సర్ దెబ్బకు 57వేల మంది లబ్ధిదారులు ఔట్..పశ్చిమ బెంగాల్ సర్కార్ నిర్ణయం

ఎస్‌ఐఆర్-2025 ఓటరు జాబితా ఆధారంగా పశ్చిమ బెంగాల్‌లో ఆవాస్ యోజన నుంచి 57 వేల మంది లబ్ధిదారులను తొలగించారు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపును కూడా ప్రభుత్వం ప్రకటించింది.

ఆధార్ మాదిరి ఓటరు కార్డు ను పథకాల మంజూరీ కోసం వినియోగించడం రాష్ట్ర ప్రభుత్వాలు మొదలు పెట్టాయి. గతంలో ఆధార్ ను ఎలా ఉపయోగించుకుని ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేశారు. బీజేపీ ఏలుబడిలో దేశంలో కొన్ని రాష్ట్రాలు సర్ ను తమకు నచ్చిన విధంగా వినియోగించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆవాస్ యోజన (పక్కా గృహ నిర్మాణ పథకం) లో ఒక వేయి కాదు రెండు వేలు కాదు ఏకంగా 57వేల మంది లబ్ధిదారుల పేర్లను తీసివేశారు. సర్ -2025 ఆధారంగా ఇంత భారీ సంఖ్యలో పేర్లను తొలగించామని పశ్చిమ బెంగాల్ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దిలీప్ ఘోష్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్తంగా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల్లో పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ చివరి విడత కింద పలు రాష్ట్రాలలో సర్ నిర్వహిస్తున్నది. పశ్చి బెంగాల్ 2025 సంవత్సరంలో సర్ నిర్వహించి బోగస్, చనిపోయిన వారు, నివాసం మారిన వారు, ఒకటికి మించి ఓటు హక్కు కలిగి ఉన్న వారి పేర్లను సుమారు 90 లక్షల వరకు తొలగించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సర్ – 2025 ను వినియోగించుకుంటున్నది. ఈ ఓటరు జాబితా ఆధారంగా పక్కా గృహ నిర్మాణ పథకంలో 57వేల మంది లబ్ధిదారుల పేర్లను తొలగించారు. పథకం కింద ఎంపికైన వారి పేర్లు సర్ లో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొలకతా లోని రాష్ట్ర సచివాలయంలో ఈ పథకం కింద ముఖ్యమంత్రి సువేంధు అధికారి 10 లక్షల 20వేల మంది లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేశారని ఘోష్ వెల్లడించారు. బంధుప్రీతి, అవినీతి కి పాల్పడి 2022 లో అప్పటి ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో ప్రధాన మంత్రి అవాస యోజన కింద అనర్హులను ఎంపిక చేశారన్నారు. దీంతో కేంద్రానికి పలు ఫిర్యాదులు వెల్లడంతో నిధులు మంజూరు నిలిపివేసిందన్నారు. దీంతో అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వం సొంతంగా బంగ్లార్ బారీ పథకం 2024 సంవత్సరంలో ప్రారంభించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సర్వే నిర్వహించి బోగస్ లబ్ధిదారులను ఏరివేశామన్నారు. తాజాగా ఒక కోటి 20వేల మంది లబ్ధిదారులకు రెండో విడత కింద ఒక్కొక్కరికి రూ.60వేల చొప్పున విడుదల చేశామన్నారు. బోగస్ లబ్ధిదారులను ఏరివేసేందుకు వడపోత కార్యక్రమం జరుగుతోందని, బంగ్లార్ బారీ పథకం పేరును బంగా అవాస్ యోజనగా మార్పు చేశామని దిలీప్ ఘోష్ వెల్లడించారు. బెంగాల్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి సువేంధు అధికారి సర్ -2024 ఓటర్ల జాబితా ఆధారంగా సంక్షేమ, నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆధార్ బదులు సర్ జాబితాను ఆధారంగా మార్చుకున్నారు. ఇదే తరహాలో మహారాష్ట్ర, బిహార్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు సర్ ను ఆధారంగా చేసుకుని సంక్షేమ, నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి.

సర్కార్ ఉద్యోగులకు డీఏ పెంపు

బెంగాల్ లో దుర్గా పూజ ను ఘనంగా నిర్వహిస్తారు. దుర్గా పూజ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ (కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆరవ వేతన సవరణ సంఘం సిఫారసు మేరకు మూల వేతనం (బేసిక్ పే) పై 38 శాతం డీఏ పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి పెరిగిన డీఏ అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం మూలంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, పంచాయతీ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, కార్పొరేషన్, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఏయిడెడ్ ఉద్యోగులకు డీఏ పెరగనున్నది. కనీస వేతనాల చట్టం కింద దినసరి వేతనంపై పనిచేసే వారికి ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తంపై అదనంగా ప్రతిరోజు రూ.110 పెంచుతూ అక్టోబర్ 1వ తేదీ నుంచి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రంలో అమలు చేస్తున్న డీఏ, రాష్ట్రంలో అమలు చేస్తున్న డీఏ కు మధ్య 42 శాతం వ్యత్యాసం ఉందని, దశల వారీగా వ్యత్యాసాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తామని బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇటీవల ఒక సమావేశంలో వెల్లడించిన విషయం విధితమే. ఏడవ వేతన సంఘం సిఫారసులను ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలు, భత్యాలపై, సర్వీసు సమస్యలు, పెన్షనర్ల సమస్యలపై సంఘం అధ్యయనం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఏడవ వేతన సంఘం సిఫారసులను 2027 సంవత్సరంలో అమలు చేస్తామని సువేంధు అధికారి పేర్కొన్నారు.

Latest News