మాజీ మంత్రిపై కోడిగుడ్లతో దాడి

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్‌పై నిరసనకారులు కోడిగుడ్లతో దాడి చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించి ఆయనను అరెస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీ నేతలపై వరుసగా కొనసాగుతున్న దాడులు రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.తాజాగా ఓ మాజీ మంత్రి ఇంట్లోకి చొరబడిన స్థానికులు ఆయనపై కోడిగుడ్లతో దాడి చేశారు.

కృష్ణనగర్‌లోని టీఎంసీ మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ నివాసంలోకి నిన్న స్థానికులు, నిరసనకారులు ఒక్కసారిగా చొరబడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ.. తీవ్ర ఆగ్రహంతో ఆయన ముఖంపై కోడిగుడ్లతో కొట్టారు. ఊహించని ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. పేదలకు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వ సామాగ్రిని అక్రమంగా నిల్వ ఉంచి దుర్వినియోగం చేశారని, పలు పథకాల అమలులో భాగంగా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపిస్తూ ఆయనపై దాడికి పాల్పడ్డారు.

మరోవైపు ఉజ్జల్ బిస్వాస్ పై దాడి ఘటన అనంతరం ..ఆయనపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలపై అధికార యంత్రాంగం కూడా వేగంగా కదిలింది.కోల్‌కతా పోలీసులు నిన్న అర్ధరాత్రి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి, అనంతరం ఆయన్ను అధికారికంగా అరెస్ట్ చేశారు.

Latest News