Vinesh Phogat । ప్రధాని ఫోన్ చేస్తే మాట్లాడేందుకు నిరాకరించా.. ఎందుకంటే.. : వినేశ్ ఫొగట్ కీలక వ్యాఖ్యలు
‘ఫోన్ చేస్తే రెండేళ్ల క్రితం సంగతులు వినేశ్ మాట్లాడుతుందేమోనని ఆయన అనుకుని ఉంటారు. అందుకే నా వైపు నుంచి కాకుండా.. అటు నుంచి ఫోన్ వచ్చేలా.. దానిని వాళ్లు ఎడిట్ చేసుకునేలా కండిషన్లు పెట్టారేమో’ అని ఫొగట్ వ్యాఖ్యానించారు.

Vinesh Phogat । పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతవేటుకు గురైన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ తనతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారని వినేశ్ ఫొగట్ తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ ఉదంతం అనంతరం ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన విషయం తెలిసిందే. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గతంలో వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర రెజ్లర్లు నాటి రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌పై పెద్ద పోరాటమే చేశారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు గాను ఆయనపై కేసు పెట్టాలని రోడ్డెక్కారు. ఆ సమయంలో మోదీ వీరికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన భావోద్వేగాలను రాజకీయ ఉద్దేశాల కోసం వాడుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకే మోదీతో ఫోన్‌లో మాట్లాడేందుకు నిరాకరించానని ఫొగట్ తెలిపారు. ‘(పీఎం నుంచి) కాల్ వచ్చింది కానీ మాట్లాడేందుకు నేను నిరాకరించాను. ఫోన్ నాకు నేరు రాలేదు. కానీ.. అక్కడున్న భారతదేశ అధికారులు నాతో ఆయన (ప్రధాని మోదీ) మాట్లాడాలని అనుకుంటున్నట్టు తెలిపారు. నేను సిద్ధపడ్డాను. కానీ.. వాళ్లు కొన్ని షరతులు పెట్టారు. నా టీమ్‌లోని ఎవరూ అక్కడ ఉండకూడదట.. ఇద్దరు వ్యక్తులు ఈ సంభాషణను సోషల్‌మీడియాలో రికార్డు చేస్తారట’ అని వినేశ్ ఫొగట్ లలన్‌టాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నా భావోద్వేగాలను, నా కృషిని సోషల్ మీడియాలో హాస్యాస్పదం చేయదల్చుకోలేదు’ అని ఫొగట్ తెలిపారు. ఈ సంభాషనను ప్రచారానికి వాడుకునే షరతు లేకుండా ప్రధాని నుంచి కాల్ వచ్చి ఉంటే తాను సంతోషించేదాన్నని చెప్పారు. నిజంగానే ఆయనకు క్రీడాకారులంటే శ్రద్ధ ఉంటే.. రికార్డింగ్ లేకుండా ఆయన ఫోన్ చేయాల్సింది. ఆయనకు కృతజ్ఞురాలినై ఉండేదాన్ని. ప్రధాని కార్యాలయమే ఈ షరతులు పెట్టి ఉంటుందని భావిస్తున్నా’ అని తెలిపారు. ‘ఫోన్ చేస్తే రెండేళ్ల క్రితం సంగతులు వినేశ్ మాట్లాడుతుందేమోనని ఆయన అనుకుని ఉంటారు. అందుకే నా వైపు నుంచి కాకుండా.. అటు నుంచి ఫోన్ వచ్చేలా.. దానిని వాళ్లు ఎడిట్ చేసుకునేలా కండిషన్లు పెట్టారేమో’ అని ఫొగట్ వ్యాఖ్యానించారు. ‘నా నుంచి కాల్ వెళితే నేను ఆ ఒరిజినల్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేదాన్ని. అందుకే వారు నిరాకరించారు’ అని చెప్పింది.