punishment for rapists । విత్తు కొట్టడమే లైంగిక నేరస్థులకు అసలైన శిక్ష అవుతుందా? ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా?

లైంగిక నేరాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు విధించాలన్న చర్చ ఈనాటిది కాదు. కఠిన శిక్షలు అమలు చేయాలనేవారు కొందరైతే.. మొత్తంగా సమాజంలో మార్పు కోసం కృషి చేయాలని కొందరు వాదిస్తున్నారు. కఠిన శిక్షలను అమలు చేస్తూనే సమాజ మార్పుకు ప్రయత్నించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

punishment for rapists । విత్తు కొట్టడమే లైంగిక నేరస్థులకు అసలైన శిక్ష అవుతుందా? ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా?

punishment for rapists । అర్ధరాత్రి ఒంటరిగా మహిళ నడిచొచ్చినప్పుడే అసలైన స్వాతంత్ర్యమని మహాత్మా గాంధీ చెప్పాడు. సంపూర్ణ స్వేచ్ఛను మహిళలు పొందినప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమని రష్యా నిర్మాత లెనిన్‌ అన్నాడు. రోడ్లపైనే కాదు.. నలుగురూ ఉండే ప్రాంగణాల్లోనే మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల సంగతి పక్కనపెడితే.. స్కూళ్లకు వెళ్లే చిన్నారులు సైతం కామాంధుల చేతిలో ఛిద్రమైపోతున్నారు. రోజు రోజుకు దేశంలో మహిళల పట్ల ఘోరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. దిశ (disha), నిర్భయ (nirbhaya) అంటూ పేర్లు పెట్టుకుంటూ పోతూనే ఉన్నం.. వారిని చిదిమేసిన కర్కోటకులు ఘటనాస్థలాల్లో లేదా మరో చోట పోలీసులకు ఎదురుతిరిగి ఎన్‌కౌంటర్‌ (encounter) అయిపోతూనే ఉన్నారు. వారి చర్యలను సమర్థించేలా జనాలు వారికి జేజేలు పలుకుతూ పూల వర్షాలు కురిపిస్తూనే ఉన్నారు. కానీ.. ఈ దారుణకాండకు అంతూ పొంతూ లేకుండానే పోతున్నది. తెల్లారే మరో చోట.. మరో యువతి బలైపోతున్నది. ఘటన జరిగినప్పుడు వెల్లువెత్తే ఆగ్రహావేశాలు.. కొన్ని రోజులకు సద్దుమణిగిపోతున్నాయి. ఘోరం చోటు చేసుకోగానే గంభీర వచనాలు పలికే పాలకులూ కొన్నాళ్లకు యథాలాపంగా తమ ‘విధి’ నిర్వహణలో నిమగ్నమైపోతున్నారు. అదే సమయంలో టీవీ చానళ్లలో చర్చల్లో అసలు ఇలాంటి కర్కోటకులకు ఎలాంటి శిక్షలు విధిస్తే ఈ తరహా ఘోరాలు ఆగిపోతాయో కొందరు నాయకులు ఆవేశంగా వాదిస్తూ ఉంటారు. ఏకంగా ఎన్‌కౌంటర్‌ చేసి పారేస్తేనే దిక్కులేదు.. ఇంకే శిక్ష విధించినా ఏం లాభమని ప్రశ్నించేవారూ ఉన్నారు. మార్పు రావాల్సిందీ మార్పు తేవాల్సింది వ్యక్తుల్లో కాదని.. మొత్తంగా ఆరోగ్యకరమైన సమాజం ఉద్భవిస్తేనే మహిళలపైనే కాదు.. ఎవరిపైనైనా అఘాయిత్యాలు, అన్యాయాలు ఆగుతాయని వాదించే ప్రగతిశీల శక్తులూ (progressive) ఉన్నాయి. మహిళల పట్ల గౌరవం కలిగిన సమాజం ఏర్పడేలోపు.. ఇటువంటి ఘోరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాల్సిందేననడంలో (stronger measures) సందేహమే లేదు. ఈ విషయంలో ఇంటర్నెట్‌లో, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తునే చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలోనే లైంగిక నేరాలకు పాల్పడే వారిని నపుంసకులుగా (castration) మార్చాలన్న ఒక బలమైన వాదన కూడా వినిపిస్తున్నది. బయటికి వెళ్లే ఆడబిడ్డలకు జాగ్రత్తలు చెప్పే తల్లిదండ్రులు.. తమ కొడుకులకు కూడా అవే జాగ్రత్తలు చెప్పాలని, బాలికలకు బ్యాడ్‌ టచ్‌, గుడ్‌ టచ్‌ (good touch, bad touch) గురించి చెప్పే వారు.. బాలురకు కూడా అదే బోధించాలని, బాలికలను గౌరవించే సంస్కృతిని అలవాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. కోల్‌కతా మెడికోపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్‌ రాయ్‌ సోదరి.. తాను చాలా కాలంగా తన కుటుంబంతో సంబంధాల్లో లేనని, కనుక సంజయ్‌ ‘ఎలాంటి పరిస్థితుల మధ్య పెరిగాడో’ తనకు తెలియదని చెప్పడం చూస్తే.. పెంపకం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతూనే ఉన్నది.

