ప్రపంచ సింహాల దినోత్సవం..నెహ్రూ జూలాజికల్ పార్క్ లో సందడి

ప్రపంచ సింహాల దినోత్సవం(ఆగస్టు 10) సందర్భంగా హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సింహాల జనాభా 23,000 వరకు ఉంటుందని అంచనా. భారత్ ఆసియా సింహాల సంఖ్య ఐదేళ్లలో 32.2% పెరిగి..891కి చేరినట్లుగా గుర్తించారు.

ప్రపంచ సింహాల దినోత్సవం(ఆగస్టు 10) సందర్భంగా హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జంతు సంరక్షకులు సింహాల రోజువారీ కార్యకలాపాలు, ప్రవర్తన, ఆహార పట్టిక, టీకాల షెడ్యూల్‌పై సందర్శకులకు అవగాహన కల్పించారు. ఆసియా, ఆఫ్రికా సింహాల సంరక్షణతో పాటు సంతానోత్పత్తి కార్యక్రమాలపై తీసుకుంటున్న చర్యలను జంతు సంరక్షకులు వివరించారు. జూ పార్కులో ఆసియా, ఆఫ్రికన్‌ సింహాలు ఉన్నాయని డిప్యూటి క్యూరేటర్‌ మురళీధర్‌ తెలిపారు.

ప్రపంచ సింహాల దినోత్సవాన్ని తొలిసారిగా 2013 లో ప్రారంభించారు. అడవికి రారాజుగా పిలిచే సింహాల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి ఆవాసాలను రక్షించడానికి, అంతరించిపోతున్న ఈ జాతిపై అవగాహన కల్పించడానికి ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోనూ జూపార్కులలో, అటవీ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందింది. 2020లో ఉన్న 674గా ఉన్న సింహాల జనాభా 2025 నాటికి 891కి చేరింది. ఆడ సింహాల సంఖ్య 330కి చేరుకున్నాయి. 2020లో ప్రకటించబడిన ప్రాజెక్ట్ లయన్ కారణంగా కేవలం ఐదేళ్లలో వీటి జనాభా 32.2% వృద్ధిని సాధించింది. ఈ సింహాలన్నీ గుజరాత్‌లోని గిర్ అడవులు, సౌరాష్ట్ర ప్రాంతంలోని వివిధ జిల్లాలలో నివసిస్తున్నాయి. జునాగఢ్, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, రాజ్‌కోట్, మోర్బి, సురేంద్రనగర్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, అమ్రేలి, పోర్ బందర్, బోటాడ్ జిల్లాల్లో ఈ సింహాలు మనుగడ సాగిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో ఉన్న సింహాల సంఖ్య సుమారు 20,000 నుంచి 23,000 వరకు ఉంటుందని అంచనా. వీటిలో అత్యధికంగా ఆఫ్రికా ఖండంలో సబ్-సహారా ప్రాంతంలో ఉండగా, సుమారు 14,500 సింహాలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాలో సుమారు 3,284 సింహాలు ఉన్నాయి.బోట్సవానాలో 3,063 సింహాలు, కెన్యాలో 2,515 సింహాలు, జాంబియాలో 2,349 సింహాలు ఉన్నట్లుగా గుర్తించారు. భారతదేశంలో కేవలం ఆసియా సింహాలు మాత్రమే ఉండటం గమనార్హం.

 

Latest News