అంబులెన్స్‌కు ర‌క్త‌పు మ‌ర‌క‌లు.. పేషెంట్‌ భార్య‌తో శుభ్రం చేయించిన సిబ్బంది

మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తరలించిన 108 అంబులెన్స్‌లో రక్తపు మరకలు భార్యతో శుభ్రం చేయించిన ఘటనపై సిబ్బందిని సస్పెండ్ చేశారు.

అంబులెన్స్‌కు ర‌క్త‌పు మ‌ర‌క‌లు.. పేషెంట్‌ భార్య‌తో శుభ్రం చేయించిన సిబ్బంది

ఇది అమానుష ఘ‌ట‌న‌.. రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ ఓ వ్య‌క్తిని 108 అంబులెన్స్‌లో త‌ర‌లించ‌గా, ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటాయి. ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను పేషేంట్ భార్య‌తో శుభ్రం చేయించారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని క‌త్ని జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. క‌త్ని జిల్లా ప‌రిధిలోని క‌రేలా గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన భార్య అంబులెన్స్‌కు స‌మాచారం అందించింది. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని క‌త్ని జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే అంబులెన్స్‌కు ర‌క్త‌పు మ‌ర‌క‌లు అంటాయి. దీంతో ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను తుడిచేయాల‌ని క్ష‌త‌గాత్రుడి భార్య‌ను అంబులెన్స్ సిబ్బంది ఆదేశించారు. చేసేదేమీ లేక ఆమె ఆ ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను నీటితో క‌డిగేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఈ ఘ‌ట‌న‌పై క‌త్ని చీఫ్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్ రాజా సింగ్ ఠాకూర్ స్పందించారు. అంబులెన్స్ పైల‌ట్‌తో పాటు ఎమ‌ర్జెన్సీ మెడిక‌ల్ టెక్నిషీయ‌న్‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిపారు. విచార‌ణ కొన‌సాగుతుంద‌న్నారు. ఇది ఆమోదించ‌ద‌గ్గ చ‌ర్య కాద‌ని, త‌ప్ప‌కుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోపై జిల్లా క‌లెక్ట‌ర్ అశిష్ తివారీ కూడా స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని ఆరోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పునార‌వృతం కాకుండా చూడాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఇవి కూడా చదవండి :

దంచికొడుతున్న ఎండ‌లు.. సాయంత్రానికి మోస్త‌రు వ‌ర్షాలు..!
NRI Life | విదేశాలకు వెళ్లిన భారతీయులు అందుకే తిరిగి రావాలనుకోరు.. సూటిగా అసలు కారణం చెప్పేసిన ఎన్ఆర్ఐ మహిళ!