ఇజ్రాయెల్ నుంచి 235 మందితో భార‌త్‌కు వ‌చ్చిన రెండో బ్యాచ్

ఇజ్రాయెల్ నుంచి 235 మందితో భార‌త్‌కు వ‌చ్చిన రెండో బ్యాచ్
  • కొన‌సాగుతున్న ఆపరేషన్ అజయ్

విధాత‌: పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం నేప‌థ్యంలో ఆ దేశం నుంచి 235 మంది భార‌తీయుల‌ను కేంద్రం ప్ర‌భుత్వం శుక్ర‌వారం భార‌త్‌కు తీసుకొచ్చింది. అక్టోబర్ 7న గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై జరిగిన నిర్భయ దాడుల నేప‌థ్యంలో స్వదేశానికి తిరిగి రావాలనుకొనే భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం గురువారం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది.


అస్థిర ప్రాంతంలో ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్న భార‌తీయుల‌ను ప్ర‌త్యేక విమానాల్లో తీసుకురావాల‌ని నిర్ణ‌యించింది. తొలి రోజు గురువారం తొలి విడ‌త 212 మంది భారతీయుల‌ను స్వదేశం న్యూఢిల్లీకి తీసుకొచ్చింది. శుక్ర‌వారం రెండో బ్యాచ్‌లో ఇద్దరు శిశువులు సహా 235 మంది భారతీయ పౌరులను సుర‌క్షితంగా త‌ర‌లించింది.


దాంతో ఇప్ప‌టివ‌ర‌కు జెరూస‌లేం నుంచి న్యూఢిల్లీకి 447 మంది భార‌తీయులు కేంద్రం ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ట్ట‌యింది. ఆపరేషన్ అజయ్ కొన‌సాగుతుంద‌ని, యుద్ధం నేప‌థ్యంలో ఇజ్రాయెల్ నుంచి రావాల‌నుకొనే భారతీయుల‌ను తీసుకొస్తామ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.