పేపర్ లీకేజీలకు పాల్పడితే 10ఏళ్ల జైలు..రూ.10కోట్ల ఫైన్: కేంద్ర కేబినెట్

పేపర్ లీకేజీలపై కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిందితులకు 10 ఏళ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానాతో పాటు మూడు నెలల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు తీర్పు ఇవ్వనున్నాయి.

పేప‌ర్ లీక్‌ల‌కు పాల్ప‌డిన వ్య‌క్తుల‌కు ప‌దేళ్ల జైలుశిక్ష‌, ప‌ది కోట్ల జ‌రిమానా విధించేందుకు ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ యాక్టులో స‌వ‌ర‌ణ‌లు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పేప‌ర్ లీకేజీ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవ‌లం మూడు నెల‌ల్లో తీర్పును వెలువ‌రించాలని ఈ చట్టంలో పొందుపరుచనున్నారు. స‌వ‌ర‌ణ‌లు చేసిన బిల్లుకు కేబినేట్ ఆమోదం నేపథ్యంలో..అంతకుముందు ప్రధాని మోదీ ప్రకటించినట్లుగా ఆ బిల్లును సోమ‌వారం లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టనున్నారు.

శుక్రవారం ప్రధాని మోదీ వేదికగా కేంద్ర కేబినెట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కీలక భేటీ నిర్వహించింది. కేబినెట్ భేటీలో పేపర్ లీకేజీ కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పాటు జైలుశిక్ష‌, జ‌రిమానా విష‌యాల్లో కొత్త సవరణలు చేర్చాలని నిర్ణయించింది. గ‌తంలో పేప‌ర్ లీకేజీ కేసుల‌న్నీ ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ యాక్టు కింద ప‌రిష్క‌రించే వారు. అయితే ఇప్పుడు ఆ చ‌ట్టానికి స‌వ‌ర‌ణలు చేసి..వ్యవస్థికృత నేరాల నివారణ చట్టాల కింద చేర్చాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది.

ప్ర‌స్తుతం చ‌ట్టాల ప్ర‌కారం పేప‌ర్ లీకేజీ నిందితుల‌కు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష ఉన్న‌ది. ఒక‌వేళ దోషిగా తేలితే రూ.10లక్షల జ‌రిమానా కూడా విధించేవారు. నేరానికి చెందిన విష‌యాన్ని దాచిపెట్టే స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు రూ. కోటి జ‌రిమానా విధిస్తున్నారు. ఒక‌వేళ వ్య‌వ‌స్థీకృత నేరానికి పాల్ప‌డితే, అప్పుడు నిందితుల‌కు 5 నుంచి 10 ఏళ్ల జైలుశిక్ష ప‌డ‌నున్న‌ది. కోటి జ‌రిమానా విధించడం ఉంది.

సవరణ ప్రతిపాదనల మేరకు కొత్త‌గా రూపొందించ‌నున్న చ‌ట్టాల ప్ర‌కారం పేపర్ లీకేజీ కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కేవ‌లం మూడు నెల‌ల్లో త‌మ తీర్పును వెలువ‌రించాల్సి ఉంటుంది. పేప‌ర్ లీకేజీల‌కు పాల్ప‌డితే 10ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష విధిస్తారు. అలాగే నిందితుల‌కు రూ.10 కోట్ల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు. గ‌డిచిన ప‌దేళ్ల‌లో దేశ‌వ్యాప్తంగా సుమారు 150 పేప‌ర్లు లీకేజీ అయిన‌ నేపథ్యంలో పేపర్ల లీకేజీల నివారణకు కేంద్రం కఠిన చట్టం తేనుండటం ఆసక్తికరంగా మారింది.

Latest News