రాజ్యసభకు సిద్దరామయ్య…సీఎంగా డీకే శివ‌కుమార్!

కర్ణాటకలో సీఎం మార్పుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సిద్దరామయ్య రాజీనామా చేసి డీకే శివకుమార్ సీఎం కానున్నారన్న ప్రచారం జోరందుకుంది.

కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో, ప్రభుత్వంలో కీలక మార్పులకు కారణమవుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు రేపు ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి సిద్ద‌రామ‌య్య రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. ఆయనను రాజ్యసభకు రావాలని హైకమాండ్ సూచించిందని…క‌ర్ణాట‌క సీఎంగా డీకే శివ‌కుమార్ బాధ్యతలు చేపడుతారని కాంగ్రెస్ వర్గాల కథనం.

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొన్నాళ్లుగా కొనసాగుతున్న సందిగ్ధత నడుమ నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ డీకే శివ‌కుమార్,సిద్ధ‌రామ‌య్యతో రోజంతా చర్చలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రణ్‌దీప్‌ సుర్జేవాలాతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కర్ణాటక కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. 2023లో పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీలో భాగంగా తనకు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చి తీరాలని అగ్రనేతల ముందు డీకే శివకుమార్ మరోసారి తన వాదన వినిపించారు.

ప్రతిగా సిద్దరామయ్య తను సీఎం పదవీ వదులుకోవాల్సి వస్తే ఎస్సీ వర్గానికి చెంది పరమేశ్వర్ ను సీఎం చేయాలని మెలిక పెట్టారు. అయితే అన్ని వర్గాల వాదనలపై భేటీలో సుదీర్ఘ చర్చ అనంతరం కర్ణాటక సీఎం మార్పుపైన, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన కాంగ్రెస్ హైకమాండ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

సిద్ధరామయ్య సీఎం పదవిని వదులుకొని, రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సహకరించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. అతనికి రాజ్యసభ స్థానంతో పాటు ఆ సభలో విపక్ష నేతగానూ అవకాశం ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది.

రేపు సిద్దరామయ్య రాజీనామా.?

అధిష్టానం నిర్ణయం నేపథ్యంలో రేపు బెంగుళూరులో కేబినెట్ మీటింగ్ త‌ర్వాత సీఎం ప‌ద‌వికి సిద్ధ‌రామ‌య్య‌ రాజీనామా చేయ‌నున్నారు. గురువారం తొలుత సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి, అనంతరం బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

నూతన సీఎం డీకే శివకుమార్ సారధ్యంలోని కేబినెట్ లో సిద్ధ‌రామ‌య్య కుమారుడు యతీంద్రకు ఉపముఖ్యమంత్రిగానూ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. సిద్ధ‌రామ‌య్యను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ఆయన సేవ‌లు దేశ‌వ్యాప్తంగా పార్టీ కోసం ఉప‌యోగించుకుంటామ‌న్న రాహుల్ గాంధీ భరోసానిచ్చినట్లుగా తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఏనుగు ఆరోగ్యం కోసం…జనం ప్రార్థనలు !
Lava Shark 2 | రూ.12వేలలోపే 5G మొబైల్ లాంచ్ చేసిన లావా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

Latest News