Telangana Cabinet Expansion | మున్సిపోల్స్‌ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!

రాష్ట్రంలో అధికార పార్టీలో రసవత్తర రాజకీయాలు సాగుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత మంత్రివర్గం విస్తరణ చేపడుతారనే వార్తలు గాంధీభవన్‌లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు మంత్రులు లక్ష్యంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Telangana Cabinet Expansion | మున్సిపోల్స్‌ తర్వాత ముగ్గురు మంత్రులపై వేటు? తాజా పరిణామాలు ఆ దిశగానే!

విధాత, హైదరాబాద్ :

Telangana Cabinet Expansion| రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ మునిసి‘పోల్స్’ తరువాత ఏ క్షణంలో నైనా చేపట్టే అవకాశాలు ఉన్నాయన్న వార్త పొలిటికల్ సర్కిల్స్‌లో తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది నెలలుగా ఒక్కో మంత్రిని లక్ష్యం చేసుకుని దుష్ప్రచారాలు సాగుతున్నాయనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మంత్రివర్గం నుంచి తప్పించేందుకే ఒక పద్ధతి ప్రకారం ఈ ఆరోపణలు ప్రజా బాహుళ్యంలోకి వస్తున్నాయని కాంగ్రెస్ వర్గీయులు నమ్ముతున్నారు. ఇప్పటి వరకు నలుగురు మంత్రులపై వరుసగా ప్రచార ప్రసార సాధనాల్లో కథనాలు వచ్చాయి. ఈ కథనాలతో బాధిత మంత్రులు కలవరానికి గురవుతున్నారు. ఎప్పుడే మంత్రిపై వార్తలొస్తాయోనంటూ బిక్కుబిక్కుమంటున్నారనే చర్చ సాగుతున్నది. తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై వచ్చిన కథనం రాష్ట్రంలో రాజకీయంగా రచ్చ రచ్చ అయ్యింది. మంత్రి వర్గ విస్తరణ జరిగే లోపు ఇంకెంత మందిపై కథనాలు వస్తాయేనన్న టెన్షన్ కాంగ్రెస్ శ్రేణులను పట్టి పీడిస్తున్నది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత తొలిసారి మంత్రివర్గం కొలువుతీరింది. ఆ తరువాత మలి విడత విస్తరణలో ముగ్గురికి, ఆ తరువాత ఒక్కరికి అవకాశం లభించడంతో మొత్తం మంత్రివర్గం సంఖ్య 16కు చేరుకున్నది. ప్రస్తుతం రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవారిలో ముగ్గురు లేదా నలుగురిని తప్పించి, కొత్తగా ఆరేడుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని గాంధీ భవన్‌లో చర్చించుకుంటున్నారు.

రాష్ట్రంలో అక్రమ, నకిలీ మద్యం కట్టడి చేసేందుకు ఎక్సైజ్ విభాగం హై సెక్యురిటీ హోలోగ్రామ్, 2డీ బార్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత 11 సంవత్సరాలుగా ఒకే కంపెనీ వీటిని ఎక్సైజ్ విభాగానికి సరఫరా చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో టెండర్ దక్కించుకున్న కంపెనీనే ప్రత్యేక రాష్ట్రంలో 11 సంవత్సరాల పాటు కొనసాగించారు. ముఖ్యనేత జోక్యంతో అదే కంపెనీకి లేబుళ్ల కాంట్రాక్టు ఒప్పందం చేసుకోవడంతో గొడవ గతేడాది సెప్టెంబర్ నెలలో మొదలైంది. తన ప్రమేయం లేకుండా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయాలు తీసుకుంటున్నదని సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు అంతర్గత సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో పాటు ఖాళీ సీసాల వాటాల్లో కూడా మంత్రి, ముఖ్యనేత మధ్య విభేధాలు ఉన్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి క్వార్టర్ బాటిల్ పై మూడు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకూ ప్రభుత్వ పెద్దలకు కమీషన్ అందుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ మొత్తంలో 90 శాతం ముఖ్య నేత తీసుకుంటుండగా, 10 శాతం మాత్రమే సంబంధిత మంత్రికి అందుతుండటం కూడా లొల్లికి కారణమయ్యిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

గతేడాది అక్టోబర్ నెలలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోగా, ఆయన పై ఆరోపణలు ఉన్నందున నిలిపివేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావుకు లేఖ రాయడం, ఆ లేఖ లీక్ కావడం కూడా జరిగింది. అంతకు ముందు మద్యం కంపెనీల అనుమతుల విషయంలో ప్రభుత్వ ప్రమేయం లేకుండా బేవరేజెస్ కార్పొరేషన్ విధివిధానాలను ఎలా ఖరారు చేస్తుందని 2024 జూన్ నెలలో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

గతేడాది బీరు సరఫరా కోసం ఐదు కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వడంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో వెంటనే రద్ధు చేసిన విషయం తెలిసిందే. ఇలా వరుస వివాదాలకు తోడు పది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది.

చెక్ పోస్టులు, సహచర మంత్రిపై నోటి దురుసు

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై గత సంవత్సరం చివరలో ఆర్టీఏ చెక్ పోస్టుల తొలగింపుపై ఒక్కసారిగా వివాదంలా ముసురుకున్నది. చెక్‌పోస్టులను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ తొలగించకుండా కొనసాగించడం గమనార్హం. ఇంకా చెక్ పోస్టులు కొనసాగిస్తున్నారా, వెంటనే తొలగించండి.. అంటూ రవాణా శాఖ అధికారులను ఆదేశించడంతో గతేడాది అక్టోబర్ నెలలో రవాణా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. చెక్ పోస్టుల నుంచి కమీషన్లు వస్తుండటంతో వాటిని తొలగించలేదని అప్పట్లో పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు విన్పించాయి. కొత్తగా కొనుగోలు చేస్తున్న వాహన యజమానుల నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రవాణా ఉద్యోగులు ముక్కుపిండి పైసలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పాత విధానాన్ని రద్ధు చేసి, షోరూమ్‌లలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా రవాణా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక సమయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా? సహచర మంత్రిని విమర్శిస్తుంటే చూస్తావా? అంటూ మరో మంత్రి జీ వివేక్ వెంకటస్వామిని ఆయన నిలదీశారు. మంత్రి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, దళిత సంఘాలు భగ్గుమనడంతో వివాదం మరింత రాజుకున్నది. ఈ పరుష వ్యాఖ్యలపై లక్ష్మణ్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మంత్రులను తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

సమంత విడాకులు, రెడ్ల రాజ్యం నడుస్తోందన్న సురేఖ కూతురు

అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తలో నటుడు అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. ఆ ఆరోపణలు కోర్టు వరకు వెళ్ళాయి. ఆమెపై హీరో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. మేడారం టెండర్ల ఖరారు లో తన ప్రమేయం లేకుండా జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించడంతో సురేఖ, పొంగులేటి మధ్య విభేధాలు బట్టబయలు అయ్యాయి. పొంగులేటిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు సురేఖ ఫిర్యాదు కూడా చేశారు.

సూర్యాపేట జిల్లాలోని దక్కన్ సిమెంట్ కంపెనీ విషయంలో తన ఓఎస్డీ సుమంత్ పై ఆరోపణలు రావడం, అతన్ని తొలగించాలని ఆదేశించడంతో సురేఖ కుమార్తె ఘాటుగా విమర్శలు గుప్పించారు. తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారని, రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తోందని తీవ్ర విమర్శలు చేయడం రాష్ట్రంలోనే కలకలంగా మారింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ జోక్యంతో సురేఖ వెనక్కి తగ్గారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ప్రకటించడంతో గొడవ సద్దుమణిగింది. భర్త కొండా మురళీధర్ రావు కూడా జిల్లాలోని పలువురు నాయకులపై విమర్శలు చేయడం, వారు పీసీసీ అధ్యక్షుడుతో పాటు ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేశారు. సమంతపై చేసిన వ్యాఖ్యాల్లో ఎదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నానని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని సురేఖ ప్రకటించడంతో, నటుడు నాగార్జున కోర్టులో కేసును ఉపసంహరించుకున్నారు.

