Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1వ తేదీన రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది మే 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ తేదీకి నాలుగు రోజులు అటు ఇటుగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో జూన్ తొలివారంలోనే రాష్ట్రంలోకి కూడా రుతుపవనాలు ఎంటరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గత ఏడాది మే 27వ తేదీన రుతుపవనాలు భారత్‌లోకి వస్తాయని ఐఎండీ అంచనా వేసింది.. కానీ అంచనాల కన్నా వారం ముందే అంటే మే 21వ తేదీనే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. అలాగే ఈ సారి కూడా ముందుగానే అంటే.. ఈ నెల 22వ తేదీనే కేరళను తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లక్షదీవుల దగ్గర వాతావరణం చురుగ్గా ఉంది. దీనికితోడు హిందూమహాసముద్రంలో ఒక వాయుగుండం ఏర్పడింది. అది గాలులను గంటకు 55 కిలోమీటర్ల వేగంతో తిరిగేలా చేస్తోంది. అందువల్ల నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉంది.
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. బంగాళాఖాతం, అండమాన్ సముద్రాల్లో ఇప్పటికే రుతుపవనాల మేఘాలు కమ్ముకున్నాయని తెలిపింది. శనివారం నాటికి అవి నికోబార్ దీవుల్లో ప్రవేశిస్తాయని పేర్కొంది. ఇక శనివారం నాడు లక్షదీవులతో పాటు రాయలసీమ, ఏపీ తీర ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉందని చెప్పింది. అలాగే మే 16, 17వ తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Read More:
