఖేల్ వ్యక్తిగత ప్రయాణం పక్కకు పోయినట్లుగా అనిపిస్తుంది. పోరాట సన్నివేశాలను భారీగా, సాంకేతికంగా బాగా తీర్చిదిద్దినా, భావోద్వేగాలు మాత్రం సరిగ్గా పండలేదు. సినిమా ఒక ఉద్విగ్నపరమైన ఆలోచనే అయినప్పటికీ, కథన పరంగా అయోమయానికి గురైన ప్రయత్నంగా మిగిలిపోతుంది.
నటీనటులు & సాంకేతిక విభాగం ప్రదర్శన

నటుడు శ్రీకాంత్ కుమారుడు, కథానాయకుడు రోషన్ మేక ఈ సినిమాకు ప్రధాన బలం. మైఖేల్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు, పడ్డ కష్టం ప్రశంసనీయం. యాక్షన్, ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాల్లో తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే పాత్రకు కావాల్సిన వయస్సు, గాఢత పూర్తిగా తెరపై ప్రతిబింబించలేదన్న భావన కలుగుతుంది.
అనస్వర రాజన్ పాత్ర పరిమితంగానే ఉన్నా, బాగా కుదిరింది. నాయకానాయికల మధ్య కెమిస్త్రీ బాగానే వర్కవుటయింది. కాకపోతే, నాయిక డబ్బింగ్ కొంత అసహజంగా అనిపిస్తుంది. మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించినా, వారి పాత్రల తీవ్రత మరింత బలంగా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ మిగులుతుంది. రచ్చ రవి, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా ఛాంపియన్ ఉన్నతంగా ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. “గిరా గిరా గింగిరాగిరేయ్” పాట మంచి స్పందన తెచ్చుకుంది. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది.
మధి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ ఇస్తే, ప్రొడక్షన్ విలువలు ఖర్చుకు వెనకాడకుండా ఉన్నతంగా కనిపిస్తాయి. అయితే ఎడిటింగ్ ఇంకాస్త కట్టుదిట్టంగా ఉండాల్సింది. బలమైన సాంకేతిక విలువలున్నప్పటికీ, కథ–స్క్రీన్‌ప్లే లోపాలు వాటి ఉనికిని నిరర్థకం చేసినట్లున్నాయి.
‘ఛాంపియన్’ మంచి ఆలోచనతో మొదలైన సినిమా. కానీ ఆ ఆలోచనను సమగ్రంగా, భావోద్వేగంగా తెరపై తీసుకురావడంతో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేకపోయాడు. అద్భుతమైన విజువల్స్, మంచి సంగీతం ఉన్నప్పటికీ, కథనం బలహీనంగా ఉండటం వల్ల సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. రోషన్ మేక నటన, సాంకేతిక విలువల కోసం ఒకసారి చూడవచ్చు గానీ, పూర్తిస్థాయి అనుభూతిని ఇచ్చే సినిమా మాత్రం కాదు.
విధాత రేటింగ్: ⭐⭐½ / 5
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram