వెట్​ బల్బ్​ హీట్​ | కలిసిపోయిన వేడి – తేమ : హైదరాబాద్‌లో ప్రాణాపాయ పరిస్థితులు

హైదరాబాద్‌లో కనిపించని వేడి ప్రాణాపాయ పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ వెట్-బల్బ్ హీట్ పరిస్థితి తీవ్రంగా మారడంతో, శరీర సహజ కూలింగ్​ వ్యవస్థ పనిచేయదు.. ఇప్పుడున్న 41°C ఉష్ణోగ్రతతో పాటు అధిక తేమ వల్ల శరీరం కూలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో తీవ్రమైన వడదెబ్బ ప్రమాదం పెరుగుతోంది. పూర్తి వివరాలు, జాగ్రత్తలు తెలుసుకోండి.

వెట్​ బల్బ్​ హీట్​ | కలిసిపోయిన వేడి – తేమ : హైదరాబాద్‌లో ప్రాణాపాయ పరిస్థితులు తెలంగాణలో పెరుగుతున్న వెట్-బల్బ్ హీట్ ప్రభావం సూచిస్తున్న గ్రాఫిక్

Wet-Bulb Heat – Hyderabad Enters ‘Danger Zone’: Why 41°C Feels More Dangerous Than 45°C

  • హైదరాబాద్ వెట్-బల్బ్ హీట్ జోన్‌లోకి ..
  • 41.4°C + 51% తేమ → ప్రమాదకర కలయిక
  • చెమట ఆవిరి కాకపోవడంతో శరీరం చల్లబడదు
  • 41°C కూడా 45°C కంటే ఎక్కువ ప్రమాదం
  • అత్యంత ప్రమాదంలో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు 
  • ORS, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం తప్పనిసరి
  • మధ్యాహ్నం బయటకు వెళ్లడం తగ్గించాలి

విధాత వెదర్​ డెస్క్​ | 28 ఏప్రిల్​ 2026 | హైదరాబాద్​:

Wet-Bulb Heat – Hyderabad: హైదరాబాద్‌లో ఎండ వేడి అత్యంత ప్రమాదకర దశలోకి ప్రవేశించింది. ఇది సాధారణ హీట్‌వేవ్ కాదు. ఉష్ణోగ్రతతో పాటు తేమ కూడా పెరగడంతో ఏర్పడే “వెట్-బల్బ్ హీట్” పరిస్థితి నగరాన్ని ప్రమాదకర స్థాయిలో ఆవరించింది. సాధారణంగా చెమట ద్వారా శరీరం చల్లబడే సహజ శీతల వ్యవస్థ ఈ పరిస్థితిలో పనిచేయకుండా పోవడం వల్ల, బయట కొద్దిసేపు గడిపినా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏంటీ వెట్​ బల్బ్​ హీట్​?

Telangana temperature forecast map showing rising heatwave conditions across districts

జిల్లాల వారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూపిస్తున్న తెలంగాణ హీట్ మ్యాప్

గత 24 గంటల్లో హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 41.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదే సమయంలో సుమారు 51 శాతం తేమ నమోదవడంతో నగరం “వెట్-బల్బ్ హీట్ జోన్”లోకి ప్రవేశించింది. సాధారణంగా ఏప్రిల్ నెలలో తేమ లేని వేడి (డ్రై హీట్) ఉండటం వల్ల చెమట సులభంగా ఆవిరై శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే ప్రస్తుతం తేమ అధికంగా ఉండటం వల్ల చెమట ఆవిరి కావడం తగ్గిపోయి శరీరంలో వేడి అలాగే ఉండిపోతుంది.

ఇది బయటికి సాధారణ 41°ల వేడిలా కనిపించినా, శరీరానికి అనుభవమయ్యే వేడి మరింత ఎక్కువగా.. 45 డిగ్రీల దాకా ఉంటుంది. ఈ పరిస్థితిని “ఫీల్స్ లైక్ టెంపరేచర్”గా పరిగణిస్తారు. ఫలితంగా కొద్దిసేపు బయట గడిపినా అలసట, తల తిరగడం, నీరసం వంటి వడదెబ్బ లక్షణాలు చాలా వేగంగా కనిపిస్తాయి. ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాపాయం తప్పదు. వేడి మరియు తేమ కలయిక శరీరంపై, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. సాధారణంగా 45 డిగ్రీల డ్రై హీట్ కంటే, 41 డిగ్రీల వేడితో పాటు అధిక తేమ ఉన్న పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. కారణం ఏమిటంటే, ఈ పరిస్థితుల్లో శరీరం తన అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు చేసే ప్రయత్నాలు విఫలం కావడం వల్ల, చెమట ఆవిరి కాకపోవడంతో శరీరం చల్లబడే ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో శరీరం వేడి తగ్గించుకోలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది.

