రిటైర్డ్ ఏసీపీకే టోక‌రా.. ఆన్‌లైన్‌లో డ్రైఫ్రూట్స్‌ ఆర్డ‌ర్ ఇస్తే..

రిటైర్డ్ ఏసీపీకే టోక‌రా.. ఆన్‌లైన్‌లో డ్రైఫ్రూట్స్‌ ఆర్డ‌ర్ ఇస్తే..
  • రూ.రూ.31,019 దోచేసిన సైబ‌ర్ నేర‌గాళ్లు
  • ఆర్థిక రాజ‌ధాని ముంబైలో ఘ‌ట‌న‌



విధాత‌: రిటైర్డ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్ (ఏసీపీ)కే టోక‌రా ఇచ్చారు సైబ‌ర్ నేర‌గాళ్లు. ఆన్‌లైన్‌లో డ్రై ఫ్రూట్స్‌ ఆర్డర్ చేసిన ఆయ‌నను బురిడీకొట్టించారు. బ్యాంకు ఖాతా నుంచి రూ.31,019 కాజేశారు. ఈ ఘ‌ట‌న తాజాగా ఆర్థిక రాజ‌ధాని ముంబైలో జ‌రిగింది.


పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. భారతీయ రెవెన్యూ సర్వీస్ అధికారి సమీర్ వాంఖడే తండ్రి అయిన బాధితుడు రిటైర్డ్ ఏసీపీ జ్ఞానదేయో కచ్రుజీ వాంఖడే 74.. ఫేస్‌బుక్‌లోని ఒక ప్రకటనలో ఉన్న‌ మొబైల్ నంబర్‌లో ఈ నెల 22న డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేశారు. రూ. 2,000 విలువైన డ్రై ఫ్రూట్స్ తేవాల‌ని ఆర్డ‌ర్ చేశారు. కొద్దిసేప‌టి త‌ర్వాత‌ అవ‌త‌లి వ్య‌క్తి యూపీఐ ద్వారా డబ్బును పంపాల‌ని కోరాడు.


వాంఖ‌డే రూ.2000 పంపించారు. పార్సిల్ సిద్ధంగా ఉన్న‌ద‌ని పేర్కొంటూ అవ‌తలి వ్యక్తి నుంచి బాధితుడికి మ‌ళ్లీ కాల్ వచ్చింది. కానీ, జీఎస్‌టీ సమస్యల కారణంగా పార్సిల్ లాక్ అయింద‌ని పేర్కొన్నాడు. ఆ తర్వాత బాధితుడు వాంఖ‌డే తనకు డ్రై ఫ్రూట్స్ అవసరం లేదని కాలర్‌తో చెప్పి తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.


మీ డ‌బ్బులు మీకు పంపిస్తాం.. ఈ యూపీఐకి ఒక్క రూపాయి పంపించాల‌ని అడిగాడు. వాంఖ‌డే ఆ నంబ‌ర్‌కు రూ.1 పంపించారు. తాము పంపిన లింక్‌పై కోడ్‌ను నమోదు చేయమని అవ‌త‌లి వ్య‌క్తి కోర‌డ‌టంతో.. బాధితుడు లింక్‌పై నంబర్ల‌ను నమోదు చేశారు. దాంతో ఆయ‌న బ్యాంక్ ఖాతా నుంచి 31,019 రూపాయలు క‌ట్ అయిన‌ట్టు సందేశాలు వచ్చాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఆయ‌న ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేర‌కు వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.