Sonia Gandhi | నా కొడుకు రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్‌ మే 20న జరగనున్నది. ఈ విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరగనున్నా అందరి దృష్టి రెండు నియోజకవర్గాలపైనే ఉన్నది

Sonia Gandhi | నా కొడుకు రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నా

రాయ్‌బరేలీసభలో సోనియా ఉద్వేగ ప్రసంగం
ఇక్కడి ప్రజలతో తనకు ఉన్న బంధం గంగామాత అంత పవిత్రమైంది
పేదలకు సేవ చేయడమే తన పిల్లలకు నేర్పించా

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్‌ మే 20న జరగనున్నది. ఈ విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరగనున్నా అందరి దృష్టి రెండు నియోజకవర్గాలపైనే ఉన్నది. అవే యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీ. కాంగ్రెస్‌ కంచుకోటలైన ఈ రెండు స్థానాల్లో పోటీ ఆసక్తికరంగా నెలకొన్నది. ఈ నేపథ్యంలో రాహుల్‌ కు మద్దతుగా కాంగ్రెస్‌ అగ్రనేత్రి సోనియాగాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. వేదికపై సోనియాగాంధీ, రాహుల్‌, ప్రియాంకలను చూసి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాయ్‌బరేలీలోని శివాజీనగర్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సోనియా ఉద్వేగ ప్రసంగం చేశారు. తనను మీలో ఒకరిగా గుర్తించినట్టే రాహుల్‌ ఆదరించాలని ప్రజలను కోరారు.

ఈ సందర్భంగా సోనియామాట్లాడుతూ.. ‘నా కొడుకు రాహుల్‌ను మీకు అప్పగిస్తున్నాను. రాయ్‌బరేలీ ప్రజలను రాహుల్‌ నిరాశపరచడు అని అన్నారు. రాయబరేలీ ప్రజలు తమ కుటుంబ సభ్యులని వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా తమకు సేవ చేసే అవకాశం ఇచ్చారని తెలిపారు. రాయ్‌బరేలీ, అమేథీలను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. ఇక్కడి ప్రజలతో తనకు ఉన్న బంధం గంగామాత అంత పవిత్రమైనది పేర్కొన్నారు. పేదలకు సేవ చేయడమే తన పిల్లలకు నేర్పించానని చెప్పారు.

ఇక్కడి ప్రజలతో వందేళ్ల అనుబంధం

రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ ప్రజలతో తమ కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉన్నదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. లోక్‌సభ సభ్యత్వాన్ని, తన ఇంటిని లాగేసుకున్నారని ఈ సందర్భంగా రాహుల్‌ గుర్తుచేశారు. దర్యాప్తు సంస్థలు విచారించినా తాను భయపడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నుంచి బైటికి పంపినప్పుడు దేశ ప్రజలు అండగా నిలబడినారని తెలిపారు.