అత్యంత ప్రమాదకర వాతావరణం : పిల్లలు, వృద్ధులు అస్సలు బయటకెళ్లొద్దు

Hyderabad extreme heatwave with rising temperature thermometer under blazing sun

మండుతున్న ఎండలో హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరుగుతున్న దృశ్యం

ఈ నేపథ్యంలో, ఇది చాలా ప్రమాదకర వాతావరణమని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరియు అనారోగ్య సమస్యలున్న వారు మధ్యాహ్న సమయంలో ఏ పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, శరీరానికి తగినంత నీరు, ఎలక్ట్రోలైట్స్ అందేలా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం వాతావరణ సమాచారాన్ని భారత వాతావరణ శాఖ(India Meteorological Department),  మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం(Telangana State Development Planning Society) వేర్వేరుగా ఉష్ణోగ్రత, తేమ చూపిస్తున్నప్పటికీ, ఈ రెండు కలవడమే అసలు ప్రమాదాన్ని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం ఈ రెండు అంశాలను విడిగా కాకుండా ఒకేసారి అనుభవిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.

వెట్​ బల్బ్​ హీట్​ ఎఫెక్ట్​ : ఆరోగ్యంపై దుష్ప్రభావాలు

Person cooling down with water during extreme heatwave in India

తీవ్ర వేడిలో శరీరాన్ని చల్లబరుచుకునేందుకు నీరు తీసుకుంటున్న వ్యక్తి

వెట్-బల్బ్ పరిస్థితిలో శరీర సహజ శీతల వ్యవస్థ పనిచేయకపోవడంతో లోపలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది గుండెపై అధిక ఒత్తిడిని కలిగించడంతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఎక్కువసేపు బయట ఉన్నా, లేదా తీవ్రమైన పరిస్థితే అయితే ఏమాత్రం సంకేతాలు లేకుండా కూలిపోవడం వంటి ప్రమాదం కలుగుతుంది.

వైద్య నిపుణులు చెప్పిందాని ప్రకారం, చెమట ఆగిపోవడం లేదా అకస్మాత్తుగా అలసట, గందరగోళం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి శరీరం ప్రమాద సంకేతాలు ఇచ్చే ప్రారంభ దశలుగా పరిగణించాలి. ఇటువంటప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

ఎవరెవరికి ఎక్కువ ప్రమాదం?

ఈ పరిస్థితిలో ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు మరియు గుండె లేదా మూత్రపిండ సంబంధిత సమస్యలున్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. వీరి శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం తక్కువగా కలిగి ఉండటం వల్ల పరిస్థితి త్వరగా విషమించే అవకాశం ఉంటుంది. అందుకే వీరు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

జాగ్రత్తలు & నివారణ చర్యలు

Hyderabad roads appear empty during peak afternoon heatwave conditions

తీవ్ర మధ్యాహ్న వేడి కారణంగా వెలిసిపోయిన హైదరాబాద్ రహదారులు

నిపుణులు సూచిస్తున్న ప్రధాన జాగ్రత్తలు ఇవి. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడం పూర్తిగా నివారించాలి. శరీరంలో నీరు తగ్గకుండా తరచుగా నీరు, ORS లేదా ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి. ఇంట్లో గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి లేదా వీలైతే ఎయిర్ కండిషనింగ్ ఉపయోగించాలి. తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్యాన్ ఒక్కటే సరిపోదని గుర్తుంచుకోవాలి.

అలాగే శరీరాన్ని చల్లబరచేందుకు మెడ, చంకల ప్రాంతాల్లో చల్లని తడి గుడ్డలు ఉపయోగించడం, తేలికపాటి దుస్తులు ధరించడం వంటి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చెమట పట్టకపోవడం కూడా ప్రమాద సంకేతమేనని గుర్తించాలి.

హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్య కేవలం ఉష్ణోగ్రత పెరగడం కాదు, తేమతో కలిసిన వేడి. ఇది కనిపించని కానీ తీవ్రమైన ప్రమాదం. ఈ పరిస్థితిలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.