సమాజం తనను తాను నియంత్రించుకోలేని (society regulate) పక్షంలో మహిళల రక్షణకు బలమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని రేడియో జాకీ, నటి మాలిష్క అన్నారు. వాటితో పరిస్థితులు మారితే సరే.. లేదంటూ ఆ చట్టాలను అనుసరించి కఠిన శిక్షలు విధించాలని చెప్పారు. విత్తు కొట్టడం / నపుంసకులుగా మార్చడం అనే అంశంపై మాట్లాడుతూ.. భయానకమైన నేరాలకు (heinous crimes) పాల్పడినవారికి ఇది చాలా స్వల్ప శిక్ష అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ‘నేను మానవత్వం, దయ కలిగి ఉండాలని భావిస్తాను. అదే సమయంలో నేరానికి తగిన శిక్ష తప్పకుండా ఉండాలి. ఒక మహిళ శరీరాన్ని, ఆత్మను విధ్వంసం చేసి నేరంతో పోల్చితే నపుంసకుడిగా మార్చడం అనేది చాలా తక్కువ శిక్ష’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

నందిని మండల్‌ అనే 22 ఏళ్ల యువతి.. లైంగిక నేరాలకు పాల్పడినవారి నపుంసకుడిగా మార్చడానికి పూర్తి మద్దతు ప్రకటించారు. తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడంతోనే కర్కోటకులు ఎలాంటి భయం లేకుండా చెలరేగిపోతున్నారని ఆమె అన్నారు. అందుకు ‘రేప్‌ కేసులలో నేరస్తులను నపుంసకులుగా మార్చాలి’ అని ఆమె నొక్కి చెప్పారు. ఇటువంటి శిక్షలను చూస్తే మరొకరు ఇటువంటి ఘాతుకాలకు పాల్పడేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారని ఆమె అన్నారు.

రితికా భౌమిక్‌ అనే ఎంబీఏ విద్యార్థిని కూడా విత్తు కొట్టడమే తగిన శిక్ష అని అభిప్రాయపడ్డారు. ఇటువంటి నేరస్తులకు మరణ శిక్ష అనేది సరిపోదని అన్నారు. బాధితుల పట్ల వ్యవహరించినట్టే నిందితుడి పట్ల కూడా వ్యవహరించాలని చెప్పారు. నేరస్థుడు ఒకేసారి చావడం కంటే.. భయంతో జీవితాంతం బతకాలని (fear of being alive in that pain) అన్నారు. నేరం చేయాలనుకునేవారు ఇటువంటి వారిని చూసి భయపడతారని ఆమె పేర్కొన్నారు.

ఇటువంటి నేరాలకు మూల కారణాలను (root cause of the problem) అన్వేషించాలనేవారూ ఉన్నారు. నపుంసకుడిగా మార్చడం అనేది గట్టి చర్యే అయినప్పటికీ.. అది రోగానికి చికిత్సగా కాకుండా రోగ లక్షణానికి (symptom) మాత్రమే చికిత్స అవుతుందని కంటెంట్‌ క్రియేటర్‌, సామాజిక కార్యకర్త జో సిన్హా అభిప్రాయపడ్డారు. మూల కారణాన్ని పరిష్కరించడంలో, శాశ్వత మార్పును తీసుకురావడంలో మనం జీవిస్తున్న పితృస్వామిక వ్యవస్థ (patriarchal society) కీలకమని ఆయన అన్నారు. శతాబ్దాలుగా మహిళలు పురాణాల (religious texts) ఆధారంగానే నడిపిస్తున్నారని, క్రమక్రమంగా ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని చెప్పారు. ‘అనేక పరిష్కారాలు ప్రతిపాదించినా ఏవీ మహిళలపై హింసను తగ్గించలేక పోతున్నాయి. విత్తు కొట్టడాన్ని కొందరు అసలైన పరిష్కారం అని భావించవచ్చు. కొందరు దీనిని అనైతికం అంటారు. ఆచరణలో సాధ్యం కానిదని వాదిస్తారు. అంతిమంగా సమస్య మూలం మనలో పాతుకుపోయిన పితృస్వామిక వ్యవస్థలో ఉన్నది. ఇది మారినప్పుడే మన మహిళలను మనం రక్షించుకోగలం. సురక్షిత సమాజాన్ని (safer society) స్థాపించుకోగలం’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

సమాజంలో అసమానతలు (societal inequality), పురుషాధిపత్యంపై నమ్మకాల వల్లే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయని కంటెంట్‌ ఎనలిస్ట్‌ దివ్యారాయ్‌ అన్నారు. పురుషుల్లానే మహిళలు కూడా సమానమేనని (women are equal), వాళ్లను మనం నియంత్రించజాలమని వాళ్లు ఆలోచించిన రోజు ఇటువంటి నేరాలు తగ్గుముఖం పడతాయి’ అని ఆమె చెప్పారు.

మొత్తంగా రెండు కోణాల్లో ఈ చర్చలు నడుస్తున్నాయి. ఒకటి.. భవిష్యత్తులో నేరాలు తగ్గించడానికి కఠిన శిక్షలు అమలు చేయడమా? లేక దీర్ఘకాలంలో సమాజంలో రావాల్సిన మార్పులకోసం ప్రయత్నించడమా? రెండు వాదనలూ నిజమేనని విశ్లేషకులు అంటున్నారు. అన్యాయాలు జరిగినప్పుడు వాటికి పాల్పడినవారికి కఠిన శిక్షలు పడేలా చూస్తూనే.. మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా సంచరించే సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కృషి సమాంతరంగా సాగుతూనే ఉండాలని సూచిస్తున్నారు.