తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీవీకే భారీ విజయం సాధించినప్పికీ మెజార్టీకి కొన్ని సీట్ల దూరంలోనే నిలిచిపోయింది. ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు ఉంటేనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారికంగా షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. మరోవైపు ఈ పరిణామం ఏకంగా అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టింది. అన్నాడీఎంకేలో మెజార్టీ ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అన్నాడీఎంకే తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారిలో మూడింట రెండు వంతులకు పైగా సభ్యులు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం కార్యాలయంలో సమావేశం కావడం ఆ పార్టీలో కలకలం రేపింది.
మెజార్టీకి పది సీట్ల తక్కువతో ఉన్న విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిని వీరంతా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తున్నది. లేనిపక్షంలో 30కిపైగా ఎమ్మెల్యేలు పార్టీ నుంచి చీలిపోయి విజయ్‌కు మద్దతు ఇస్తామంటూ పార్టీ అధినేతకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఇప్పటికే పళనిస్వామి విజయ్‌తో సంప్రదింపులు చేస్తున్నారని అన్నాడీఎంకే తరఫున ఎన్నికైన లీమారోస్ మార్టిన్ ప్రకటించారు. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ భార్య లీమారోస్.. తిరుచ్చి జిల్లా లాల్‌గుడి నియోజకవర్గం నుంచి పోటాపోటీగా సాగిన ఎన్నికలో విజయం సాధించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఆమె అల్లుడు ఆధవ్ అర్జున.. టీవీకే తరఫున చెన్నైలోని విల్లివాక్కం అసెంబ్లీ సెగ్మెంట్‌ను విజయం సాధించారు. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు 108 సీట్లు లభించాయి. అంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు మరో పది సీట్లు అవసరం. అన్నాడీఎంకే 47 సీట్లలో గెలుపొందింది.
షరతులతో కాంగ్రెస్ మద్దతు
ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్.. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే.. కొన్ని కీలక షరతులు విధించింది. తమిళనాడు ఓటరు తీర్పు రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగే ఒక లౌకిక ప్రభుత్వం కోసమని పేర్కొంటూ.. ఎన్డీయే పక్షాలతో సంబంధం లేని పక్షంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనని పార్టీ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అయితే.. కాంగ్రెస్ నిర్ణయంపై మిత్రపక్షం డీఎంకే మండిపడింది. ఇది పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించింది. జాతీయ పార్టీ తమకు వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.