Nitin Gadkari on Roads | రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయా.. ఇక డైరెక్ట్‌గా కాంట్రాక్టర్‌కే ఫోన్ చేయొచ్చు!
మీరు ప్రయాణించే రోడ్లు అధ్వాన్నంగా ఉంటే ప్రభుత్వాన్ని తిట్టుకోవద్దని, ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్, పర్యవేక్షించిన కార్యదర్శి, ఇంజినీర్‌లకు ఫోన్ చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఈ విషయంలో తామెందుకు బద్నాం కావాలన్న గడ్కరీ.. రోడ్డు నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్, ఇంజినీర్, కార్యదర్శి పేర్లు, నంబర్లను బోర్డుపై ప్రదర్శిస్తామని తెలిపారు.
- రోడ్లు బాలేకపోతే మేమెందుకు బద్నాం కావాలి?
- ఇక నుంచి కాంట్రాక్టర్, సెక్రటరీ, ఇంజినీర్ల పేర్లు, నంబర్లతో బోర్డులు
- కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
Nitin Gadkari దేశంలో రోడ్ల ఆధ్వాన్న నిర్వహణపై సోషల్ మీడియాలో పెద్ధ ఎత్తున దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ల నాణ్యత విషయంలో తామెందుకు బద్నాం కావాలని ప్రశ్నించారు. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్, పర్యవేక్షించిన సెక్రటరీ, ఇంజినీర్లకు బాధ్యత లేదా అని నిలదీశారు. రోడ్ల నిర్మాణం, నిర్వహణలో వాళ్లకూ బాధ్యత, భాగస్వామ్యం ఉందన్నారు. ఇక నుంచి నిర్మాణం చేసే అన్ని రోడ్లపై కాంట్రాక్టర్, సెక్రెటరీ, ఇంజినీర్ల పేర్లు, మొబైల్ నెంబర్లు తప్పకుండా ప్రదర్శిస్తామని ఆయన ప్రకటించారు. స్మార్ట్ రోడ్ల భవిష్యత్తు, భద్రత, స్థిరత్వంపై జరిగిన సమావేశంలో నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రోడ్ల కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు నాణ్యతతో నిర్మాణం చేయాలని గడ్కరీ అన్నారు. వాళ్లు నాణ్యత లేకుండా నిర్మిస్తే మంత్రులుగా తామెందుకు బద్నాం కావాలని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో మీడియా కూడా తమ ఫొటోలను ప్రదర్శించి బాధ్యులను చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్, ప్రభుత్వ సెక్రెటరీ ఫొటోలు ఎందుకు ప్రచురించడం లేదన్నారు. ఇక నుంచి రోడ్ల పై నిర్మాణం చేసే కాంట్రాక్టర్ లేదా ఏజెన్సీ పేరు, ప్రభుత్వ కార్యదర్శి పేరు, పర్యవేక్షణ చేస్తున్న ఇంజినీరు పేరుతో పాటు మొబైల్ నెంబర్ తో బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా చేయడం మూలంగా నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్లక్ష్యంగా ఎవరు రోడ్లు నిర్మిస్తున్నారో ప్రజలకు తెలిసిపోతుందన్నారు. రోడ్ల నిర్వహణలో విఫలమైతే ప్రజలే నేరుగా వారికి ఫోన్ చేసి ప్రశ్నిస్తారన్నారు.
ప్రజలు కేంద్రంగా మౌలిక సదుపాయాల కల్పన జరగాలని, సౌకర్యవంతంగా ఉండాలని గడ్కరీ సూచించారు. 2027 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్ణయించారన్నారు. దేశంలో రోడ్డు, రవాణా రంగం ఆర్థిక వృద్ధిలో, పెట్టుబడులు, ఉపాధి కల్పనలో ముందున్నదన్నారు. ప్రస్తుత జాతీయ రహదారుల ద్వారా ప్రతి ఏడాది రూ. 55 వేల కోట్ల ఆదాయం సమకూరుతుండగా, వచ్చే రెండేళ్లో రూ.1.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. రానున్న రెండేళ్లలో 80 లక్షల టన్నుల వ్యర్థ ప్లాస్టిక్ ను రోడ్డు నిర్మాణంలో వినియోగించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. శుద్ది చేసిన నీటిని రోడ్లపై నాటిన మొక్కలు, చెట్లకు వినియోగిస్తామన్నారు.
ప్రధాన పోర్టులు, జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ, ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల పొడవునా ఉన్న రెండు లేన్ల జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా మార్చేందుకు రూ.2 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దీని వల్ల పర్యాటక, ఆధ్యాత్మిక టూరిజం, స్పోర్ట్స్ అడ్వెంచర్స్ పెరుగుతుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో వెచ్చించే ప్రతి రూపాయితో మూడు రూపాయల ఆదాయం వస్తుందన్నారు. దేశంలో జరిగే గూడ్స్ రవాణాలో జాతీయ రహదారుల వాటా 80 శాతం, విమానయానంలో ఒక శాతం, ఇతరత్రా లాజిస్టిక్స్ ద్వారా 18 శాతం ఉందన్నారు. రోడ్డు నెట్ వర్క్ ను పెంచడంతో లాజిస్టిక్స్, ఇంధన వ్యయం తగ్గుతుందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram