TGSPDCLలో మీటర్ల కొరత.. యావరేజ్ బిల్లులతో వినియోగదారులకు భారీ భారం.. నెలకు రూ.1000 వరకు అదనపు చార్జీలు

తప్పొకరిదైతే శిక్ష వేరొకరికి వేసినట్టు తయారైంది టీజీఎస్‌పీడీసీఎల్‌ అధికారుల పరిస్థితి. కాలిన, స్ట్రక్‌ అయిన మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు బిగించడం లేదు. దాంతో యావరేజ్‌ బిల్లుల పేరిట భారీగా చార్జ్‌ చేస్తున్నారు. అదేంటని అడిగితే.. కొత్త మీటర్ల కొరత ఉందని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు.

TGSPDCLలో మీటర్ల కొరత.. యావరేజ్ బిల్లులతో వినియోగదారులకు భారీ భారం.. నెలకు రూ.1000 వరకు అదనపు చార్జీలు

విధాత‌, హైద‌రాబాద్‌:

TGSPDCL | దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉన్నతాధికారుల నిర్ల్యక్ష ధోరణితో వేల మంది విద్యుత్‌ వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిర్లక్ష్యమా? ఆధిపత్య తగాదాలా? లే కమీషన్లలో వాటాల పంచాయితీనా? ఏదేమైనా.. ఆరేడు నెలలుగా కొత్త విద్యుత్‌ మీటర్ల కొనుగోలుకు ఇండెంట్‌ పెట్టలేదని సమాచారం. దీంతో పెద్ద మొత్తంలో మీటర్ల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొత్త కనెక్షన్లు పొందినవారు.. తమకు సర్వీస్‌ శాంక్షన్‌ అయినప్పటికీ.. మీటర్లు అందక నెలల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. మరోవైపు పాత మీటర్లు, మీటర్లు స్ట్రక్‌ అయిపోయినవారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మీటర్లు స్ట్రక్‌ అయినా, కాలిపోయినా వెంటనే మార్పిడి చేయాల్సి ఉంటుంది. కానీ.. మీటర్ల కొరత కారణంతో వారికీ కొత్త మీటర్లు బిగించడం లేదని విద్యుత్తు శాఖ ఇంజినీర్‌ ఒకరు ‘విధాత’కు తెలిపారు. ఇది తమ ఒక్క సెక్షన్‌లోనే కాదని, ప్రతి సెక్షన్‌లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని ఆయన చెప్పారు.

వినియోగ‌దారుల‌కు శాపంగా మారిన అధికారుల తీరు

స్ట్రక్‌ అయిన మీటర్ల స్థానంలో కొత్తవి బిగించకుండా.. యావరేజ్‌ బిల్లులు తీసి, ముక్కుపిండి మరీ బిల్లులు వసూలు చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. TGSPDCL ప‌రిధిలో మొత్తం 21 స‌ర్కిళ్లు ఉన్నాయి. అందులో 1.11 ల‌క్ష‌ల విద్యుత్ క‌నెక్ష‌న్లు ఉండ‌గా ఒక్క గ్రేట‌ర్‌లోనే 60 ల‌క్ష‌ల‌కు పైగా క‌నెక్ష‌న్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో స‌రాస‌రిన ఒక్కో స‌ర్కిల్‌లో 2నుంచి 3 వేల వ‌ర‌కు మీట‌ర్లు స్ట్ర‌క్ అయి ఉంటాయ‌ని, ఈ లెక్క‌న దాదాపు ల‌క్ష వ‌ర‌కు వినియోగ‌దారుల విద్యుత్ మీట‌ర్లు స్ట్ర‌క్ అయి ఉండొచ్చని సీనియర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. నిజానికి.. ఒక వినియోగదారుడి విద్యుత్‌ మీటర్‌ స్ట్రక్‌ అయినా, కాలిపోయినా నెల రోజులలోపు కొత్త మీటర్‌ బిగించాల్సిన బాధ్యత టీజీఎస్‌పీడీసీఎల్‌ది. ఇటువంటి అత్యవసర పరిస్థితుల కోసం టీజీఎస్పీడీసీఎల్‌ నిత్యం తన వద్ద కొన్ని మీటర్లను అదనంగా స్టాక్‌ ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ.. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్‌ దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది.

