Digital Arrest : డిజిటల్ అరెస్టులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా ఆందోళన.. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సైబర్ నేరాల దర్యాప్తుపై కీలక సూచనలు.

Digital Arrest : డిజిటల్ అరెస్టులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : డిజిటల్ అరెస్టుల వ్యవహారంపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలలో డిజిటల్ అరెస్ట్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. డిజిటల్ అరెస్టు కేసుల దర్యాప్తుకు వనరులు, సైబర్ నిపుణుల అవసరం, తదితర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నేపథ్యంలో డిజిటల్ అరెస్టులపై సీబీఐ దర్యాప్తుకు సుముఖత వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించి తగిన ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

డిజిటల్ అరెస్టుల పేరిట జరుగుతోన్న సైబర్ నేరాల కారణంగా పలువురు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన ఓ కేసును సుమోటాగా తీసుకొని విచారణ జరుపుతోంది. డిజిటల్ అరెస్టు కారణంగా తాను రూ.కోటి కోల్పోయానని హరియాణాకు చెందిన ఓ వృద్ధ మహిళ వేసిన కేసు నేపథ్యంలో ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మయన్మార్, థాయ్‌లాండ్ వంటి ఆఫ్‌షోర్ లొకేషన్ల నుంచి ఇలాంటి కేసులు వెలుగు చూస్తున్నాయని, ఈ కేసుల దర్యాప్తునకు ఒక ప్రణాళికను రూపొందించాలని సీబీఐనిఆదేశించింది. కేంద్ర ఏజెన్సీ దర్యాప్తులో పురోగతిని పరిశీలిస్తామని, అనంతరం అవసరమైన ఆదేశాలను జారీ చేస్తామని పేర్కొంది.