ఏటా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్నిఆగస్టు 12న నిర్వహిస్తున్నారు. ఏనుగుల సంరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, అక్రమ వేటను అరికట్టడం, మానవ-ఏనుగు సంఘర్షణలను తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఏనుగుల దినోత్సం ప్రధాన ఉద్దేశం. ఏనుగులు లేని ప్రకృతిని, అడవులను ఊహించుకోలేం. ప్రకృతి పరిరక్షణ..పర్యావరణ సమతుల్యతలో ఏనుగులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి.
ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని 2012లో కెనడియన్ చిత్రనిర్మాతలు పాట్రిసియా సిమ్స్, మైఖేల్ క్లార్క్, థాయ్‌లాండ్‌కు చెందిన ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్‌తో కలిసి ప్రారంభించారు. ఆగస్టు 12న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ముఖ్యంగా ఆసియా ఏనుగుల సంరక్షణపై ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో దీనిని రూపొందించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజు ఏనుగుల గురించి అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వన్యప్రాణుల్లో అతి తెలివైన జంతువు ఏనుగు
ఏనుగులు ప్రపంచంలోని అతిపెద్ద భూ క్షీరదాల్లో ఒకటి. ఇవి తెలివైన, సామాజిక జీవులు. కుటుంబ సభ్యులతో కలిసి గుంపులుగా జీవించడం, ఒకదానితో ఒకటి వివిధ రకాల శబ్దాలు, శరీర కదలికల ద్వారా సంభాషించుకోవడం వంటి ప్రత్యేక లక్షణాలు వీటికి ఉన్నాయి. ఏనుగులకు మంచి జ్ఞాపకశక్తి కూడా ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఏనుగులు 9 టన్నుల వరకు బరువు, దాదాపు 13 అడుగుల ఎత్తు ఉంటాయి. వాటికి పెద్ద చెవులు, నీరు తాగడానికి, వస్తువులను పట్టుకోవడానికి, వాసన చూడటానికి మరియు శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడే పొడవైన తొండం వాటికి జీవధారం. ఏనుగులు తమను తాము రక్షించుకోవడానికి, ఆహార సేకరణకు కూడా తమ తొండాన్ని, దంతాలను ఉపయోగిస్తాయి.
ఏనుగు విశేషాలు…
ఏనుగు తొండంలో సుమారు 150,000 కండరాలు ఉంటాయి.ఇవి శ్వాస తీసుకోవడానికి, నీరు తాగడానికి వాసన చూడటానికి వీలు కల్పిస్తాయి. ఏనుగు చర్మం సుమారు 2.5 సెం.మీ. మందంగా ఉంటుంది. వాటి చర్మంలోని ముడతలు నీటిని పట్టి ఉంచి, వాటిని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.సగటున, ఒక ఏనుగు రోజుకు గడ్డి, చెట్ల పొదలు, పండ్లు, ఆకులతో సహా సుమారు 300 పౌండ్ల ఆహారాన్ని తింటుంది. భూమి ద్వారా ప్రసరించే ప్రకంపనలను తమ ఎముకలలో అనుభూతి చెందడం ద్వారా ఏనుగులు సంభాషించగలవు. జ్ఞాపకశక్తికి బాధ్యత వహించే టెంపోరల్ లోబ్ మానవుని కంటే పెద్దదిగా ఉంటుంది, అంటే ఏనుగుకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది.
ప్రపంచంలోని ఏనుగుల రకాలు
ఏనుగులలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఇవి అఫ్రికా, అసియా దేశాలలో మాత్రం మనుగడ సాగిస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగులు రెండు రకాలు. అవి సవన్నా ఏనుగులు, ఆఫ్రికన్ అటవీ ఏనుగులు. మూడో రకం ఏనుగులు ఆసియా ఏనుగులు. ఆఫ్రికన్ ఏనుగులు సాధారణంగా పెద్దవిగా ఉంటాయి. అయితే ఆసియా ఏనుగులు కొద్దిగా చిన్నవిగా ఉండి, తక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ఆసియా మగ ఏనుగులకు మాత్రమే దంతాలు పెరుగుతాయి. అయితే ఆఫ్రికన్ మగ మరియు ఆడ ఏనుగులు రెండింటికీ దంతాలు పెరగగలవు. ఆసక్తికరంగా, ఆసియా ఏనుగుల తొండంపై ఒకే ‘వేలు’ ఉండగా, ఆఫ్రికన్ ఏనుగులకు రెండు ఉంటాయి.
