Justice Sanjiv Khanna | నవంబర్ 11న నూతన సీజేఐ ప్రమాణం.. ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..?
Justice Sanjiv Khanna | సుప్రీంకోర్టు( Supreme Court ) 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా( Justice Sanjiv Khanna ) నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అధికారికంగా గురువారం ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Justice Sanjiv Khanna | న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు( Supreme Court ) 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా( Justice Sanjiv Khanna ) నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ అధికారికంగా గురువారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్( DY Chandrachud ) పదవీకాలం నవంబర్ 10వ తేదీన ముగియనుంది. ఈ క్రమంలో తన తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును చంద్రచూడ్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము( Droupadi Murmu ) ఆమోద ముద్ర వేశారు. దీంతో నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11వ తేదీన ప్రమాణం చేయనున్నారు. 2025, మే 13వ తేదీ వరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు.
ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..?( Who is Justice Sanjiv Khanna )
1960 మే 14న ఢిల్లీ( Delhi )లో జన్మించారు. ఢిల్లీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన జస్టిస్ ఖన్నా.. దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సమీప బంధువు. ఢిల్లీ యూనివర్సిటీ( Delhi University )లో న్యాయవిద్యను అభ్యసించారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో కీలక భూమిక వహించారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా 1983లో నమోదు చేయించుకున్నారు. తీస్ హజారీ కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2004లో ఇన్‌కమ్ టాక్స్ శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో ఎమికస్ క్యూరీగా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలు కొనసాగించారు. ఆ తరువాత 2005లో ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియుక్తులయ్యారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ ఛైర్మన్‌గా, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇన్‌ఛార్జిగా కొనసాగారు.
2019 జనవరి 18వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించకుండానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఎలక్టోరల్ బాండ్స్, ఆర్టికల్ 370 తొలగింపు, ఈవీఎంల వినియోగానికి సమర్థన వంటి తీర్పులను ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు. ప్రస్తుతం జాతీయ న్యాయ సేవల సంస్థ(నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.