Minister Komatireddy | విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలు సాధనకు ప్రయత్నాలు
విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలు సాధనకు కేంద్రం వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాల్సివుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

తెలంగాణ భవన్ నిర్మాణానికి త్వరలో టెండర్లు
ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
విధాత, హైదరాబాద్ : విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలు సాధనకు కేంద్రం వద్ద అవసరమైన చర్యలు తీసుకోవాల్సివుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని గుర్తు చేశారు. తాను మంత్రిగా ఛార్జ్ తీసుకున్న మూడో రోజే నేను తెలంగాణా భవన్‌ను పరిశీలించానని తెలిపారు. ఢిల్లీ లోని ఆంధ్ర భవన్ విభజన పై స్పష్టత వచ్చిందని, హైదరాబాద్ హౌజ్ పక్కన తెలంగాణ భవన్ నిర్మాణం జరగనుందని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని మోడల్స్ పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఫైనల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. రెండు నెలల్లో డిల్లీలో తెలంగాణ భవన్ కు టెండర్లు పిలుస్తామని, ఢిల్లీలో భవన నిర్మాణాల అనుమతులకు కొంత సమయం పడుతుందన్నారు. త్వరగా అనుమతులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు.
హైదరాబాద్- విజయవాడ ఎన్‌హెచ్-65 రోడ్డు నిర్మాణ పనులను ఆరు లేన్లుగా నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం బీవోటీ కన్సెషనరీ జీఎంఆర్ సంస్థ వివాదం పరిష్కారం కోసం ఎదురుచూడకుండా వాహనాల రద్దీతో నెలకొంటున్న ప్రమాదాలతో చనిపోతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు ఆరులైన్ల నిర్మాణ చేపట్టాలని కోరామన్నారు. అలాగే ఎన్‌హెచ్-163 (హైదరాబాద్- మన్నెగూడ) రోడ్డుకు ఉన్న ఎన్‌జీటీ సంబంధిత సమస్యకు సత్వర పరిష్కారాన్ని కనుగొనాలని కోరారు. ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్న నాలుగు లేన్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అధిక వాహన రద్దీ మూలంగా.. తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్న ఎన్‌హెచ్-765 (హైదరాబాద్- కల్వకుర్తి) రోడ్డును నాలుగు లేన్లుగా నిర్మించేందుకు కావాల్సిన డీపీఆర్ తయారీ ప్రక్రియని వేగవంతం చేయాలని సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్‌ను కోరామని తెలిపారు.