Ratan Tata । విషమంగా రతన్‌ టాటా ఆరోగ్యం? మీడియాలో కథనాలు

రొటీన్‌ ఆరోగ్య పరీక్షల కోసమే తాను హాస్పిటల్‌లో చేరానని కొద్ది రోజుల క్రితం రతన్‌ టాటా చెబుతూ.. తన ఆరోగ్యం విషయంలో నెలకొన్న సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అయితే.. ఈలోపే ఆయన ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు వస్తున్నాయి.

Ratan Tata । విషమంగా రతన్‌ టాటా ఆరోగ్యం? మీడియాలో కథనాలు

Ratan Tata । దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ (chairman emeritus of Tata Sons) రతన్‌ టాటా (Ratan Tata) తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తున్నది.  ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని, ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్‌లో ఆయనకు ఐసీయూ (intensive care unit)లో ఉంచి చికిత్స అందిస్తున్నారని  రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొన్నది. తమకు ఇద్దరు విశ్వసనీయ వ్యక్తుల ద్వారా ఈ విషయం తెలిసిందని రాయిటర్స్‌ చెబుతున్నా.. టాటా సన్స్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, హాస్పిటల్‌ వర్గాల నుంచి అధికారిక బులెటిన్‌ గానీ ఇప్పటి వరకూ వెలువడ లేదు.

ఆయన వయసు 86 ఏళ్లు. రొటీన్‌ ఆరోగ్య పరీక్షల కోసమే తాను హాస్పిటల్‌లో చేరానని కొద్ది రోజుల క్రితం రతన్‌ టాటా చెబుతూ.. తన ఆరోగ్యం విషయంలో నెలకొన్న సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అయితే.. ఈలోపే ఆయన ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు వస్తున్నాయి. సోమవారం తన సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టిన రతన్‌ టాటా.. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు సమాధానం ఇచ్చారు. తాను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. ‘ఆందోళన పడాల్సిన అవసరం  ఏమీ లేదు. నేను చాలా బాగున్నాను’ అని పేర్కొన్నారు. తనకు జరుగుతున్న వైద్య పరీక్షలు రొటీన్‌ అని తెలిపారు. తన ఆరోగ్యం విషయంలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.

భారతదేశ పారిశ్రామిక రంగంలో రతన్‌ టాటా అగ్రగణ్యులు. దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావశీల పారిశ్రామిక సామ్రాజ్యమైన టాటా సన్స్‌కు రతన్‌ టాటా 1991లో చైర్మన్‌ అయ్యారు. 2012 వరకూ గ్రూపు తన సారథ్యంలో నడిపించారు. తాను సారథ్యం వహించిన సమయంలో టాటా గ్రూపును ఆయన విశ్వవ్యాప్తం చేశారు. టెట్లీ, కోరస్‌, జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ వంటి పెద్ద కంపెనీలను అక్వైర్‌ చేశారు. ప్రధానంగా దేశీయ కంపెనీగా ఉన్న టాటాను అంతర్జాతీయ స్థాయిలో శక్తిమంతమైన కంపెనీగా తీర్చిదిద్దారు. రతన్‌ టాటా  నాయకత్వంలోనే టాటా సన్స్‌ గ్రూపు మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రపంచంలో అత్యంత చవకైన టాటా నానో కారును తీసుకు వచ్చింది. ఆయన నాయకత్వంలోనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రపంచ ఐటీ దిగ్గజంగా ఎదిగింది. 2012లో ఆయన టాటా చైర్మన్‌ పదవి నుంచి తప్పుకొన్నారు. అప్పటి నుంచి టాటా మోటర్స్‌, టాటా స్టీల్‌ సహా టాటా సన్స్‌ గ్రూపు కంపెనీలకు గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నాయకత్వం వివాదం తలెత్తినప్పుడు 2016లో కొంతకాలం ఆయన మళ్లీ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు.