Vijay | 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో డీఎంకే పొత్తు..! టీవీకే చీఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు
Vijay | తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే అని విజయ్ పేర్కొన్నారు.

Vijay | చెన్నై : తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి వేసినట్లే అని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ కొంగు ప్రాంతంలో విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే డీఎంకే ప్రభుత్వం.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. అధికారం కోసం డీఎంకే ఎంతటికైనా తెగిస్తుందని మండిపడ్డారు. డీఎంకే అవకాశవాద రాజకీయాలకు తమిళనాడు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విజయ్ కోరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సీఎం స్టాలిన్ నెరవేర్చలేకపోయారని, దీంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఇక ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే నాయకులు కూడా దివంగత జయలలిత ఆదర్శాలను మరిచిపోయారని విజయ్ పేర్కొన్నారు. అన్నాడీఎంకే నేతలు కూడా పైకి అమ్మ పేరు జపిస్తూ.. లోపల భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకునేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. తమిళగ వెట్రి కళగం పార్టీ తమిళనాడు ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందని విజయ్ స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు, డీఎంకేకు మధ్య ఉంటుందని చెప్పారు.