Bird Flu : కేరళలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ

కేరళలో బర్డ్ ఫ్లూ (H5N1) మళ్లీ పంజా విసిరింది. 11 ఏళ్లలో 7వ సారి వచ్చిన ఈ మహమ్మారితో కుట్టనాడులో 80 వేల బాతులు, కోళ్లు మృతి చెందాయి. తీవ్ర ఆర్థిక నష్టాల్లో రైతులు.

Bird Flu : కేరళలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ

కేరళలో మళ్లీ బర్డ్ ఫ్లూ (హచ్5ఎన్1) పంజా విసురుతోంది. కొన్ని శతాబ్ధాలుగా కుట్టనాడు ప్రాంతంలో బాతులు పెంపకం ఫారం లను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తున్నది. బర్డ్ ఫ్లూ పుణ్యమా అని బాతుల పెంపకం ప్రాంతాలు ఖాళీ అవుతున్నాయి. గడచిన 11 సంవత్సరాల వ్యవధిలో ఈ భయానకమైన వ్యాధి ప్రభలడం ఇది ఏడవ సారి. అలఫ్పుజ జిల్లాలోని ఎనిమిది పంచాయతీలు, కొట్టాయంలో నాలుగు పంచాయతీలలో వ్యాధి తీవ్రంగా ఉంది. దీని ప్రభావంతో సుమారు 55వేల బాతులు, కోళ్లు మృత్యువాత‌ పడ్డాయి. విస్తరించకుండా ఉండేందుకు మరో 25వేల బాతులు, కోళ్లను చంపేసి పాతి పెట్టారు. కుట్టనాడు ప్రాంతంలో బాతుల పెంపకంలో వందలాది కుటుంబాలు ఆధారపడి ఉపాధి పొందుతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా ఈ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రతి సంవత్సరం రెండు విడతల్లో బాతులు పెంచుతుంటారు, క్రిస్మస్ ఈస్టర్ ఫెస్టివల్ సమయాల్లోనే బర్డ్ ఫ్లూ దాడి చేస్తుండడం గమనార్హం. అలఫ్పుజ జిల్లా చెరుతన ప్రాంతానికి చెందిన బాతులు పెంచే రైతు జీ.రామచంద్రన్ మాట్లాడుతూ, తన ఫారంలో 30 రోజుల వయస్సు ఉన్న బాతులు 15వేల వరకు ఉండగా అందులో 12వేలు చనిపోయినట్లు తెలిపారు. మిగతా మూడు వేల బాతులను కూడా చంపేసి పాతిపెట్టాల్సి ఉందన్నారు. పండుగ సీజన్ లో సుమారు రూ.20 లక్షల వరకు నష్టపోయానని, వచ్చే ఏడాది క్రిస్మస్ కోసమైనా అప్రమత్తంగా ఉండాలన్నారు. 2014 లో 4,500 బాతులకు వ్యాధి సోకడంతో విస్తరించకుండా ఉండేందుకు వాటిని తొలగించక తప్పలేదన్నారు. ఇలా వరుస నష్టాలు వస్తే ఎలా తట్టుకుంటామంటూ, మున్ముందు బాతుల పెంపకాన్ని నిలిపివేస్తానని ఆయన అన్నారు. ఫ్లూ వ్యాధి బాతులు, కోళ్ల పెంపకందార్లపై దారుణమైన ప్రభావం చూపిస్తున్నది, ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోతున్నామన్నారు. దశాబ్ధం క్రితం ఈ ప్రాంతంలో ప్రతి సీజన్ లో 15 లక్షల వరకు బాతులు పెంచి విక్రయాలు చేసేవాళ్లమని, ఇప్పుడది మూడు లక్షలకు పడిపోయిందని ఆయన వివరించారు. సంక్రమించిన వ్యాధిని అరికట్టలేని పరిస్థితులు ఉండడం, వ్యయం ఎక్కువగా ఉండడంతో పలువురు చిన్న, మధ్య తరహా పెంపకం రైతులు ఈ రంగం నుంచి తప్పుకుంటున్నారు. ఐక్య తరవు కర్షక సంఘం అధ్యక్షులు రాజశేఖరన్ మాట్లాడుతూ, బర్డ్ ఫ్లూ కారణంగా నష్టపోయిన చిన్న, మధ్య తరహా రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

బాతుల పెంపకంలో నీటి వనరులు ఉన్న ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోని నీటి వనరులు ఉన్న దగ్గరికి తరలడం కూడా సమస్యగా మారింది. వాటికి ఆహారం ఇవ్వడం, పెంచడం మూలంగా పరిసర ప్రాంతాల్లో ఫ్లూ విజృంభిస్తుందన్న భయం ప్రజల్లో నెలకొని ఉంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని నీటి వనరులు ఉన్న దగ్గరకు బాతులను తీసుకువెళ్లడం ప్రమాదకరంగా మారిందని వెటర్నరీ వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి బాతుల కారణంగానే వ్యాధి విస్తరిస్తుందని, నిరంతరం పర్యవేక్షణ చేస్తే తప్ప నియంత్రించడం అసాధ్యమంటున్నారు. అయితే భారత దేశంలో ఆ స్థాయిలో పర్యవేక్షించే వ్యవస్థ లేదంటున్నారు. కుట్టునాడులో నీటి వనరులు పుష్కలంగా ఉండడం కూడా పక్షులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నాయి. రెండు జిల్లాలలో వైరస్ ప్రభలకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కేరళ రాష్ట్ర పశు సంవర్థక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

IRCTC Best Package: మిస్టికల్ కాశ్మీర్ న్యూ ఇయర్ స్పెషల్ ట్రిప్ కేవలం రూ. 35550 మాత్రమే
Jagadish Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్