Rajnath Singh Warning To Pakistan | పాకిస్తాన్ కు భారత్ రక్షణ మంత్రి తీవ్ర హెచ్చరిక
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక చేస్తూ ఆ దేశంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని స్పష్టం చేశారు. లఖ్‌నవూలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ నుంచి తొలి విడత క్షిపణులను సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధిని ప్రశంసించారు.

న్యూఢిల్లీ : దాయాది దేశం పాకిస్తాన్ లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని..భారత్ వద్ద ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శత్రుదేశం తప్పించుకోలేదని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నవూలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ను యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో కలిసి శనివారం రాజ్ నాథ్ సింగ్ సందర్శించారు. ఈ ఫ్లాంటులో తొలివిడతగా ఉత్పత్తి అయిన బ్రహ్మోస్ క్షిపణులను రాజ్ నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు. బ్రహ్మోస్ క్షిపణి వర్చువల్ స్ట్రైక్‌ను రాజ్ నాథ్ వీక్షించారు. అనంతరం తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను తీసుకెళ్తున్న ట్రక్కులను యోగితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
రక్షణ రంగంలో స్వావలంబన
ఈ సందర్బంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సైన్యం పరాక్రమాన్ని, సంసిద్దతను ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో భారత రక్షణ రంగం వేగంగా స్వదేశీకరణ దిశగా పయనిస్తోందని.. బ్రహ్మోస్ ఉత్పత్తి దేశ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి భారత రక్షణ పరిశోధన సంస్థ, రష్యా సంస్థ ఎన్‌పీఓ మషినోస్ట్రోయెనియా కలిసి అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థ అని.. ఇప్పుడు లఖ్‌నవూలో ఉత్పత్తి ప్రారంభమవడం ద్వారా భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో పెద్ద ముందడుగు వేసిందని పేర్కొన్నారు. లఖ్ నవూ బ్రహ్మోస్ బృందం ఒక నెలలోనే రెండుదేశాలతో రూ.4వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఇతర దేశాల నుంచి నిపుణులు లఖ్‌నవూకు తరలివస్తారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ యూనిట్ టర్నోవర్ రూ.3వేల కోట్లు అవుతుందని… ప్రతి ఏటా రూ.5వేలకోట్ల మేర జీఎస్టీ వసూలు అవుతుంది అని పేర్కొన్నారు.
దేశ రక్షణ వ్యవస్థలో కీలకంగా బ్రహ్మోస్ క్షిపణి
సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. దాని అధునాతన వెర్షన్ పరిధి 500 నుండి 800 కిలోమీటర్లు. ఈ క్షిపణి 200 నుండి 300 కిలోల అధిక పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇది శత్రువును నాశనం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బ్రహ్మోస్ మిస్సైల్స్‌ను భారత్ ఆపరేషన్ సిందూర్ లో ప్రయోగించింది. లక్ష్యాన్ని చేరిన తర్వాత మానవ ప్రమేయం లేకుండానే దాని పని అది చేసుకుపోతుంది. ఆపరేషన్ సిందూర్ లో పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను, పాక్ వైమానిక స్థావరాల ధ్వంసం లక్ష్యాలను వంద శాతం ఖచ్చితత్వంతో చేధించిన బ్రహ్మోస్ క్షిపణి సామర్ధ్యానికి ప్రపంచ దేశాలు సైతం అబ్బుర పడ్డాయి.