డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? రాష్ట్రపతిపాలనా?

తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పొద్దున్న నుంచీ అన్నాడీఎంకే మద్దతు విజయ్‌కు ఉంటుందని ప్రచారం సాగినా.. అవన్నీ ఊహాగానాలేనని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొట్టిపారేశారు. తాము విజయ్‌కు మద్దతు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. వామపక్షాలు, ఇతర పార్టీలు కూడా నో చెప్పాయి. ఇలా ఉంటే.. ఒక సంచలన వార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నది. రెండు ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు చేస్తున్నాయన్నది ఆ ప్రచారం సారాంశం. ఇది నిజమా? కల్పితమా? తేలాలంటే మరికొన్ని గంటలు ఓపిక పట్టాలి.

విజయ్‌ పార్టీ టీవీకేకు మద్దతు ఇస్తారని భావిస్తూ వచ్చిన అన్నాడీఎంకే తన వైఖరిని స్పష్టం చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేది లేదని బుధవారం (మే 6) ప్రకటించింది. టీవీకే 108 స్థానాలు సాధించి ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా.. మెజార్టీకి పది సీట్ల దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దానితోపాటు వామపక్షాలు, వీసీకే కూడా మద్దతు ఇస్తాయన్న ప్రచారం సాగినా.. చివరకు అవి కూడా ససేమిరా అనేశాయి. దీంతో అన్నాడీఎంకే మద్దతు ఒక్కటే టీవీకేను గట్టెక్కిస్తుందని భావించిన సమయంలో అది కూడా సమస్యే లేదని తేల్చి చెప్పేయడంతో తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. గంట గంటకూ పరిణామాలు మారిపోతున్నాయి.

అన్నాడీఎంకే నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో కొంత మంది టీవీకే మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నట్టు వచ్చిన వార్తలను మీడియా ప్రస్తావించగా.. అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కేపీ మునుస్వామి స్పందిస్తూ.. విజయ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలన్నీ ఊహాగానాలేనని స్పష్టంచేశారు. ఇది పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ఆదేశాల మేరకు తాను ఈ మేరకు స్పష్టతనిస్తున్నానని మునుస్వామి తెలిపారు.

అయితే.. అన్నాడీఎంకేలో ఒక వర్గం విజయ్‌కు మద్దతు ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్టు బుధవారం వార్తలు వచ్చాయి. లేనిపక్షంలో తాము పార్టీని వీడి వెళతామని వార్నింగ్‌ ఇచ్చారని కూడా అనధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. అదే నిజమైతే.. అన్నాడీఎంకేలో మెజార్టీ సభ్యులు చీలిపోయి.. విజయ్‌ గూటికి చేరే అవకాశం ఉంటుంది. అయితే.. ఉన్న సమయం విజయ్‌కు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

ఇప్పుడేంటి?

మే 7వ తేదీన విజయ్‌ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసినా.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ కార్యక్రమం ఉంటుందో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో తమిళనాడులో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. విజయ్‌ ద్రవిడ సిద్ధాంతాలను ఆధారం చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసిన నేత కాదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ద్రవిడ పార్టీల ఉనికిని కాపాడుకునేందుకు… బద్ధ విరోధులైన డీఎంకే, అన్నాడీఎంకే చేతులు కలుపుతాయా? అన్న ప్రచారం మొదలైంది. అంతేకాదు.. ఈ రెండు పార్టీల మధ్య చర్చలు సాగుతున్నట్టు ధృవీకరించని ప్రచారం వినిపిస్తున్నది. డీఎంకే 59 స్థానాల్లో గెలిచింది. అన్నాడీఎంకేకు 47 సీట్లు వచ్చాయి. వాటి మిత్రపక్షాలను కూడా కలుపుకొంటే 120 మంది వరకూ తేలుతున్నారు. కాంగ్రెస్‌ మద్దతు లేకుండానే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటుతుంది. అందుకే ఐయూఎంఎల్‌, వామపక్షాలు, వీసీకే విజయ్‌వైపు మొగ్గు చూపలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ ప్రచారం వాస్తవం కాని పక్షంలో జరుగబోయేదేంటనే చర్చలూ జోరుగా సాగుతున్నాయి. మెజారిటీ నిరూపించుకోలేకపోతే రెండో అతిపెద్ద పార్టీని గవర్నర్‌ పిలవడం సంప్రదాయం. ఇప్పుడు వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. డీఎంకే, అన్నాడీఎంకే, వాటి మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. అది కూడా కాని పక్షంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉంటాయి. పరిస్థితి అంత వరకూ వెళుతుందా? లేక కొత్తగా బీజేపీ ఏమైనా పాచికలు వేస్తుందా? ఇవన్నీ తేలాలంటే.. మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Latest News