Israel Hostage Release | రెండేళ్ల తర్వాత హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల

గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో రెండేళ్లుగా బందీలుగా ఉన్న 20 మంది ఇజ్రాయెల్ పౌరులు విడుదలయ్యారు. రెడ్ క్రాస్ ద్వారా స్వదేశానికి తరలింపు.

Israel Hostage Release | రెండేళ్ల తర్వాత హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల

దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న 20 మంది బందీలు విడుదలయ్యారు. తొలుత ఏడుగురు ఆ తర్వాత 13 మంది బందీలు రిలీజ్ అయ్యారు. ఈ 20 మందిని రెడ్ క్రాస్ బృందం ఇజ్రాయెల్ కు తీసుకెళ్లింది. దీంతో ఇజ్రాయెల్ తమ వద్ద బందీలుగా ఉన్న పాలస్తీనాకు చెందిన ఖైదీలను విడుదల చేసింది.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా సోమవారం నాడు హమాస్ 20 మంది ఇజ్రాయెల్ బందీలు విడుదలయ్యారు. బందీలను రెండు దశల్లో విడుదల చేశారు. మొదటి దశలో, ఉదయం ఏడుగురు బందీలను విడుదల చేశారు. రెండవ దశలో మరో 13 మందిని విడుదల చేశారు. రెండేళ్ల యుద్ధం తర్వాత బందీలు స్వదేశానికి తిరిగి వస్తున్నారు.

ఈతన్ మోర్, గాలి, జివ్ బెర్మాన్, మతన్ అంగ్రెస్ట్, ఒమ్రీ మిరాన్, గై గిల్బోవా దలాల్, అలోన్ అహెల్ లను తొలుత రెడ్ క్రాస్ బృందానికి హమాస్ అప్పగించింది. సెకండ్ ఫేజ్ లో ఎవ్యతార్ డేవిడ్, అలోన్ ఓహెల్, అవినాటన్ ఓర్, ఏరియల్ కునియో, డేవిడ్ కునియో, నిమ్రోడ్ కోహెన్, బార్ కుపర్‌స్టెయిన్, యోసెఫ్ చైమ్ ఒహానా, సెగెవ్ కల్ఫోన్, ఎల్కానా బోహ్‌బోట్, మాగ్జిమ్ హెర్కిన్, ఈటన్ హార్న్, రోమ్ బ్రాస్లావ్‌స్కీ విడుదలయ్యారు. విడుదలైన వారు వీడియో కాల్ లో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విడుదలైన వారంతా భావోద్వేగానికి గురయ్యారు.

ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆపరేషన్ రిటర్నింగ్ హోమ్ అనే శీర్షికతో సోషల్ మీడియాలో ఒక అప్‌డేట్‌ను పోస్ట్ చేశాయి. విడుదలైన ఏడుగురు బందీలతో పాటు ఐడీఎఫ్, ఐఎస్ఏ సిబ్బంది ఇజ్రాయెల్‌కు తిరిగి వస్తున్నారని అక్కడ వారికి ప్రాథమిక వైద్య పరీక్ష జరుగుతుందని ఈ పోస్టు తెలిపింది.

బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బందీల గోప్యతను గౌరవించాలని అధికారిక సమాచారంపై మాత్రమే ఆధారపడాలని ప్రజలను కోరింది. టెల్ అవీవ్‌లో పెద్ద బహిరంగ ప్రదర్శనలకు వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. చాలా మంది జెండాలు ఊపుతూ గాజాలో ఇప్పటికీ నిర్బంధించిన వారి పేర్లు, ముఖాలు ఉన్న బోర్డులను పట్టుకున్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ కాల్పులకు విరమణకు అంగీకరించాయి. ఇందులో భాగంగానే బందీలు విడుదలయ్యారు.