దంచికొడుతున్న ఎండ‌లు.. సాయంత్రానికి మోస్త‌రు వ‌ర్షాలు..!

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్న వేళ సాయంత్రానికి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దంచికొడుతున్న ఎండ‌లు.. సాయంత్రానికి మోస్త‌రు వ‌ర్షాలు..!

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. పొద్దున 8 గంట‌ల నుంచే భానుడు త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 45 డిగ్రీల సెల్సియ‌స్ మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఇవాళ కూడా అదే స్థాయిలో భారీగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. ఈ మండుటెండ‌ల‌కు ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం చ‌ల్ల‌ని క‌బురు అందించింది.

బుధ‌వారం సాయంత్రం వ‌ర‌కు హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు ప‌లు జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. బ‌ల‌మైన ఈదురుగాలులు కూడా వీచే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలో రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండి త‌మ పంట‌ల‌ను కాపాడుకోవాల‌ని సూచించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు నిజామాబాద్, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి, మ‌హబూబ్‌న‌గ‌ర్, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, గ‌ద్వాల జిల్లాల్లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

ఇవాళ కూడా 41 నుంచి 45 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. నిన్న నిజామాబాద్ జిల్లాలో అత్య‌ధికంగా 44.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, ఆదిలాబాద్ జిల్లాలో 44.3 డిగ్రీలు, మెద‌క్ జిల్లాలో 43 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలో బేగంపేట్‌లో అత్య‌ధికంగా 42 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. సాధార‌ణం కంటే 2.6 డిగ్రీలు ఎక్కువ‌. హ‌కీంపేట్‌లో 41.7, హ‌య‌త్‌న‌గ‌ర్‌లో 41, రాజేంద్ర‌గ‌న‌ర్‌లో 40.5, ప‌టాన్‌చెరులో 40.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

ఇవి కూడా చదవండి :

వెట్​ బల్బ్​ హీట్​ | కలిసిపోయిన వేడి – తేమ : హైదరాబాద్‌లో ప్రాణాపాయ పరిస్థితులు
Zelio Gracy Scooter | రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!