నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 సోమవారం రాత్రి 7గంటల కు యాగశాలలో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం అంకురార్పణ కార్యక్రమంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. 15న ధ్వజారోహణం నిర్వహించనుండగా..ఉత్సవాలు 23వ తేదీ వరకు కొనసాగుతాయి.

విధాత : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 సోమవారం రాత్రి 7గంటల కు యాగశాలలో వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం అంకురార్పణ కార్యక్రమంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. విశ్వక్సేన పూజ నిర్వహిస్తారు.

ఈ ఏడాది రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అధికమాసం కారణంగా శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన ఆధ్యాత్మిక వైభవాన్ని వీక్షించే భాగ్యం భక్తులకు లభించనుంది. తిరుమల రెట్టింపు ఆనందం, భక్తి, దివ్య ఉత్సవాలతో ప్రకాశించనుంది. ఈ ఏడాది సాలకట్ల(సెప్టెంబర్ 14-23) , నవరాత్రి(ఆక్టోబర్ 11-20) బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 15 మంగళవారం సాయంత్రం 6:21కి మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. బంగారు ధ్వజ స్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేసి, సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.

ఈ సందర్బంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి ప్రభుత్వం తరుపునా పట్టువస్త్రాలు సమర్పించి, శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం మాఢ వీధుల్లో పెద్ద శేష వాహనంపై విహరించే ఉత్సవ మూర్తిని దర్శించుకోనున్నారు. ఈ సాలకట్ల బ్రహ్మత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతాయి.

ప్రత్యేక సేవలు, దర్శనాలు రద్దు

తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల సందర్బంగా (సెప్టెంబర్ 15-23) భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రొటోకాల్ మినహా), ఆర్జిత సేవలు…అష్టదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, పసిపిల్లలతో ఉన్న తల్లిదండ్రులు, ఎన్నారైలు, దాతల దర్శనాలు కూడా రద్దుకానున్నాయి. ఎస్ఎస్ డీ టోకెన్ల జారీని కూడా 6 రోజుల పాటు 19వ తేదీ వరకు నిలిపివేశారు. ఆ ఆరు రోజుల పాటు భక్తులను నేరుగా తిరుమల క్యూలైన్లలోకి అనుమతిస్తారు. ఈ నెల 21న దర్శనానికి సంబందించి ఎస్ఎస్డీ టోకెన్లను 20న జారీ చేస్తారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ – సెప్టెంబర్ 2026

సెప్టెంబర్ 14న సోమవారం రాత్రి 7గంటలకు అంకురార్పణ,

తేదీ రోజు ఉదయం (8–10 AM) సాయంత్రం (7–9 PM)

15-09-2026 మంగళవారం ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవ
16-09-2026 బుధవారం చిన్న శేష వాహనం, హంస వాహన సేవ
17-09-2026 గురువారం సింహ వాహనం సేవ , ముత్యపు పందిరి
18-09-2026 శుక్రవారం కల్ప వృక్ష వాహనం, సర్వ భూపాల వాహనం
19-09-2026 శనివారం మోహిని అవతారం, గరుడ సేవ (6:30 PM నుండి 11:30 PM)
20-09-2026 ఆదివారం హనుమద్ వాహనం, స్వర్ణ రథం (సాయంత్రం 4 గంటల నుంచి), గజ వాహనం
21-09-2026 సోమవారం సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
22-09-2026 మంగళవారం రథోత్సవం (ఉదయం 7 గంటల నుండి) అశ్వ వాహనం
23-09-2026 బుధవారం చక్ర స్నానం (ఉదయం 6 నుండి 9 గంటల వరకు) ధ్వజావరోహనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

స్నపన తిరుమంజనం సెప్టెంబర్ 16, 21 తేదీలలో (మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు) నిర్వహిస్తారు.

Latest News