సెన్సేషన్..ఆ పక్షి పిల్ల కనిపించడం లేదు!

గుజరాత్‌లో కఠిన భద్రత మధ్య ఉన్న అరుదైన బట్టమేక పక్షి పిల్ల కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. అంతరించిపోతున్న జాతి సంరక్షణపై ఆందోళనలు పెరిగాయి.

విధాత : దేశ పరిపాలకులకు ఉండే స్థాయిలో జెడ్ ప్లస్ భద్రతా.. చుట్టు పహారా, వాచ్ టవర్లతో కూడిన నిఘా..అయితేనేం..ఆ పక్షి పిల్ల కనిపించకుండా పోయింది. సంచలనంగా మారిన ఈ ఆంశం అందరిని కలవరపెడుతుంది. దేశంలో అత్యంత సంరక్షణ జాబితాలోని అరుదైన బట్టమేక పక్షిపిల్ల పటిష్టమైన భద్రతా వలయం నుంచి అదృశ్యమైంది.

గుజరాత్ గడ్డపై అరుదైన బట్టమేక పిట్ట(Great Indian Bustard) అదృశ్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత పుట్టిన ఆ చిన్నారి పక్షి… కేవలం 26 రోజుల్లోనే కనిపించకుండా పోవడం బాధాకరం.

ఏకంగా 50 మంది గార్డులు, 24 గంటల పహారా, వాచ్ టవర్లు… అంతటి భద్రతావలయం ఉన్నా కూడా ఆ పిట్టను కాపాడలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏప్రిల్ 18వ తేదీ నుంచి ఈ పక్షి పిల్ల కనిపించకుండా పోయింది. దీని తల్లికి జీపీఎస్ ట్యాగ్ ఉండటంతో దాని కదలికలను గుర్తించగలిగారు. అయితే 26 రోజుల వయసున్న ఆ పక్షి పిల్ల తన తల్లి నుంచి విడిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఆ పక్షి పిల్లపై నక్కలు లేదా అడవి కుక్కల వంటి క్రూర మృగాల దాడి చేసి ఉండవచ్చని అటవీ అధికారులుభావిస్తున్నారు. ఫెన్సింగ్ లోపాలా? లేక భద్రతలో లోపాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భద్రత ఘనం.. పక్షి పిల్ల మాయం..

గుజరాత్ లోని అబ్ధసా గడ్డి భూముల్లో గత మార్చి 26వ తేదీన కచ్ ప్రాంతంలో అరుదైన బట్టమేక పిట్ట పిల్ల పుట్టింది. ఈ పక్షి పిల్లను కాపాడేందుకు ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యురిటీ కల్పించింది. 24గంటలు మూడు షిఫ్టులుగా మొత్తం 50మంది సిబ్బంది దానికి కాపలా కాశారు. అత్యంత కఠినమైన భద్రతా వలయం మధ్యలో ఉన్న ఆ పక్షిపిల్ల మాయమవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటికే అంతరించిపోతున్న ఈ జాతి కోసం తీసుకోవాల్సిన చర్యలు సరైన సమయంలో తీసుకోకపోతే… భవిష్యత్తులో ఈ పక్షిని మనం కేవలం పుస్తకాలలోనే చూసే పరిస్థితి వస్తుందేమో అన్న భయం కలుగుతోందని వన్యప్రాణి, పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుజరాత్ లో ఇలాంటి ఘటన మరోసారి

గుజరాత్‌లో బట్టమేక పక్షి అదృశ్యం కావడం ఇది మొదటిసారి కాదు. 2018 డిసెంబర్‌లో రాష్ట్రంలో మిగిలి ఉన్న ఏకైక మగ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కూడా ఇలాగే అదృశ్యమైంది. దాని జాడ ఇప్పటికీ దొరకలేదు. ఇప్పుడు మరోసారి అరుదైన ఈ పక్షి పిల్ల కూడా కనిపించకుండా పోవడంతో.. ఈ జాతి పక్షులు గుజరాత్ నుంచి శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) ప్రతినిధులు ఈ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. పక్షి గుడ్లు పెట్టినప్పుడే సరైన భద్రత కల్పించాల్సిందని, పక్షి పిల్ల పుట్టిన తర్వాత భారీ భద్రత ఏర్పాటు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయిందని అభిప్రాయ పడుతున్నారు. అరుదైన బట్టమేక పిట్ట తప్పిపోవడం వలం ఒక పక్షి కథ కాదు… మన ప్రకృతి సంరక్షణలో ఉన్న లోపం అని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

బట్టమేక పక్షి ప్రత్యేకతలు

ప్రపంచంలోనే అరుదైన పక్షిజాతుల్లో బట్టమేక పక్షి ఒకటి. దీని శాస్ర్తీయ నామం ఆర్డియోటీస్‌ నైగ్రిసెప్స్‌. మనదేశంలోనూ ఈ పక్షులు అంతరించిపోయే స్థితికి చేరాయి. పొడవాటి తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు, నలుపు ఈకల హారం.. గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీ ఆకారంతో ఆకర్షించే రూపం బట్టమేక (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) పక్షుల సొంతం. విమానం తరహాలో నేలపై పరుగులు తీసి.. గాల్లోకి లేచి లయబద్దంగా విశాలమైన రెక్కలను కదిలిస్తూ గగన విహారం చేస్తుంటాయి. బలిష్టంగా కనిపించే బట్టమేక పక్షులు మీటరు పొడవు, 15-18 కిలోల బరువు, రెక్కల పొడవు 210 నుంచి 250 సెంటిమీటర్లు, అలాగే పొడవాటి మెడను కలిగి ఉంటాయి. నిర్దిష్టమైన ఎత్తులో మాత్రమే ఇవి విహరిస్తాయి.మనదేశంలోనూ ఈ పక్షులు అంతరించిపోయే స్థితికి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్నేళ్లుగా వీటి జాడ కనిపించడం లేదు. 2008 నాటికి ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో 300లోపు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 150కి పడిపోయినట్లు తెలుస్తోంది.