కుమారుడి కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా, ఖమ్మం జిల్లాలో అందరినీ గెలిపించుకుని వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. 2024 సెప్టెంబర్ నెలలో ఈడీ అధికారులు పొంగులేటి నివాసాలు, కార్యాలయాల్లో మెరుపు సోదాలు నిర్వహించింది. ఆయన బంధువులు, అనుచరుల నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా ఘర్షణలు, గొడవలు జరగకుండా సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించారు. ఆయన కుమారుడు హర్షారెడ్డి నిర్వహిస్తున్న రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీపై గచ్చిబౌలి పోలీసులు గత డిసెంబర్ నెలలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని తమ భూమిలోకి కొందరు అక్రమంగా చొరబడ్డారని, తాము రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి చెందినవాళ్లమంటూ తమ సిబ్బందిని బెదిరించారని పల్లవి షా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని బదిలీ చేయగా, ఉన్నతాధికారిని కూడా సాగనంపాలని ఆయన ముఖ్యమంత్రిని ఒత్తిడి చేశారనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ ఉదంతంతో పొంగులేటి అంతకు ముందు మాదిరిగా దూకుడుగా వ్యవహరించడం లేదని సన్నిహితులే చర్చించుకుంటున్నారు.

డిప్యూటీ సీఎం కు బొగ్గు మసి

తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను లక్ష్యం చేసుకుని ఒక పత్రికలో ప్రత్యేక కథనం రావడం పార్టీలో, ప్రభుత్వంలో సంచలనం కలిగించింది. ఒడిశా రాష్ట్రం నైనీ బ్లాక్ బొగ్గు గనుల టెండర్ల విషయంలో గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య వర్గపోరు స్పష్టంగా కన్పిస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వాటాల గొడవల్లో మహిళా ఐఏఎస్ అధికారులు బలయ్యారని, ఈ కుంభకోణం వెనకాల ఎవరున్నారో చెప్పాలని సీఎం, డిప్యూటీ సీఎం లను ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తనపై ఒక దినపత్రికలో ప్రత్యేక కథనం రావడంతో డిప్యూటీ సీఎం ఘాటుగా స్పందించారు. తాను రాజకీయాల్లోకి గాలి వాటంగా రాలేదని, నాలుగు దశాబ్ధాలు సభలో, బయట ఉండి పేదల కోసం పోరాడి వచ్చానని స్పష్టం చేశారు. ఏం ఆశించి రాశాడో, ఎవరి మెప్పు కోసం తనపై తప్పుడు కథనాలు ప్రచురించారో త్వరలోనే బయటపడుతుందని ఆయన తెలిపారు. విమర్శలు రావడంతో ఆయన నైనీ టెండర్లను రద్ధు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నైనీ టెండర్లపై టీవీలు, పేపర్లలో వార్తాలు వస్తున్నాయి, మా ప్రభుత్వంలో ఏ పనిలోనూ అవినీతి జరగడం లేదన్నారు. మీడియా యాజమాన్యాలకు గొడవలు ఉంటే మీరు మీరు చూసుకోవాలని, మంత్రులను బద్నాం చేయవద్దని ఆయన కోరారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు.

ఏది ఏమైనా.. ఈ మొత్తం వ్యవహారాల వెనుక రాబోయే రోజుల్లో చేపట్టే మంత్రి వర్గ విస్తరణ కీలక అంశంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Vehicle Registration | నేటి నుంచి షోరూమ్ లోనే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్స్
Winter Storm In US : అమెరికాను వణికిస్తోన్న మంచు తుపాను.. ఖాళీ అవుతున్న సూపర్‌ మార్కెట్లు
USA Crime News : అమెరికాలో భార్య సహా ముగ్గురి బంధువుల హత్య !