Kolkata murder case । కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడి కుటుంబీకులేమంటున్నారు? సైకో అనాలసిస్‌లో ఏం తేలింది?
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ (trainee doctor) హత్యాచారం కేసులో ఇప్పటి వరకూ రెండో అనుమానితుడెవరినీ దర్యాప్తు అధికారులు అరెస్టు చేయలేదు. పోస్టుమార్టం నివేదికలో సైతం ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి

Kolkata murder case । దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ పీజీ డాక్టర్ (trainee doctor) హత్యాచారం కేసులో ఇప్పటి వరకూ రెండో అనుమానితుడెవరినీ దర్యాప్తు అధికారులు అరెస్టు చేయలేదు. పోస్టుమార్టం నివేదికలో సైతం ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె శరీరంపై ఉన్న గాయాలను గమనిస్తే ఇది ఒక్కరి పనికాదనీ తేలిపోతున్నది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్‌ను (civic volunteer) పోలీసులు అరెస్టు చేశారు. సంజయ్‌రాయ్‌ని ఉరి తీయాలని అనేక మంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల నుంచి మాత్రం మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్ రాయ్ తల్లి మాత్రం.. ఈ కేసులో తన కుమారుడు నిర్దోషి అని, అతడిని బలవంతంగా ఇరికించారని ఆరోపించారు.
ఈ కేసులో చాలా మంది హస్తం ఉన్నదని ఆమె అన్నారు. సంజయ్‌రాయ్ కుటుంబ సభ్యులతో ఎన్డీటీవీ (NDTV) మాట్లాడింది. అయితే.. బాధ్యులెవరైనా వారికి తప్పక శిక్ష పడుతుందని సంజయ్ రాయ్ తల్లి అన్నారు. ఈ నేరంలో (crime) ఒకరికంటే మించి భాగస్వామ్యం ఉన్నదని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వారందరినీ రక్షించుకునే ప్రయత్నంలో సంజయ్‌ను బలిపశువును (scapegoat) చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని బహబనిపూర్‌లోని ఒక చిన్న ఇంట్లో తన కుమారుడు ఉండేవాడని, ఈ మధ్యే పోలీస్ బ్యారక్స్‌లో (barracks) ఎక్కువ కాలం గడుపుతున్నాడని సంజయ్ తల్లి మాలతి రాయ్ చెప్పారు. ‘నన్న బాగా చూసుకునేవాడు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారం మొత్తం తనే తీసుకున్నాడు’ అని మాలతి రాయ్ తెలిపారు.
అయితే.. సంజయ్ రాయ్ కోల్‌కతా పోలీస్ (Kolkata Police) అనే స్టిక్కర్ ఉన్న వాహనాన్ని నడుతుండేవాని, కేపీ (కోల్‌కతా పోలీస్) లోగో ఉన్న టీషర్టు ధరించేవాడని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. తరచూ పోలీస్ బ్యారక్స్‌లోనే ఉండేవాడని తెలుస్తున్నది. హాస్పిటల్‌లో పనిచేస్తూ.. పేషెంట్లకు బెడ్స్ ఇప్పించేందుకు వారి బంధువుల నుంచి లంచాలు గుంజేవాడని, డబ్బులు తీసుకుని రక్తపరీక్షలకు (pathological tests) ఏర్పాటు చేయించేవాడని తెలుస్తున్నది.
సంజయ్ రాయ్‌కు నలుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. ఒక సోదరి ఈ విషయంలో మాట్లాడుతూ.. అతడు ఆ నేరం చేసినట్టయితే కఠినంగా శిక్షించాల్సిందేనని (Punish him if he has done it) అన్నారు. తమ వివాహాన్ని కుటుంబీకులు వ్యతిరేకించడంతో గత 17 ఏళ్లుగా తాను తన తల్లిని చూడలేదని చెప్పారు. ‘మా తమ్ముడు ఎలా పెరిగాడో నాకు నిజంగా తెలియదు. అయితే.. ఇంతటి ఘోరానికి పాల్పడి ఉండడని నమ్ముతున్నాను’ అన్నారు. ‘ఏమో నాకు తెలియదు. కానీ.. వార్త తెలియగానే నివ్వెరపోయాను. అర్థం కాలేదు. ఒకవేళ అతడు ఈ నేరం చేసినట్టయితే చట్ట ప్రకారం శిక్షించాల్సిందే’ అని చెప్పారు.
సంజయ్ రాయ్ సైకో అనాలసిస్‌లో ఏం తేలింది?
సీబీఐ విజ్ఞప్తి మేరకు సంజయ్ రాయ్‌కు సైకోఎనాలిటిక్ (psychoanalytic) పరీక్షలు నిర్వహించారు. నిందితుడు వికృత ప్రవర్తన (pervert) కలిగినవాడని, అశ్లీల వీడియోలకు బానిసై పోయాడని అందులో తేలింది. అతడిది పశువులాంటి స్వభావమని ఒక సీబీఐ అధికారి అభివర్ణించారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు రగిలిగిన ఈ ఘటనపై నిందితుడు ఎలాంటి పశ్చాత్తాపాన్నీ వ్యక్తం చేయలేదని సీబీఐ అధికారి తెలిపారు. ఘటన జరిగిన తీరును ఎలాంటి సంకోచాలు లేకుండా సంజయ్ వివరించాడని ఆయన చెప్పారు. ఘటనా స్థలంలో సంజయ్ ఉన్నాడనేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించాయని, దీని వెనుక భారీ కుట్ర (larger conspiracy) ఏదైనా ఉన్నదా? అనే అంశంలో సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు. ఈ కేసులో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోస్‌ను కూడా సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.