బోట్వ్వానాలో ఏనుగుల జనాభా అధికం
ప్రపంచవ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో సుమారు 4.6 లక్షల నుంచి 4.7 లక్షల వరకు ఏనుగులు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఆఫ్రికన్ ఏనుగులు దాదాపు 4,15,000 ఉండగా, ఆసియా ఏనుగులు సుమారు 40,000 నుండి 50,000 వరకు మాత్రమే ఆసియా దేశాలలో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఏనుగుల జనాభా బోట్స్వానాలో ఉంది. ఈ దేశం 130,000కు పైగా ఏనుగులకు నిలయం, దీనితో ఇది ప్రపంచవ్యాప్తంగా ఏనుగుల జనాభాలో అగ్రగామి దేశంగా నిలిచింది. దాని విస్తారమైన సంరక్షిత ప్రాంతాలు, సంరక్షణ ప్రయత్నాలు ఏనుగుల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. బోట్స్వానాతో పాటు, జింబాబ్వే, టాంజానియా, కెన్యా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలలో కూడా ఏనుగుల జనాభా అధికంగా ఉంది. ఈ దేశాలలో విస్తారమైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు ఉండటంతో అధిక సంఖ్యలో ఏనుగులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి,
ఆసియా ఏనుగులు భారత్ లోనే అధికం
ఆసియాలోనే అత్యధిక ఏనుగుల జనాభా భారతదేశంలో ఉంది.ప్రస్తుతం 30,000కు పైగా ఆసియా ఏనుగులకు భారత్ నిలయంగా ఉంది. ఆసియా ఏనుగుల సంరక్షణకు భారత్ కీలకంగా కొనసాగుతుంది. భారతదేశంలో గడిచిన జంతుగణన మేరకు 22,446 అడవి ఏనుగులు ఉన్నాయి. అంటే ప్రపంచంలో మిగిలి ఉన్న ఆసియా అడవి ఏనుగులలో దాదాపు సగం భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశంలో పశ్చిమ కనుమలు ఏనుగులకు గొప్ప కంచుకోట. కర్ణాటక (6,013), అస్సాం (4,159), తమిళనాడు (3,136), కేరళ (2,785),ఉత్తరాఖండ్ (1,792) రాష్ట్రాలలో కలిపి 11,934 ఏనుగులు ఉన్నాయి. ఇది భారతదేశంలోని మొత్తం ఏనుగుల జనాభాలో 80శాతం కావడం గమనార్హం. కర్ణాటక, అస్సాంల తర్వాత దేశంలో అత్యధిక ఏనుగుల జనాభా కలిగిన రాష్ట్రాలలో తమిళనాడు మూడవ స్థానంలో ఉంది.
ఏనుగుల మనుగడకు కొత్త సవాళ్లు
అయితే ప్రస్తుతం ఏనుగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అడవుల నరికివేత, ఆవాసాల తగ్గుదల, వలస మార్గాల విచ్ఛిన్నం, అక్రమ వేట, ఏనుగు దంతాల అక్రమ వ్యాపారం ప్రధాన ముప్పులుగా ఉన్నాయి. అడవులు తగ్గిపోవడంతో ఏనుగులు ఆహారం, నీటి కోసం మానవ నివాస ప్రాంతాలకు రావాల్సి వస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో మానవ-ఏనుగు సంఘర్షణలు కూడా పెరుగుతున్నాయి.
ఆసియా ఏనుగు అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతోంది. భారతదేశంలో ఆసియా ఏనుగుల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ, వాటి ఆవాసాలు, సంప్రదాయ వలస మార్గాలను రక్షించడం ఎంతో అవసరం. ఏనుగుల సంరక్షణ కోసం అడవులను కాపాడటం, వన్యప్రాణి మార్గాలను రక్షించడం, అక్రమ వేటను అరికట్టడం, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు అవసరం. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 12, 13 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఏనుగుల సంరక్షణ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు భారీగా నిర్వహిస్తున్నాయి.
On #WorldElephantDay, we reaffirm India’s commitment to securing a shared future for elephants and people.
With 33 Elephant Reserves across 14 States, 150 scientifically validated elephant corridors, advanced population monitoring and stronger measures to mitigate human-elephant… pic.twitter.com/jIdd1PXHMH
— Bhupender Yadav (@byadavbjp) August 12, 2026
