అంద‌మైన గాజులు వేసుకుంద‌ని.. భార్య‌ను బెల్ట్‌తో చిత‌క‌బాదిన భ‌ర్త‌

మహిళలు ఎక్కువగా ఇష్టపడే ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి. గాజులు వేసుకోవడం వలన మ‌హిళ‌ల చేతికి అందం పెరగడమే కాదు, ఎన్నో మంచి ఫలితాలను కూడా ఇస్తుంది

అంద‌మైన గాజులు వేసుకుంద‌ని.. భార్య‌ను బెల్ట్‌తో చిత‌క‌బాదిన భ‌ర్త‌

విధాత: మహిళలు ఎక్కువగా ఇష్టపడే ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి. గాజులు వేసుకోవడం వలన మ‌హిళ‌ల చేతికి అందం పెరగడమే కాదు, ఎన్నో మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ముత్తైదువకు ఉండే ఐదు లక్షణాలలో గాజులు ఒకటిగా పేర్కొంటారు. అందుకే పెళ్లైన ప్రతి ఒక్క స్త్రీ తన రెండు చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు.


ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదటగా వేసే ఆభరణం గాజులే. ఈ క్ర‌మంలో రంగురంగుల, ఫ్యాష‌న‌బుల్ గాజులు ధ‌రించేందుకు మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డుతుంటారు. అలా త‌న‌కు ఇష్ట‌మైన ఫ్యాష‌న‌బుల్ గాజుల‌ను ధ‌రించిన ఓ వివాహిత‌ను త‌న భ‌ర్త చిత‌క‌బాదాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని న‌వీ ముంబైలో వెలుగు చూసింది.


వివ‌రాల్లోకి వెళ్తే.. న‌వీ ముంబైలోని దిఘా ఏరియాలో ప్ర‌దీప్ అర్క‌డే(30) త‌న భార్య‌, త‌ల్లితో క‌లిసి ఉంటున్నాడు. అయితే 23 ఏండ్ల వ‌య‌సున్న భార్య.. న‌వంబ‌ర్ 13వ తేదీన త‌న‌కు ఇష్ట‌మైన రంగురంగుల గాజుల‌ను ధ‌రించింది. ఫ్యాష‌న‌బుల్ గాజులు ఎందుకు వేసుకున్నావ‌ని భ‌ర్త ఆమెతో వాగ్వాదానికి దిగాడు.


ఆగ్ర‌హాంతో ఊగిపోయిన భ‌ర్త‌.. త‌న భార్య‌ను బెల్ట్‌తో తీవ్రంగా చిత‌క‌బాదాడు. అత్త కూడా కోడ‌లిపై త‌న ప్ర‌తాపం చూపింది. జుట్టు ప‌ట్టి బ‌య‌ట‌కు ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టింది. మ‌రో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా బాధితురాలిని నేల‌పై ప‌డేసి దాడి చేశారు.


దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాధితురాలు, ఆమె త‌ల్లిదండ్రులు క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. త‌న‌పై దాడి చేసిన భ‌ర్త‌, అత్త‌, మ‌రో ఇద్ద‌రి మ‌హిళ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధితురాలు పోలీసుల‌ను కోరింది.