భానుడి భగభగల వేళ..వాతావరణ శాఖ చల్లని కబురు!

తెలంగాణలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న వర్షాలతో  వాతావరణం చల్లబడనున్నప్పటికి...రైతాంగానికి మాత్రం నష్టదాయకంగా కనిపిస్తున్నాయి. 

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | May 03, 2026, 4:13 pm IST
Read Time: 5 mins
భానుడి భగభగల వేళ..వాతావరణ శాఖ చల్లని కబురు!

విధాత : నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలతో పాటు వడగాల్పుల భగభగలతో అల్లడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న వర్షాలతో  వాతావరణం చల్లబడనున్నప్పటికి…రైతాంగానికి మాత్రం నష్టదాయకంగా కనిపిస్తున్నాయి.

ఎల్లుండి భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మే6వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

ప్రస్తుతం తెలంగాణలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఈ సీజన్‌లోనే అత్యధికంగా నిజామాబాద్‌లో 46డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో బయటకు వస్తే వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణకు తగినంత నీరు తాగాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిందని సూచనలు చేస్తున్నారు. ఇకపోతే రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 33డిగ్రీల వరకు నమోదవుతున్న తీరుతో జనం ఉక్కపోత, దోమల మోతతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతున్నారు.

అకాల వర్షాలతో కష్టనష్టాలలో రైతాంగం

ఉపరితల ద్రోణి ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం పడిన వర్షాలు రైతాంగాన్ని కష్టనష్టాల పాలు చేశాయి. కొత్తపేట నియోజకవర్గంలో ఆదివారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో వాన పడింది. అకాల వర్షంతో వరి కోతలకు తీవ్ర ఆటంకం ఏర్పడగా.. కళ్లాలలో రైతులు
ధాన్యం రాశులను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. పలుచోట్ల ధాన్యం వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందారు.తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల వేడుకుంటున్నారు.