యావరేజ్‌ ‘బాదుడు’

ఆరేడు నెలలుగా మీటర్ల కొరత ఏర్పడటంతో స్ట్రక్‌ అయిన, కాలిపోయిన మీటర్ల స్థానంలో కొత్తవి బిగించడం లేదు. దీంతో ప్రతినెల వాడిన మేరకు యూనిట్ల రీడింగ్‌ తీసే అవకాశం లేక.. యావరేజ్‌ బిల్లులు ఇస్తున్నారు. అంటే.. ఒక వినియోగదారుడు వినియోగ కాలంలో అత్యధికం వినియోగం ద్వారా వచ్చిన బిల్లును ప్రామాణికం చేసుకుంటున్నారు. దీంతో విద్యుత్‌ తక్కువ వినియోగించినా.. యావరేజ్‌ పేరిట.. కరెంటు బిల్లులు మోత మోగిస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. మీట‌ర్ రీడింగ్ తీయ‌కుండా ఇలా బిల్లులు భారీగా వేయ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. చ‌లి కాలంలో కూడా వేస‌వి కాలంలో వేసినంత బిల్లులు వేయ‌డం ఏమిట‌ని మండిప‌డుతున్నారు. ఇలా వేస్తున్న అధిక బిల్లుల కార‌క‌ణంగా గృహ‌జ్యోతి ప‌రిధిలోకి వ‌చ్చే వారు కూడా అధిక వినియోగం పేరుతో బిల్లులు చెల్లించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఒక విద్యుత్ అధికారి తెలిపారు. స‌రాస‌రిన ఒక్కొక్కక్క‌రికి నెలకు రూ. 500 ల నుంచి రూ. వెయ్యి వరకు ఎక్కువగా విద్యుత్ బిల్లులు వస్తున్నాయని గృహ వినియోగ‌దారులు చెపుతున్నారు. కొంత మంది మీట‌ర్ రీడింగ్ తీసి బిల్లులు ఇచ్చే ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మీటర్లే అందుబాటులో లేనప్పుడు తాము ఏమి చేయ‌గ‌లుగుతామ‌ని మీట‌ర్ రీడ‌ర్లు చేతులెత్తేస్తున్నారు. కార్పొరేట్‌ ఆఫీసు నుంచి మీటర్లు వస్తేనే తాము కొత్తవి బిగించగలమని చెప్పేస్తున్నారు. ప్రస్తుతం చలికాలం. సాధారణంగా విద్యుత్‌ వినియోగం ఎండా కాలంతో పోలిస్తే 40 శాతం వరకు తగ్గుతుంది. కానీ టీజీఎస్‌పీడీసీఎల్‌ యాజమాన్యం గత ఆరేడు నెలలుగా కాలిపోయిన, స్ట్రక్‌ అయిన విద్యుత్‌ మీటర్ల స్థానంలో కొత్త విద్యుత్‌ మీటర్లను బిగించకుండా బిల్లింగ్‌కు వచ్చే సరికి ఏడాది కాలంలో ఎక్కువగా వచ్చిన బిల్లు ఆధారంగా చార్జ్‌ చేస్తున్నారు. దీని వల్ల తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విచారణకు డిమాండ్

కార్పొరేట్‌ ఆఫీసులో ఏనాడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేద‌ని, ఆఫీస్‌లోనే ఏదో తేడా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని మ‌రో అధికారి అనుమానం వ్య‌క్తం చేశారు. అందుకే మీట‌ర్ల కోసం ఇండెంట్ పెట్టిన‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని చెపుతున్నారు. కాగా మీట‌ర్ల‌కు ఇండెంట్ పెట్ట‌డం లేదంటే వాటా పంప‌కాల మ‌ధ్య తేడా వ‌చ్చి ఉంటుందా..? లేక మ‌రింకోటేమైనా ఉంటుందా..? అని రాజ‌కీయ ప‌రిశీల‌కుడొకరు సందేహం వ్య‌క్తం చేశారు. డిస్కమ్‌ యాజమాన్యం పొర‌పాటు చేసి, ఆ భారాన్ని విద్యుత్‌ వినియోగదారులపై వేయడం స‌రికాద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్న‌ది. ఇది నేరం ఒక‌డు చేస్తే శిక్ష మ‌రొక‌రికి వేసిన‌ట్లుగా ఉంటుంద‌ని అంటున్నారు. స‌కాలంలో మీట‌ర్ బిగిస్తే ఈ ప‌రిస్థితి ఉండేది కాద‌ని చెపుతున్నారు. గడిచిన‌ ఆర్థిక సంవత్సరంలో మూడు వేల కోట్ల విద్యుత్‌ మెటీరియల్‌ కొనుగోలు చేస్తే మీటర్ల సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితికి బాధ్యులెవరన్న విషయంలో విచారణ జరిపించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు బాధిత వినియోగదారులు కోరుతున్నారు.