రోళ్లపాడులో బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రం..

ప్రపంచ వ్యాప్తంగా 20కి పైగా బట్టమేక పక్షిజాతులు ఉండగా.. మనదేశంలోనే 4 జాతులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి అరుదైన జాతికి చెందినవి. బట్టమేక పిట్ట ప్రధాన స్థావరం నంద్యాల జిల్లాలోని రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇక్కడ 1988లో సుమారు 927 హెక్టార్లలో అభయారణ్యాన్ని ఎంపిక చేశారు. 1989లో అక్కడ 150 బట్టమేక పక్షులు ఉన్నట్లు గుర్తించారు. చివరగా 2020లో ఒక పక్షి కనిపించింది. ప్రస్తుతం వాటి జాడే లేదు. వేటగాళ్ల ఉచ్చులతో పాటు గడ్డిభూములు తగ్గిపోవడం, పాడిపశువులు, మనుషుల సంచారం పెరుగడం బట్టమేక పక్షి ఆవాసానికి ఆటంకాలుగా మారాయి. దీంతో వాటి ఆచూకీ లేకుండా పోయాయని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాయని అటవీ అధికారులు భావిస్తున్నారు.. రోళ్లపాడు పరిసర మైదాన ప్రాంతాల్లో విండ్‌ ఎనర్జీ కోసం గాలిమరలు, వందలాది ఎకరాల్లో సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా విద్యుత్‌ లైన్లను అమర్చారు. అలాగే పంటల సాగులో రసాయన, క్రిమిసంహారక మందుల వినియోగం ఈ పక్షుల మనుగడకు ప్రతికూలంగా మారింది.

రైతన్నల నేస్తం

గడ్డి మైదానాల్లో, వ్యవసాయ యోగ్యమైన పొలాల్లో బట్టమేక పిట్టలు సంచరిస్తుంటాయి. పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తిని రైతన్నలకు సహాయకారిగా ఉంటాయి. పంటల కోత తర్వాత మిగిలిన మోములు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు తదితర వాటిని ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఎక్కువగా ఒంటరిగానే సంచరించే ఈ పక్షులు అరుదుగా గుంపుగా కనిపిస్తాయి.

ఏడాదికి ఒక గుడ్డే..

బట్టమేక పక్షుల సంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతుంది. ఈ జాతి పక్షులు ఆడ, మగ పరస్పరం ఎదురుపడితేనే జతకడుతుంటాయి. మార్చి, సెప్టెంబరు మధ్య కాలంలో గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడపక్షి ఏడాదికి కేవలం ఒక గుడ్డు మాత్రమే పెట్టి, దట్టమైన పొదల్లో 25 నుంచి 30 రోజుల వ్యవధిలో పొదుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి అరుదుగా రెండు గుడ్లు కూడా పెడతాయి. ఒక్కో ఆడపక్షి తన జీవితకాలంలో కేవలం ఐదారు గుడ్లు పెడతాయి. వీటి సగటు జీవిత కాలం సుమారు 15-16 ఏళ్లుగా పరిగణించారు.

కృత్రిమ సంతానోత్పత్తితో జాతి పరిరక్షణ

రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ సమీపంలో గల రామ్‌దేవరా బ్రీడింగ్‌ సెంటర్‌లో మొట్టమొదటి సారిగా కృత్రిమ సంతానోత్పత్తి విధానంలో బట్టమేక పిట్ట (గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌) ఆడ పక్షి పిల్ల జన్మించింది. అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఈ పక్షి జననం జాతి ఉనికికి మళ్లీ జీవం పోసింది. రాజస్థాన్‌ రాష్ట్ర పక్షి కూడా ఇదే కావడం గమనార్హం. ఈ బట్టమేక పిట్ట పిల్లను ‘జెర్రీ’ అనే ఆడ, ‘పర్వా’ అనే మగ పక్షుల సాయంతో ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం జైసల్మేర్‌ జిల్లాలో బట్టమేక పక్షుల సంఖ్య 73కు చేరింది. కృత్రిమ సంతానోత్పత్తి విధానంతో రోళ్లపాడు అభయారణ్యంలోనూ.. బట్టమేక పిల్లలను పుట్టించి, గడ్డి మైదానాల్లో వదలాలని అటవీ శాఖ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి :

అంబులెన్స్‌కు ర‌క్త‌పు మ‌ర‌క‌లు.. పేషెంట్‌ భార్య‌తో శుభ్రం చేయించిన సిబ్బంది
Zelio Gracy Scooter | రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!

Latest News