నా ప్రాణమున్నంత వరకు రాజ్యంగాన్ని కదిలించలేరు..రిజర్వేషన్లు కొనసాగుతాయి: ప్రధాని మోదీ

నా ప్రాణమున్నంత వరకు ఈ ప్రపంచంలోని ఏ శక్తి..ఏ వ్యక్తి భారత రాజ్యంగాన్నికదిలించలేరని, రాజ్యంగాన్ని కాపాడే పూర్తి బాధ్యత నాదేనని, అలాగే నేను బతికున్నంతవరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని,

నా ప్రాణమున్నంత వరకు రాజ్యంగాన్ని కదిలించలేరు..రిజర్వేషన్లు కొనసాగుతాయి: ప్రధాని మోదీ
    • రిజర్వేషన్లు కొనసాగుతాయి
    • నా ప్రాణం ఉన్నంత వరకూ రాజ్యాంగాన్ని ఎవరూ కదల్చలేరు
    • రిజర్వేషన్ల రద్దు ఫేక్ వీడియో వెనుక డబుల్ ఆర్‌ పాత్ర
    • తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్‌
    • అవినీతి కేసుల్లో పరస్పరం కాపాడుకుంటున్న బీఆరెస్, కాంగ్రెస్‌
    • కాంగ్రెస్ వస్తే 50% ప్రజాసంపద గుంజుకుంటారు
    • జహీరాబాద్ సభలో ప్రధాని మోదీ

విధాత : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు. తన ప్రాణమున్నంత వరకు ఈ ప్రపంచంలోని ఏ శక్తి.. ఏ వ్యక్తి భారత రాజ్యంగాన్ని కదిలించలేరని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడే పూర్తి బాధ్యత తనదేనన్నారు. తాను బతికున్నంతవరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. వాటిని రాజ్యాంగ వ్యతిరేకంగా మతపరంగా ముస్లింలకు ధారాదత్తం చేయనివ్వబోనని ప్రకటించారు. మంగళవారం జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని అల్లాదుర్గం వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ఫేక్ వీడియోలతో బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఫేక్ వీడియోల వెనుక డబుల్ ఆర్.. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేమని కాంగ్రెస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి రిజర్వేషన్ల రద్దుపై ఫేక్ వీడియోలను ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే రాజ్యాంగం 75 ఏళ్ల పండుగలను పల్లెపల్లెలో నిర్వహిస్తామని తెలిపారు. అప్పుడు గాంధీల కుటుంబం ఏ రకంగా రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను అవమానించారో, తూట్లు పొడిచారో ఆ బాగోతాన్ని బయటపెడుతామన్నారు.

మాకు అది ధర్మ గ్రంథం

బీజేపీ ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ధర్మ గ్రంథమని ప్రధాని మోదీ చెప్పుకొన్నారు. రాజ్యాంగం తనకు భారతం, రామాయణం, బైబిల్, ఖురాన్‌తో సమానమన్నారు. రాజ్యాంగం పట్ల, రిజర్వేషన్ల పట్ల విశ్వాసం లేని కాంగ్రెస్, గాంధీ కుటుంబం మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్‌పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నదని అన్నారు. ఎమర్జెన్సీ విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. రాజ్యాంగంలో రామాయణ, మహాభారత చిత్రాలు ఉన్నాయని, ఆ చిత్రాలను కాంగ్రెస్ తొలగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ తమ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని వాడుకుందని, ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండొద్దని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ దారిలో ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను

కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే ప్రజలపై వారసత్వ పన్ను విధించబోతున్నారని, మీ సంపదలో 50% లాగేసుకుంటారని మోదీ హెచ్చరించారు. పేదలు ఎప్పటికీ పేదలుగానే ఉండేలా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అవినీతి, అబద్ధం, ఓటు బ్యాంకు రాజకీయం, మాఫియా, కుటుంబ రాజకీయం అనే పంచ సూత్రాలతో వ్యవహరిస్తుందని అన్నారు. తెలంగాణలో లింగాయతులు, మరాఠాలను ఓబీసీ లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారని, కానీ ఇక్కడ ప్రభుత్వాలకు వారిని ఓబీసీలుగా మార్చడం ఇష్టం లేదని, ముస్లింల మెప్పుకోసం ఓబీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.. మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ఈసారి ప్రతిపక్ష హోదా స్థాయికి అవసరమైన సీట్లు కూడా రావని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీని మరోసారి గెలిపించాలని మోదీ కోరారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం మీ ఓటుతో సాధ్యమైందన్నారు.