సస్పెన్స్ థ్రిల్లర్.. తమిళ రాజకీయం !

తమిళనాడు రాజకీయాలు క్షణానికొక కొత్త మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118మెజార్టీ మార్క్ కోసం టీవీకే చీఫ్ విజయ్ తంటాలు పడుతుండగా...మరోవైపు విజయ్ ని అడ్డుకునేందుకు ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలు సాగిస్తుండటంతో గవర్నర్ నిర్ణయం ఆసక్తి రేపుతుంది.

విధాత: తమిళనాడు రాజకీయాలు క్షణానికొక కొత్త మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే టీవీకే చీఫ్ విజయ్ రెండు పర్యాయాలు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ను కలిసి కోరినప్పటికి తగినంత మెజార్టీ చూపడం లేదంటూ నిరాకరించారు. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో విజయ్ టీవీకే పార్టీ బలం 107+5=112కి చేరింది. అయినా ఇంకా ఆరుగురు మద్దతు కావాలి. దీని కోసం విజయ్ అపసోపలు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. గవర్నర్ ఇప్పుడు ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. విజయ్ తన సంఖ్యాబలం చూపితే ముందుగా ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని, డీఎంకే, అన్నాడీఎంకే కూటమి మెజార్టీతో వచ్చినా ఆహ్వానిస్తానని చేసిన వ్యాఖ్యలు కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఉత్కంఠతను మరింత పెంచేశాయి.

దశాబ్ధాల పోరాటం..పొత్తు దిశగా అడుగులు

మరోవైపు తమిళ రాజకీయాల్లో ఇన్నాళ్లుగా ఉప్పు నిప్పుగా ఉండే డీఎంకే, అన్నాడీఎంకే లు అనూహ్యంగా జతకట్టి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను కలిసేందుకు సిద్దమవుతుండటంతో రాష్ట్ర రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పింది. పళిని స్వామికి సీఎంగా మద్దతునిచ్చేందుకు డీఎంకే సానుకూలత తెలిపిందని…స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ తో పళని స్వామి గవర్నర్ ను కలిసేందుకు సిద్దమవ్వడం ఆసక్తి రేపుతుంది. అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేయడం తాజా పరిణామాలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలు, విజయ్ టీవీకే పార్టీని అధికారానికి దూరం పెట్టేందుకు చేతులు కలుపుతాయనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. డీఎంకే నుంచి వేరుపడిన ఎంజీ రామచంద్రన్ 1972లో అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. నాటి నుంచి నేటీ వరకు ఆ రెండు ద్రవిడ వాద పార్టీల కూటముల మధ్య అధికార మార్పిడి కొనసాగుతు వస్తుంది.

ద్రవిడ పార్టీలు కలిస్తే.. మెజార్టీ మార్క్

డీఎంకే, అన్నాడీఎంకే కూటమి బలంతో కలిపి గవర్నర్ కు మెజార్టీ మార్కు 118ఎమ్మెల్యేల మద్దతును తాను చూపిస్తానంటూ పళని స్వామి చెబుతున్నారు. మొదటి రెండున్నరేళ్లు అన్నా డీఎంకే నేత ఎడప్పాడి పళని స్వామి సీఎంగా ఉండే అవకాశముంది. ఆ తర్వాత రెండున్నరేళ్లు అధికార పగ్గాలు డీఎంకే చేపడుతుందని అంటున్నారు. అది… స్టాలిన్‌ లేదా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డీఎంకే కూటమి వద్ద 68 మంది ఎమ్మెల్యేలున్నారు. అలాగే అన్నాడీఎంకే వద్ద 53 మంది ఉన్నారు. వీరిద్దరి మధ్య పొత్తు కుదుర్చితే నిస్సంకోచంగా 121 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది

రిసార్ట్ లలోనే ఎమ్మెల్యేలు

విజయ్‌ టీవీకే ఎమ్మెల్యేలందరినీ మహాబలిపురం రిసార్టులో ఉంచిన సంగతి తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకే కూటములు రెండూ తమ ఎమ్మెల్యేలందరినీ పాండిచ్చేరి రిసార్టులకు తరలించడం విశేషం.
ఈ ఎన్నికల్లో డీఎంకే 59, అన్నా డీఎంకే 47 స్థానాల్లో గెలిచాయి. ఈ రెండు ప్రధాన ‘ద్రవిడ’ పార్టీల బలం 106. ఇక… ఈ రెండు కూటముల్లో ఏదో ఒకదానిలో భాగస్వాములుగా ఉన్న పీఎంకే (4), ఐయూఎంఎల్‌ (2), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2), డీఎండీకే (1), ఏఎంఎంకేఎంఎన్‌కేజడ్‌ (1) పార్టీలన్నింటికీ కలిపి… 14 సీట్లున్నాయి. వాటితో కలిపితే డీఎంకే, అన్నా డీఎంకేతోపాటు ఆ కూటముల్లోని ఇతర పార్టీల బలం 120 అవుతుంది. వీరందరూ కలిసి సులువుగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇదే జరిగితే… 108 స్థానాలున్న టీవీకే, ఇప్పటికే విజయ్‌కి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్‌ (5 స్థానాలు)కు భంగపాటు తప్పదు. అయితే అన్నాడీఎంకేతో డీఎంకే జత కట్టడాన్ని ఎంపీ కనిమొళి వ్యతిరేకిస్తున్నట్లుగా కథనాలు మరో ఆసక్తికరం అంశంగా వినిపిస్తున్నాయి.

పార్టీల వారిగా సంఖ్యా బలాలు

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ మార్క్ 118 స్థానాలు. ఎన్నికల్లో టీవీకే 108, డీఎంకే 59, అన్నా డీఎంకే 47, కాంగ్రెస్‌ 5, పీఎంకే 4, ఐయూఎంఎల్‌ 2, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2, బీజేపీ 1, డీఎండీకే 1, ఏఎంఎంకే ఎంఎన్‌కేజడ్‌ 1 స్థానం గెలిచాయి.

Latest News