Gaddar Awards | గద్దర్ అవార్డుల క్రేజ్.. 1248నామినేషన్లు !

విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కు సినీ రంగం నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం అవార్డుల ఎంపిక కోసం 1248నామినేషన్లు రావడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో అందించిన నంది అవార్డుల పంపిణీ రాష్ట్ర విభజన క్రమంలో నిలిచిపోయింది. 14 ఏండ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్ ను గద్దర్ పేరిట ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు రానంతగా గద్దర్ అవార్డుల కోసం నామినేషన్లు రావడం ఆసక్తికరం.
అవార్డులకు భారీగా వచ్చిన నామినేషన్లను సినీ నటి జయసుధ చైర్మన్ గా 15 మందితో ఏర్పాటైన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని స్క్రీనింగ్ చేయనుంది. గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేటగిరీ లకు కలిపి 1,248 నామినేషన్లు అందినట్లుగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎస్. హరీష్ లు వెల్లడించారు. ఈ నెల 21 వ తేదీ నుండి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.
వ్యక్తిగత కేటగిరిలో 1172, ఫీచర్ ఫిల్మ్, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో తెలుగు చలనచిత్ర రంగం ప్రతిష్ట పెంచేలా అవార్డుల ఎంపిక, పంపిణీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అవార్డుల ఎంపిక నిష్పక్షపాతంగా జరిగేలా జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు.