Hyderabad: అతి కిరాతకం, వికృతం.. వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సులు!

  • By: sr    news    Apr 15, 2025 1:43 PM IST
Hyderabad: అతి కిరాతకం, వికృతం.. వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సులు!

విధాత: మాయమవుతున్నడమ్మా.. మనిషన్న వాడు అన్న మాటలకు ఇటీవల జరుగుతున్న నేరాలు..ఘోరాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రేమికుడి కోసం భర్తలను, పిల్లలను చంపుతున్న మహిళలు..ప్రియరాలి కోసం భార్యను చంపుతున్న భర్తలు..పరువు హత్యలు..ఆస్తుల కోసం హత్యలు..చిన్నారుల హత్యలు వంటివన్ని మనిషిలో పెరుగుతున్న మృగ మనస్తత్వాలను చాటుతున్నాయి. కొందరైతే ఆనవాళ్లు దొరక్కుండా రకరకాల వికృత రూపాల్లో హత్యలు చేయడం.. మృత దేహాలను ముక్కలు చేయడం..బూడిద చేయడం వంటి రాక్షస చర్యలకు పాల్పడుతున్నారు.

ఇదంతా ఇప్పుడెందుకు అంటే ఓ యువకుడు తనను మందలించిందన్న చిన్న కారణంతో ఓ 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సులు వేసిన కిరాతక వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ గా మారింది. వృద్ధురాలిని చంపడంతో ఆగని ఈ కిరాతకుడు మృతదేహంపై డాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియో తీసి మిత్రులందరికీ షేర్ చేశాడు. ఈ అమానవీయ కిరాతక సంఘటన హైదరాబాద్-కుషాయిగూడలో చోటుచేసుకుంది.

రాజస్థాన్‌కు చెందిన 70 ఏళ్ల కమలా దేవి మూడు దశాబ్దాల క్రితం తన భర్తతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చింది. కమలా భర్త 15 సంవత్సరాల క్రితం మరణించాడు. ఆమె ప్రస్తుతం కృష్ణ నగర్‌లోని 5వ వీధిలోని వారి ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు కమలా దేవి(70) ఇంట్లోని ఓ గదిలో యువకుడు అద్దెకు ఉంటున్నాడు.

అద్దె చెల్లింపు ఆలస్యంపై ఆ వృద్ధురాలు ఆ యువకుడిని గట్టిగా అడిగింది. అంతే.. ఆమెపై పగ పెంచుకున్న ఆ యువకుడు ఈ నెల 11వ తేదీన ఇనుప రాడ్‌తో వృద్ధురాలిపై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత చీరతో ఆమె తలను సీలింగ్ ఫ్యాన్‌కు కట్టి, తన సెల్ ఫోన్ కెమెరాను ఆన్ చేశాడు. మంచం మీద పాక్షికంగా వంగి ఉన్న ఆమె మృతదేహంపై డ్యాన్స్ చేసి, ఒక నిమిషం నిడివి గల వీడియోను రికార్డ్ చేశాడు. ఆ తర్వాత, తలుపు లాక్ చేసి, తాళం అక్కడే పడేసి వెళ్లిపోయాడు.

ఏప్రిల్ 13వ తేదీ రాత్రి బెంగళూరులో నివసించే బాధితురాలి బంధువుకు నిందితుడు స్వయంగా ఫోన్ చేసి హత్య విషయాన్ని తెలియజేశాడు. నిందితుడు చెప్పిన విషయాన్ని వృద్ధురాలి బంధువు నమ్మలేదు. దీంతో మృతదేహంపై డ్యాన్స్ చేస్తున్న వీడియోను అతనికి షేర్ చేశాడు. అది చూసిన కమలాదేవి బంధువు ఏప్రిల్ 14న కుషాయిగూడలో తనకు పరిచయం ఉన్న వ్యక్తికి ఈ సమాచారాన్ని తెలియజేశాడు.

అతను స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెళ్లి చూసేసరికి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా.. కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి పంపించారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన కృష్ణపాల్ సింగ్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.