మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. మత మార్పిడికి సంబంధించి షెడ్యూల్డ్ కులాల (SC) హోదాపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు ఎస్సీ హోదాను కొనసాగించలేరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ అంశంపై మార్చి 2026లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలను లేదా సర్టిఫికేట్‌ను పొందడం చెల్లదని, మత మార్పిడితో ఎస్సీ హోదా స్వయంచాలకంగా రద్దవుతుందని మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బాధితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి ఉందంటూ, రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది.
ఇతర మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని, అయితే, క్రైస్తవం లేదా ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే.. కొన్ని నిర్దిష్ట షరతుల మేరకు ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఎస్సీ హోదా పునరుద్ధరణకు 3 కీలర షరతులు తప్పనిసరి అని పేర్కొంది. ఆ వ్యక్తి జన్మతః షెడ్యూల్డ్ కులానికి చెందినవారై ఉండాలని, తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాన్ని నిజమైన ఉద్దేశంతో స్వీకరించి ఉండాలని, సంబంధిత అసలు కులం ఆ వ్యక్తిని తిరిగి తమ సభ్యుడిగా అంగీకరించి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మూడు షరతుల్లో ఏ ఒక్కటి నెరవేరకపోయినా ఎస్సీ హోదాను పునరుద్ధరించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
