తమిళనాడులో మారుతున్న పరిణామాలు..మరోసారి గవర్నర్‌ వద్దకు విజయ్

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్‌ను మరోసారి కలిసిన టీవీకే చీఫ్ విజయ్, అవకాశం రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

తమిళనాడు రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న రాజకీయ గందరగోళం తమిళ రాజకీయాలలో ఉత్కంఠత పెంచుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ టీవీకే చీఫ్ విజయ్ గురువారం మరోసారి లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. అటు అన్నాడీఎంకే పళని స్వామి వర్గం కూడా గవర్నర్ తో భేటీ కానుండటంతో ఆయన నిర్ణయం ఏమై ఉంటుందన్న చర్చ జోరందుకుంది.

గవర్నర్ అనుమతించకపోతే.. సుప్రీంకోర్టుకు..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అతిపెద్ద పార్టీగా తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ ను కలిసి కోరిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ మెజార్టీ మార్కు 118మంది ఎమ్మెల్యేల మద్దతూ చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని చెప్పడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో గందరగోళం మరింత పెరిగిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకే లు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తుండటంతో ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న అంశంలో సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో మరోసారి విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తో భేటీ కావడం ఆసక్తి రేపుతుంది. గవర్నర్ తో భేటీ అనంతరం విజయ్ తన భవిష్యత్తు కార్యాచరణపై తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. గవర్నర్ తో రెండోసారి జరిగే భేటీలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

విజయ్ ను అడ్డుకునే కుట్రలపై నిరసనలు

సీఎం కాకుండా విజయ్ ని అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయంటూ టీవీకే కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు విజయ్ కి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. విజయ్ కి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ మెరినా బీచ్ లో నిరసనలు చేపట్టాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అటు కేంద్ర హోంశాఖ కూడా తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో భారీ ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తమైంది.

విజయ్‌కి ప్రజల అండ ఉంది.. ప్రకాశ్ రాజ్ పోస్ట్

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్ ను గవర్నర్ ఆహ్వానించాలని నటుడు ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. అసెంబ్లీలో బలనిరూపన చేసుకుంటానన్న విజయ్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం ఆమోదయోగ్యం కాదని.. అది రాజ్యాంగ విరుద్ధమని విమర్శిచారు. మా మధ్య విబేధాలు ఉన్నప్పటికి..విజయ్ ప్రజల మద్దతు సాధించాడని, ఆయనకే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం న్యాయం అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్ అవుతుంది. అటు నటుడు పోసోని మురళీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి అవకాశం ఇవ్వడమే న్యాయం అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి :

Chandranath Rath | సువేందు అధికారి పీఏ దారుణ హ‌త్య‌.. ఎవ‌రీ చంద్ర‌నాథ్ ర‌థ్‌..?
డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా? రాష్ట్రపతిపాలనా?

Latest News